
మహేష్ బాబు.. స్టార్ డమ్ కే సూపర్ స్టార్. ఈ రోజు మహేష్ 46వ పుట్టిన రోజు. 46 వసంతాలు పూర్తి చేసుకుని 47 లోకి అడుగుపెడుతున్న రోజు. అయినా ఇప్పటికీ మహేష్ టాలీవుడ్ కి యువరాజే.. ఏజ్ నెంబర్ పెరిగేకొద్దీ మహేష్ వయసు తగ్గుతోందనిపిస్తుంది. ‘రాజకుమారుడు’ చిత్రం నుంచి ‘సర్కారు వారి పాట’ వరకు సినిమా సినిమాకి యంగ్ లుక్ లోకి మారిపోతున్నాడు. అందుకే మహేష్ గురించి తెలుసుకోవాల్సిన ప్రతి ఒక్కరికీ ఆసక్తి ఉంటుంది.
మరి ఇప్పటి వరకు.. వివిధ సందర్భాల్లో, పలు ఇంటర్వ్యూల్లో తన గురించి, తన జీవితంలో జరిగిన సంఘటనల గురించి మహేష్ ఏమి చెప్పాడో విందాం. మహేష్ కి ఖాళీ సమయం దొరికితే ముందు చేసే పని.. సినిమాలు చూడటం, ఈత కొట్టడం, తన పిల్లలతో ఆడుకోవడం అట. క్రికెట్ విషయంలో.. ‘నాకు టెస్టు క్రికెట్ అంటే చాల ఇష్టం. ధోనీ, కోహ్లీ అంటే ఇష్టం. కానీ చిరకాల అభిమాన అటగాడు మాత్రమే సచినే’ అని ఓ ఇంటర్వ్యూలో మహేష్ చెప్పాడు.
ఫుడ్ విషయానికి వస్తే.. హైదరాబాద్ బిరియానీ అంటే మహేష్ కి చాలా ఇష్టం అట. జంక్ ఫుడ్ విషయానికొస్తే బర్గర్, పిజా ఇష్టపడతాడు, అలాగే మహేష్ ఎక్కువగా కాఫీ తాగుతాడు. ఇక ఇంట్లో చేసిన పిండి వంటలను బాగా ఇష్టపడతాడట. ముఖ్యంగా తన చిన్నతనంలో తన అమ్మమ్మగారు వండి పెడితే పోటీపడి తినేవాడట.
మహేష్ తన తొలి సినిమాలో నటించలేక భయపడి పారిపోయాడట. ఆ తర్వాత యూనిట్ వాళ్లు బిస్కట్లు, చాకెట్లు ఇస్తే నటించాడట. ఇష్టమైన ప్రదేశం గురించి ఓ సందర్భంలో మహేష్ చెబుతూ.. ‘ఇండియాలో అయితే నాకు గోవా అంటే చాలా ఇష్టం. అలాగే విదేశాల్లో అయితే న్యూజిలాండ్ ను ఎక్కువగా ఇష్టపడతాను. అందుకే ఎక్కువగా పిల్లలతో అక్కడికే విహారయాత్రకు వెళ్తుంటాను’.
అందరూ బాలీవుడ్ లో సినిమా ఎప్పుడు ? అని అడుగుతుంటారు. నాకు టాలీవుడే శ్వాస. తెలుగు ప్రేక్షకుల ఆశీస్సులే నాకు ముఖ్యం. నేను వీళ్లను ఆనందంగా ఉంచితే చాలు’ అంటూ పాన్ ఇండియా ఛాన్స్ లు వచ్చినా సున్నితంగా తిరస్కరిస్తూ వస్తున్నాడు మహేష్.