MAA Elections 2021: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికల్లో రాజకీయాలు మొదలయ్యాయి. సామాజిక వర్గాల వారీగా ఓట్లు వేయించుకునేందుకు పావులు కదుపుతున్నారు. ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు రెండు వర్గాలుగా తమ గెలుపు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకరిని మించి మరొకరు విందులు నిర్వహిస్తూ సభ్యులను ప్రసన్నం చేసుకునే పనిలో పడిపోయారు. అక్టోబర్ 10న ఎన్నికలు జరిగే నేపథ్యంలో ఇరువురు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఎమ్మెల్యే, మున్సిపల్ ఎన్నికలను తలదన్నేలా చేస్తున్నారు. లంచ్ లు, డిన్నర్ ల పేరుతో పార్టీలు నిర్వహిస్తున్నారు.
ఆదివారం హైదరాబాద్ లోని ఓ ప్రముఖ ఎవెన్యూలో నటుడు ప్రకాశ్ రాజ్ పార్టీ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఈ వేదికపైనే అసంతృప్తులను బుజ్జగించే పనిలో పడిపోయినట్లు సమాచారం. సహపంక్తి భోజనాలు అంటూ అందరిని ఆకర్షిస్తూ తమకు ఓటు వేయించుకోవాలని చూస్తున్నారు. మరో వైపు మంచు విష్ణు కూడా తమను గెలిపించాలని అభ్యర్థిస్తూ ప్రచారం నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.
ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ పోటీదారుల్లో ఆందోళన నెలకొంటోంది. సామాజికవర్గాల వారీగా ఆర్టిస్టులు విడిపోయి ప్రచారం సాగిస్తున్నట్లు సమాచారం. ఇది ప్రతిసారి జరుగుతున్న ఎప్పుడు కూడా బయటకు రానీయలేదు. కానీ ఈసారి మాత్రం ఎలాగైనా విజయమే ప్రధానంగా ముందుకు నడుస్తున్నట్లు తెలుస్తోంది. సామాజిక వర్గాలను తెరపైకి తీసుకొచ్చి పైచేయి సాధించాలని చూస్తున్నట్లు చెబుతున్నారు.
మూవీ అసోసియేషన్ లో దాదాపు 950 సభ్యులుండగా ఎవరిని విజయం వరిస్తుందో అని అందరిలో ఉత్కంఠ నెలకొంది. సమయం దగ్గర పడుతున్న కొద్ది అందరిలో ఒకటే ఆతృత ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఎవరికి ఓటు వేసి గెలుపు ముంగిట నిలుపుతారో అని సభ్యులందరు ఎదురు చూస్తున్నారు.