‘మా’ ఎన్నికలు ఇప్పుడు కాక రేపుతున్నాయి. ప్రకాష్ రాజ్ ఎంట్రీతో లోకల్ – నాన్ లోకల్ వివాదం రాజుకుంది. ఇప్పటికే సినిమా కళాకారులకు స్థానికత లేదని.. తామంతా భారతీయ కళాకారులం అని ప్రకాష్ రాజ్ ఇప్పటికే ప్రకటించారు.
భారతదేశంలో పుట్టిన పౌరులందరూ లోకల్ యేనని సినీ నటుడు సుమన్ వ్యాఖ్యానించారు. జాతీయ వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం అమీర్ పేటలోని అస్టర్ ప్రైమ్ ఆస్పత్రిలో సుమన్ పాల్గొని మాట్లాడారు. వైద్యుల గొప్పతనంపై మాట్లాడారు.
‘మా’ ఎన్నికల వ్యవహారంపై స్పందించారు. ‘మా’ ఎన్నికల కారణంగా తెరపైకి వచ్చిన లోకల్ నాన్ లోకల్ అంశంపై అసహనం వ్యక్తం చేశారు. అసలు అదో అర్థరహిత వాదన అని.. దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరూ లోకల్ కిందే లెక్క అని స్పష్టం చేశారు. అందరూ కలిసికట్టుగా ఉండాలని.. లోకల్-నాన్ లోకల్ అనే వ్యవహారం గురించి ప్రస్తావించడం అర్థరహితం అని అన్నారు.
ఇలానే వైద్యులు, రైతులు కూడా నాన్ లోకల్ అంటే ప్రజలకు చికిత్స, ఆహారం అందదని సుమన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇక సుమన్ తన మద్దతును ప్రకాష్ రాజ్ ఉంటుందని పరోక్షంగా తెలిపారు.
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు రోజురోజుకీ ఉత్కంఠగా మారుతున్నాయి. ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది మొత్తం ఐదుగురు సభ్యులు అధ్యక్ష పదవి కోసం బరిలోకి దిగుతున్నారు. దీంతో ఈ ఏడాది ఎన్నికల్లో ఎవరు గెలవనున్నారా? అని సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.