
టాలీవుడ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా)లో ఎన్నికల రచ్చ ఏ స్థాయిలో కొనసాగుతోందో తెలిసిందే. ఎన్నికలకు మూడు నెలల సమయం ఉండగానే.. ప్రచారం ముమ్మరం చేశారు. అధ్యక్ష బరిలో ముము సైతం అంటూ ఒక్కొక్కరిగా ప్రకటించుకున్నారు. ప్రధాన పోరు మాత్రం ప్రకాష్ రాజ్ – మంచు విష్ణు మధ్య కొనసాగుతోంది. అయితే.. ఏకగ్రీవం వంటి చర్చలు జరుగుతున్నప్పటికీ.. అది ఎంత వరకు సక్సెస్ అవుతుందన్న దానిపై క్లారిటీ లేదు. ఈ లోగా అభ్యర్థులు మాత్రం ఈక్వేషన్లలో బిజీగా ఉన్నారు.
ప్రకాష్‌రాజ్ సీరియస్ గా తన పని తాను చేసుకుంటూ వెళ్తున్నారు. తన వర్గం వారితో వరుస సమావేశాలు నిర్వహిస్తూనే ఉన్నారు. పూరీ జగన్నాథ్ ఇలాఖా (కేవ్)లో రహస్యంగా మంతనాలు జరిపారు. కానీ.. ఈ విషయం లీకవడంతో.. ఇలా కాదని, నేరుగా ఆఫీస్ ఓపెన్ చేశారు. ఫిల్మ్ నగర్ లో పెద్ద భవనం రెంటుకు తీసుకున్నారు. ఏం చేసైనా మా అధ్యక్ష పదవిని సొంతం చేసుకోవాలని చూస్తున్నారు ప్రకాష్ రాజ్. ఇప్పటికే అందరికన్నా ముందు ప్యానల్ ప్రకటించి, ముందుకు వెళ్తున్నారు.
అటు మంచు విష్ణు సైతం తన ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. తాజాగా ఓ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలు వెల్లడించారు. ‘మా’ సంస్థకు బిల్డింగ్ మాత్రమే తన ఎజెండా కాదని, పరిష్కరించాల్సిన సమస్యలు చాలా ఉన్నాయని అన్నారు. బిల్డింగ్ కోసం సహాయం చేసేందుకు ముందుకు వచ్చిన బాలకృష్ణ ధన్యవాదాలు తెలిపారు. ఇక, ప్రస్తుతం మా అధ్యక్షుడిగా ఉన్న నరేష్ పాలక వర్గం సినీ కార్మికులకు ఎంతో సహాయం చేసిందన్నారు. కరోనా కష్ట కాలంలో వారిని ఆదుకోవడం చాలా గొప్ప విషయమని అన్నారు. తన ఆలోచన కూడా ఇదేవిధంగా ఉందని, నమ్ముకున్న వాళ్లకు అండగా ఉండాలని భావిస్తున్నట్టు చెప్పారు.
ఇక, తనను విమర్శిస్తున్న కొందరిని పరోక్షంగా హెచ్చరించారు విష్ణు. పోలీస్ స్టేషన్లలో చిక్కుకొని, కటకటాలు లెక్కించాల్సిన కొంత మందిని తాను బయటకు తీసుకొచ్చినట్టు చెప్పారు. తెల్లవారుజాము వరకు స్టేషన్లో అండర్ వేర్ల మీద కూర్చోబెడితే.. పోలీసులకు సర్దిచెప్పి బయటకు తీసుకువచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయన్నారు. అలాంటి వారంతా ఇప్పుడు నోరు తెరుస్తున్నారని, వారు శృతిమించితే పేర్లు బయట పెడతానని హెచ్చరించారు. ఈ విధంగా.. మా ఎన్నికల వ్యవహారం వాడీవేడిగా కొనసాగుతూనే ఉంది. మరి, రాబోయే రోజుల్లో పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి.