Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబుకి మిస్టర్ పర్ఫెక్ట్ అనే పేరుంది. ఆయన వివాదాలకు దూరంగా ఉంటారు. షూటింగ్ అయ్యాక కుటుంబమే ఆయన ప్రపంచం. తక్కువ మంది మిత్రులను కలిగి ఉన్నారు. ఫ్రెండ్స్ తో పార్టీలు అంటే పెద్దగా ఆసక్తి చూపరు. రోజూ వ్యాయామం, ఆరోగ్యకర ఆహారపు అలవాట్లు ఆయన సొంతం. ఎంత పర్ఫెక్ట్ గా ఉన్నా ఆయన కూడా మనిషే. మహేష్ బాబుకి కూడా కొన్ని వ్యసనాలు ఉన్నాయి. గతంలో మహేష్ బాబు ఎక్కువగా సిగరెట్లు తాగేవాడట. ఆ వ్యసనం నుండి బయటపడేందుకు చాలా సమయం పట్టిందని మహేష్ స్వయంగా వెల్లడించారు.
కాగా ప్రస్తుతం ఆయన్ని మరో వ్యసనం వేధిస్తుందట. అదే మొబైల్. ఖాళీగా ఉంటే దాన్ని చూడకుండా ఉండలేకపోతున్నాడట. మొబైల్ చూసి చూసి తలనొప్పి వచ్చినప్పుడు పక్కన పెట్టేయాలని అనుకుంటారట. ఉదయం నిద్ర లేవగానే మొబైల్ చూసే అలవాటు ఉందని మహేష్ ఒప్పుకున్నారు. మొబైల్ ని తక్కువగా వాడాలని ఎంత ప్రయత్నం చేసినా వల్ల కావడం లేదట. మొబైల్ వ్యసనం తనను కూడా వెంటాడుతోందని మహేష్ బాబు వెల్లడించారు.
తనకు గాడ్జెట్స్ భార్య నమ్రత తెచ్చిపెడుతుందట. ఇక షూటింగ్స్ లేకపోతే ఫ్యామిలీతో ట్రిప్స్ కి వెళ్లడం ఇష్టపడతారట. మహేష్ బాబు ఫౌండేషన్ పేరుతో సామాజిక సేవ చేస్తున్న మహేష్ బాబు అందుకు కొడుకు గౌతమ్ కరణం అన్నారు. గౌతమ్ పుట్టినప్పటి నుండి సోషల్ సర్వీస్ చేస్తున్నట్లు వెల్లడించారు. ఓ సంస్థకు సితార బ్రాండ్ అంబాసిడర్ గా చేయడం సంతోషం కలిగించిందని మహేష్ చెప్పుకొచ్చారు.
పనిలో పనిగా గుంటూరు కారం మూవీపై ఉన్న ఊహాగానాలను ఆయన తొలగించారు. గుంటూరు కారం షూటింగ్ సవ్యంగా సాగడం లేదు. ప్రకటించిన విధంగా సంక్రాంతికి రావడం కష్టమే అన్నమాట వినిపిస్తుంది. ఈ పుకార్లపై మహేష్ కొట్టిపారేశారు. చెప్పినట్లు గుంటూరు కారం విడుదల ఉంటుందని అన్నారు. ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న మహేష్ బాబు ఈ విశేషాలు చెప్పుకొచ్చారు. ఇటీవల గుంటూరు కారం లేటెస్ట్ షెడ్యూల్ మొదలైంది. రూ. 4 కోట్లతో ఓ సెట్ ఏర్పాటు చేసినట్లు సమాచారం.