‘మంచు లక్ష్మి’ నిత్యం సోషల్ మీడియాలో తన లేటెస్ట్ అప్ డేట్స్ గురించి, అలాగే సమాజంలోని పరిస్థుతుల గురించి ఎప్పటికప్పుడు యాక్టివ్ గా స్పందిస్తూ ఉంటుందనే విషయం తెలిసిందే. ఇక మంచు లక్ష్మి బుల్లితెర, వెండితెర పై సక్సెస్ ఫుల్ గా ఎలా రాణించిందో.. డిజిటల్ మీడియాలోనూ ఆమె అలాగే రాణిస్తూ.. తన కూతురు మంచు నిర్వాణ విద్యా ఆనంద్ తో కలిసి ఓ యూట్యూబ్ ఛానెల్ కూడా నిర్వహిస్తోంది.
ఆ ఛానెల్ లో డైలీ ఫిట్ నెస్ వీడియోలను అలాగే పిల్లల పెంపకం గురించి, పిల్లలు చేసే అల్లరి గురించి, ఆ అల్లరి తప్పు అని అర్థమయ్యేలా వారికి ఎలా చెప్పాలి ? లాంటి విషయాలను చిట్టి చిలకమ్మ అనే యూట్యూబ్ ఛానల్ లో పెడుతూ మొత్తానికి డిజిటల్ ప్లాట్ ఫామ్ లో మంచు లక్ష్మి తనదైన శైలిలో దూసుకుపోతుంది. ఈ ఛానెల్ బాగా సక్సెస్ అయింది కూడా.
అయితే మంచు లక్ష్మి చిట్టి చిలకమ్మ ఛానెల్ అకౌంట్ ను హ్యాక్ చేసి హ్యాకర్లు మంచు లక్ష్మికి షాకిచ్చారు. ఈ విషయాన్ని స్వయంగా మంచు లక్ష్మి తన అభిమానులతో పంచుకుంటూ ట్వీట్ చేశారు. నా యూట్యూబ్ ఛానల్ హ్యాకింగ్ కు గురైంది. హ్యాక్ చేసినవారు ఛానల్ లో ఎలాంటి వీడియోలు అయినా పెట్టొచ్చు. కాబట్టి ఛానెల్ లో వచ్చే తప్పుడు సమాచారాన్ని దయచేసి నమ్మొద్దు. నా టీం దీనిపై పనిచేస్తోందని, వీలైనంత త్వరగా అకౌంట్ రికవర్ అయ్యేలా చూస్తున్నాం అంటూ మంచు లక్ష్మి చెప్పుకొచ్చింది.