వైద్యో నారాయణో హరీ.. ప్రాణం పోసే వైద్యుడిని దేవుడితో పోల్చారు పెద్దలు. మరి అలాంటి వైద్యులకు ప్రోత్సాహం అందించి, వారి వైద్యం సామాన్యులకు కూడా అందేలా చేసే వ్యక్తి కూడా దేవుడే. ఈ విషయంలో మహేష్ కూడా దేవుడే. తనవంతుగా సాధ్యమైనంత వరకు వైద్య సేవ చేస్తున్నారు మహేష్. అయితే, మూడేళ్ళ క్రితం మహేష్ కి అనారోగ్య సమస్యలు తలెత్తాయి. సరిగ్గా నిద్ర కూడా పట్టేది కాదు.
ఆ సమయంలో డాక్టర్ సత్య సింధూజ గారిని సంప్రదించి ‘చక్రసిద్ధ’ వైద్యం చేయించుకున్నాడు. ‘చక్రసిద్ధ’తో తన అనారోగ్య సమస్యల నుండి బయట పడ్డాడు మహేష్. అందుకే, ఈ ‘చక్రసిద్ధ’ వైద్యం ద్వారా తాను పూర్తి ఆరోగ్యాన్ని పొందినంటే.. సామాన్య ప్రజలు కూడా ఆరోగ్యవంతులు కావాలని, ఇలాంటి గొప్ప వైద్యం అందరికీ అందుబాటులో రావాలని చక్రసిద్ద వైద్యశాలని ప్రారంభించారు.
హైదరాబాద్ శంకర్ పల్లి లో డాక్టర్ సత్య సింధూజగారు నూతనంగా ఏర్పాటు చేసిన ఈ ‘చక్రసిద్ద’ వైద్యశాలని మహేష్ తన సతీమణి నమ్రతతో కలిసి ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో యాంకర్ సుమ – రాజీవ్ కనకాల దంపతులతో పాటు ప్రముఖ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి కూడా పాల్గొన్నారు. ప్రస్తుతం ఈ వేడుక ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి .
మహేష్ బాబు ఈ కరోనా సమయంలో తన సొంత ఊరులో వ్యాక్సినేషన్ డ్రైవ్ ను ఏర్పాటు చేసి వేల మందికి ఉచితంగా వ్యాక్సిన్ వేయించారు. గతంలో వేలాది చిన్నారి గుండెలను కాపాడారు మహేష్. అందుకే, మహేష్ బాబు రీల్ లైఫ్ లోనే కాదు, రియల్ లైఫ్ లోనూ సూపర్ స్టార్.