MAA Elections:‘మా’ ఎన్నికలు రసవత్తరంగా సాగుతున్నాయి. పోలింగ్ బూత్ లోనే మోహన్ బాబు ఆగ్రహతో చంపేస్తానంటూ నటుడు బెనర్జీని కొట్టబోయాడు. ఇక పోలింగ్ బూత్ బయట ‘దొంగ ఓటరు’ను పట్టుకోవడానికి ప్రయత్నించిన నరేశ్ తో వాగ్వాదానికి దిగిన ప్రకాష్ రాజ్ దాదాపు కొట్టుకోబోయారు. లోపల కొట్టుకుంటూ బయటకు మాత్రం నవ్వులు చిందిస్తూ సెల్ఫీలు దిగుతున్నారు ప్రకాష్ రాజ్, మంచు విష్ణు వర్గాలు.

మా ఎన్నికలు వాడివేడీగా సాగుతున్నాయి. హైదరాబాద్ జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్ లో రసవత్తరంగా జరుగుతున్నాయి. చిరంజీవి, పవన్, బాలయ్య, నాగార్జున సహా చాలా మంది సినీ ప్రముఖులు ఈ ఎన్నికల్లో ఓటు వేయడానికి తరలివచ్చారు. ఈ క్రమంలోనే మధ్యాహ్నం 2 గంటల వరకు పోలింగ్ ముగియాల్సి ఉండగా.. దాదాపు 100 మంది వరకు ఓటర్లు బారులు తీరడంతో పోలింగ్ సమయాన్ని గంట పాటు పెంచారు.
మధ్నాహ్నం 2 గంటలకు ముగియనున్న ‘మా’ ఎన్నికల పోలింగ్ ను మరో గంటపాటు పొడిగిస్తున్నట్లు ఎన్నికల అధికారి కృష్ణమోహన్ తెలిపారు. ఈ విషయమై ఇరు ప్యానెళ్లతో ఎన్నికల అధికారులు చర్చించారు. ఇరువురు ఒప్పుకున్నారు. దీంతో ‘మా’ ఎన్నికల పోలింగ్ 3 గంటల వరకూ కొనసాగనుంది.
మధ్యాహ్నం 2 గంటల వరకూ మా ఎన్నికల్లో 60శాతానికి మించి పోలింగ్ నమోదైంది. ఇప్పటివరకూ 545 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. క్యూలైన్లో 100 మంది వరకూ ఉన్నారు.
చాలా మంది ట్రాఫిక్ లో ఇరుక్కున్నారని.. ఓటు వేయడానికి వస్తున్నారని.. అందుకే పోలింగ్ సమయాన్ని పెంచాలని ఎన్నికల అధికారులను మంచు విష్ణు కోరారు. దీంతో మరో గంట పాటు పొడిగించారు. ట్రాఫిక్ లో ఇరుక్కొని ఉంటే నాకు ఫోన్ చేయండని.. పోలీసుల సహకారం తీసుకొని ఓటేయండని మంచు విష్ణు కోరాడు.