Mana ShankaraVaraPrasad Garu Trailer Review: మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi), అనిల్ రావిపూడి(Anil Ravipudi) కాంబినేషన్ లో తెరకెక్కిన ‘మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad garu) చిత్రం మరో 5 రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ ని కాసేపటి క్రితమే విడుదల చేశారు మేకర్స్. ఈ ట్రైలర్ పై మెగా అభిమానుల్లో మొదటి నుండి భారీ ఆశలు ఉన్నాయి. ఎందుకంటే ఈ సినిమాకు కేవలం కాంబినేషన్ హైప్ ఉంది కానీ, కంటెంట్ పరంగా మాత్రం ఎలాంటి హైప్ క్రియేట్ అవ్వలేదు. మీసాల పిల్ల పాట పెద్ద హిట్ అయ్యింది. ఆ తర్వాత వచ్చిన శశిరేఖ పాట యావరేజ్ అనిపించుకుంది, మెగా విక్టరీ మాస్ పాట కూడా యావరేజ్ రేంజ్ రెస్పాన్స్ నే సొంతం చేసుకుంది. ఇలాంటి సమయం లో ఈ సినిమాకు భారీ లెవెల్ లో హైప్ జనరేట్ అవ్వాలంటే కచ్చితంగా హైప్ కావాలి, ఆ హైప్ ఈ ట్రైలర్ ద్వారా వచ్చిందో లేదో చూద్దాం.
ఈ ట్రైలర్ లో చిరంజీవి ని పెళ్ళానికి భయపడే మొగుడి క్యారెక్టర్ లో చూపించాడు డైరెక్టర్ అనిల్ రావిపూడి. నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్, ఎలాంటి క్రిమినల్ ని అయినా ఉతికి పిండి ఆరేస్తాడు, కానీ పెళ్ళాం దగ్గర మాత్రం భయపడుతాడు. ఇలాంటి క్యారెక్టర్ చిరంజీవి చేసి దశాబ్దాలు అయ్యింది. హీరోలతో వీరోచితంగా పోరాటం చేయడం, లేదంటే సోషల్ మెసేజ్ సినిమాలు చేయడం మనం చూసాము. అంతే కాకుండా ఎంటర్టైన్మెంట్ సినిమాలు చేయడం కూడా చూసాము. కానీ ఇలా కట్టుకున్న భార్య కి భయపడే భర్త క్యారెక్టర్ చేయడం మాత్రం ఇదే తొలిసారి. చాలా ఫన్నీ గా అనిపించింది కానీ, చిరంజీవి లుక్స్ మాత్రం చాలా తేడా గా అనిపించింది. బాగా తగ్గిపోయాడు, ముఖం లో కల తప్పింది. అయితే స్టోరీ చూస్తే రొటీన్ లాగానే ఉంది.
భార్య భర్తలు విడిపోతారు, వీళ్ళ మధ్య గ్యాప్ ఉంటుంది, వీళ్లకు ఒక పాప కూడా ఉంటుంది , ఆ పాప కోసం చిరంజీవి తపన పడడం వంటివి ఈ చిత్రం లో చూపించినట్టు ఉన్నారు. డాడీ సినిమా నుండి ఇలాంటివి చాలానే చూసాము. మళ్లీ ఇందులో కూడా అదే కాన్సెప్ట్ అంటే ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి. ఇక ట్రైలర్ చివరి షాట్ లో వెంకీ మాస్ ఎంట్రన్స్ ఇవ్వడం, ‘ఫ్యామిలీ మ్యాన్ అన్నావు..ఇలా మాస్ ఎంట్రీ ఇచ్చావ్ ఏంటి?’ అని చిరంజీవి వెంకీ ని చూసి అంటాడు, అప్పుడు వెంకీ ‘మాస్ కా బాప్ అన్నావు..ఇప్పుడు నువ్వు ఫ్యామిలీ మ్యాన్ అయిపోలేదా..ఇది కూడా అంతే’ అని అంటాడు. వీళ్ళ మధ్య సంభాషణ , కెమిస్ట్రీ చాలా చక్కగా కుదిరింది. ఆన్ స్క్రీన్ మీద ఎలా ఉంటుందో చూడాలి.