దర్శక ధీరుడు రాజమౌళి – సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం జక్కన్న చెక్కుతున్న RRR పూర్తి అయిన తర్వాత ఈ సినిమాను తెరకెక్కించబోతున్నాడు. RRR అక్టోబరు 13న రిలీజ్ చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో మరోసారి వాయిదా పడుతుందని కూడా అంటున్నారు.
ఇటు మహేష్ సర్కారువారి పాట సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. ఈ సినిమాను వచ్చే సంక్రాంతికి షెడ్యూల్ చేస్తున్నారు. అంటే.. ఆగస్టు నాటికే ఈ చిత్రం షూట్ కంప్లీట్ కాబోతోంది. RRR పూర్తయిన తర్వాత మహేష్ మూవీ ఎప్పుడు మొదలవుతుందో తెలియదు. అందుకే.. ఈ గ్యాప్ లో మరో సినిమా చేయబోతున్నాడు మహేష్. ఈ మేరకు త్రివిక్రమ్ లైన్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. అన్నీ కుదిరితే ఉగాది రోజునే అనౌన్స్ కూడా అంటున్నారు.
ఇదంతా ఒకేగానీ.. రాజమౌళి మహేష్ ను ఎలా చూపించబోతున్నాడు అన్నదే అసలు ప్రశ్న. ప్రిన్స్ అభిమానులతోపాటు సాధారణ ప్రేక్షకుల్లోనూ ఈ ఆసక్తి ఉంది. జక్కన్న టేకింగ్ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. మరి, మహేష్ లాంటి స్టార్ ను ఆయన ఏ క్యారెక్టర్లో చూపించబోతున్నాడు? కథ ఏంటీ? అన్న విషయాలు అత్యంత క్యూరియాసిటీని రేకెత్తిస్తున్నాయి
అందుతున్న సమాచారం ప్రకారం.. ఛత్రపతి శివాజీగా మహేష్ ను చూపించబోతున్నాడట రాజమౌళి. మరోసారి పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ నే ఎంచుకుంటున్నాడని, శివాజీ కథనే సినిమాగా మలచబోతున్నాడని ఫిల్మ్ నగర్లో న్యూస్ చక్కర్లు కొడుతోంది. నిజంగా.. ఇది జరిగితే మాత్రం మరో సెన్సేషన్ నమోదవడం ఖాయం. మరి, ఏం జరుగుతుంది? ఇందులో వాస్తవం ఎంత? అన్నది చూడాలి.