MAA Elections 2021: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు(Movie Artist Elections) ‘(మా)’ టాలీవుడ్ లో సెగలు రేపుతున్నాయి. ‘మా’ రాజకీయం రోజురోజుకీ హీటెక్కిస్తుంది. ఇప్పటికే ప్రకాష్ రాజ్, మంచు విష్ణు వర్గాలుగా ‘మా’ విడిపోయింది. ఎవరికి వారు విందు రాజకీయాలు చేస్తూ సినీ ప్రముఖులను ఆకర్షిస్తున్నారు. మాటల తూటాలు పేలుస్తున్నారు. అయితే టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి రంగంలోకి దిగి క్రమశిక్షణ సంఘానికి లేఖ రాయడంతో అందరి నోళ్లకు మూతలు పడ్డాయి.
ఇక ఇప్పుడు మళ్లీ మా’లో లొల్లి మొదలైంది. బండ్ల గణేష్ (Bandla Ganesh) ఏకంగా ‘ప్రకాష్ రాజ్ (Prakash Raj) వర్గం నుంచి బయటకు వచ్చి తిరుగుబాటు జెండా ఎగురవేశారు. మాలోని ‘జీవిత’పై విమర్శలు చేశాడు. ఈ వివాదంలోకి చిరంజీవి ఫ్యామిలీని లాగారు. చిరంజీవి (Chiranjeevi) ఎంత చెప్పినా కూడా సినీ సెలబ్రెటీలు తమ పంతాలు పట్టింపులు, కోపతాపాలు తగ్గించుకోవడం లేదని తేలిపోయింది.
రెండు వర్గాలుగా విడిపోయిన టాలీవుడ్ ప్రముఖులను ఒక్కతాటిపైకి తీసుకురావడం కష్టమన్న విషయం చిరంజీవికి అర్థమైంది. అందుకే ‘మా’ ఎన్నికల్లోకి చిరంజీవి ప్రత్యక్షంగా దిగడం లేదు. తన మద్దతు అన్నది వీరికే అనడం తెలుపడం లేదు. చిరంజీవి తమ్ముడు నాగబాబు మాత్రం ఇప్పటికే తన మద్దతును ‘ప్రకాష్ రాజ్ వర్గానికి’ తెలియజేశాడు. చిరంజీవి మద్దతు కూడా ప్రకాష్ రాజ్ కేనని అంటున్నా మెగాస్టార్ మాత్రం ఇప్పటిదాకా బహిరంగంగా దీనిపై స్పందించలేదు. మద్దతుపై మాట్లాడలేదు.
ఒకప్పుడు దాసరి నారాయణరావులా ఇప్పుడు చిరంజీవి తెలుగు సినిమా ఇండస్ట్రీ పెద్దగా వ్యవహరించాలని డిసైడ్ అయ్యాడు. అటు తెలంగాణ సీఎం కేసీఆర్ తో.. ఇటు ఏపీ సీఎం జగన్ తోనూ ఆయన సన్నిహిత సంబంధాలు నెరుపుతూ టికెట్ రేట్ల నుంచి థియేటర్ షో ల వరకూ సానుకూలత తీసుకొస్తున్నారు. అందరివాడుగా ఉన్నాడు.
అందుకే ఈ ‘మా’ ఎన్నికల గొడవలతో తాను ఇన్ వాల్వ్ కావద్దని.. ఒకవేళ చిరంజీవి మద్దతు ఇచ్చిన వ్యక్తి ఓడిపోతే చిరంజీవికే పరువు పోతుందని గ్రహించి ఈ ఎన్నికలకు దూరంగా ఉండి పెద్దరికం కాపాడుకోవాలని చిరంజీవి డిసైడ్ అయినట్టు టాలీవుడ్ లో ఓ టాక్ నడుస్తోంది.