
MAA Elections 2021: టాలీవుడ్ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల వ్యవహారం మరోసారి తారస్థాయికి చేరింది. కొన్ని రోజులుగా చల్లబడిన వ్యవహారం.. తిరిగి వేడెక్కింది. అధ్యక్ష బరిలో నిలిచిన జీవిత, హేమ ప్రకాష్ రాజ్ ప్యానల్ లో చేరిపోవడంతో అంతా షాకయ్యారు. ఆ తర్వాత అదే ప్యానల్ కు చెందిన బండ్ల గణేష్ బయటకు రావడం.. మరో ట్విస్టుగా మారింది. ఇప్పుడు ‘మా’ బిల్డింగ్ వ్యవహారం హాట్ టాపిక్ అయ్యింది. ఈ అంశంపై తాజాగా మాట్లాడిన మెగా బ్రదర్ నాగబాబు.. మోహన్ బాబుకు ఆన్సర్ తో కూడిన కౌంటర్ ఇచ్చారు. మరోసారి రిపీట్ అయితే బాగుండదని కూడా పరోక్షంగా హెచ్చరించారు. అదే సమయంలో ప్రస్తుత అధ్యక్షుడు నరేష్ పైనా విమర్శలు గుప్పించారు. దీంతో.. వ్యవహారం ముదురుపాకాన పడినట్టైంది. ఇంతకీ.. నాగబాబు ఏమన్నారో చూద్దాం.
‘‘మా అసోసియేషన్ సభ్యులను ఉద్దేశించి మాట్లాడుతున్నాను. ప్రకాష్ రాజ్ ను ‘మా’ అధ్యక్షుడిగా మేమంతా బలపరుస్తున్నాం. అయితే.. ఎన్నికల ప్రచారంలో మేం ప్రకాష్ రాజ్ శక్తి సామర్థ్యాల గురించి మాత్రమే మాట్లాడాలని, మిగిలిన అంశాల గురించి మాట్లాడొద్దని అనుకున్నాం. కానీ.. కొంత మంది మాత్రం వివాదాలు రేకెత్తించాలని చూస్తున్నారు.
మా అసోసియేషన్ కు నేను ప్రెసిడెంట్ గా ఉన్న 2006 నుంచి 2008 కాలంలో ఒక బిల్డింగ్ కొన్నాం. అంతకు ముందు నుంచే బిల్డింగ్ సమస్య ఉంది. ఛాంబర్ వాళ్లు మమ్మల్ని ఖాళీ చేయాలని ఒత్తిడి తెచ్చేవారు. అల అప్పుడు కొత్త బిల్డింగ్ కొనాల్సి వచ్చింది. కానీ.. ప్రతిసారీ ఎన్నికల్లో మా బిల్డింగ్ కొన్నారు.. అమ్మారు అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఎవరో చిన్నవాళ్లు అంటే.. నేను స్పందించే వాడిని కాదు. కానీ.. మోహన్ బాబు లాంటి వారు అడిగారు.
మొన్న మా అసోసియేషన్ జూమ్ మీటింగ్ జరిగింది. అది బయటకు రాకూడదు. ఎలా బయటకు వచ్చిందో.. కండక్ట్ చేసిన వాళ్లు చూసుకోవాలి. ఇందులో మోహన్ బాబు గారు ఎందుకు మా బిల్డింగ్ కొన్నారు? ఎందుకు అమ్మారు? అంటూ అడిగారు. కానీ.. ఆయన నా పేరు ఎత్తలేదు. మోహన్ బాబు గారు ఇండస్ట్రీలో ఓ పెద్ద మనిషి. ఆయన అడగడంలో తప్పులేదు. ఇది ఆరోజే అడగాల్సింది. కానీ.. ఇంత ఆలస్యంగా అడిగారు. దాదాపు 14 ఏళ్లు అవుతోంది. ఇప్పుడు ఎన్నికల్లో భాగంగానే అడిగి ఉండొచ్చు. ఎన్నికల్లో విష్ణుగారిని సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి అడిగి ఉంటారు. మంచిదే. మోహన్ బాబుగారూ ఇది మీ కోసమే వినండి.
ఛాంబర్ ఆఫ్ కామర్స్ వాళ్లు బిల్డింగ్ ఖాళీ చేయాలని ఒత్తిడి చేయడంతో.. కొత్తది కొనుగోలు చేయాని అనుకున్నాం. ఆ సమయంలో ‘మా’ వద్ద దాదాపు కోటి ఇరవై, ముప్పై లక్షలు ఉన్నాయి. పరుచూరి గోపాలకృష్ణ సలహా మేరకు శ్రీనగర్ కాలనీలోని డైరెక్టర్స్ అండర్ రైటర్స్ అసోసియేషన్ బిల్డింగ్ కు దగ్గర్లో ఒక భవనం కొన్నాం. అందరికీ అందుబాటులో ఉంటుందని పరుచూరి గారు చెప్పడంతో అక్కడే కొన్నాం. 140 స్క్వేర్ యార్డ్స్ స్థలంలో ఉన్న ఆ భవనాన్ని 71 లక్షలకు కొన్నాం. మరో మూడు లక్షలతో బాగు చేయించాం. ఇంకో 15 లక్షలతో రెన్యువేట్ చేయించాం. మొత్తం 96 లక్షలు ఖర్చైంది.
అయితే.. ఆ తర్వాత 2017లో శివాజీ రాజా అధ్యక్షుడిగా, నరేష్ జనరల్ సెక్రెటరీగా ఉన్న సమయంలో అమ్మేశారు. అది కూడా చాలా తక్కువ రేటుకే అమ్మేశారు. దాన్ని నడపడం భారమైందనే కారణం చెప్పారు. ఎలా భారమైందో చెప్పాలి. పైగా.. 95 లక్షలకు ఎస్టిమేట్ చేసి.. 35 లక్షలకు బేరం పెట్టేశారు. చివరకు 30 లక్షల 90 వేలకు అమ్మేశారు. దాని విలువ ఎక్కువ ఉంటుందని చెప్పినా వినలేదు. అయితే.. ఇప్పుడు ఆ భూమి విలువే దాదాపు కోటీ 40 లక్షలు. అమ్మగా వచ్చిన 30 లక్షలు ఏం చేశారో కూడా తెలియదు.
అంత తక్కువకు బిల్డింగ్ అమ్మింది కూడా నరేష్. అంటే.. ఇప్పుడు మీకు మద్దతుగా తిరుగుతున్న వారే. ఎందుకు కొనాల్సి వచ్చిందో నేను చెప్పాను. ఇక, ఎందుకు అమ్మాల్సి వచ్చిందో ఆయన్ను చెప్పమనండి. మాకు కూడా చెప్పండి. ఇంకోసారి ఎవరైనా ఎందుకు కొన్నారు అంటూ పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేస్తే చాలా తీవ్రంగా స్పందించాల్సి ఉంటుంది. దయచేసి ఆ పరిస్థితిని తీసుకురావొద్దు’’ అంటూ స్పందించారు నాగబాబు.
మెగా బ్రదర్ వ్యాఖ్యలతో ఇండస్ట్రీలో కలకలం రేగింది. మోహన్ బాబుకు సమాధానం చెప్పిన ఆయన.. బాల్ ను నరేష్ కోర్టులోకి తోసేశారు. మంచు విష్ణుకు మద్దతుగా ప్రస్తుత మా అధ్యక్షుడు నరేష్ ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నరేష్ ఎలాంటి సమాధానం చెబుతారు? అన్నది ఆసక్తికరంగా మారింది.