Sri Sri- Super Star Krishna: శ్రీశ్రీ అభ్యుదయ సాహిత్యానికి గ్రంథాలయం లాంటివారు. ఆయన రచనలు వర్థమాన రచయితకు, ఫిలిం మేకర్స్ కి రిఫరెన్స్ గా నిలిచాయి. ఆయన రాసిన మహాప్రస్థానం వెలకట్టలేని కావ్యం. విప్లవ భావాలు కలిగిన శ్రీశ్రీ రచనలు జనాలను చైతన్య పరిచయాయి. ఆయన అక్షరాలు పాఠకులను తట్టిలేపాయి. ఉద్యమ కాంక్షను పురిగొల్పాయి. శ్రీశ్రీలో శృంగార కోణం కూడా ఉంది. సినిమా పాటల్లో రసికత, ప్రేమ భావాలు పలికించారు. ఎప్పటికీ సాహిత్యాభిలాషులు ఆయన్ని గుర్తు చేసుకుంటున్నారు.
శ్రీశ్రీ పూర్తి పేరు శ్రీరంగం శ్రీనివాసరావు. 1910 ఏప్రిల్ 30న విశాఖపట్నంలో జన్మించారు. శ్రీశ్రీ పలు సినిమాలకు పాటలు రాశారు. ఒకసారి జాతీయ అవార్డు అందుకున్నారు. 1974లో విడుదలైన అల్లూరి సీతారామరాజు ఆల్ టైం టాలీవుడ్ బ్లాక్ బస్టర్ గా ఉంది. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జీవిత గాధ ఆధారంగా అది తెరకెక్కింది. చెప్పాలంటే ఈ సినిమా వచ్చే వరకూ తెలుగు స్వాతంత్య్ర సమరయోధుడు గురించి తెలిసింది తక్కువే. మన చరిత్రను మనమే మర్చిపోతుండగా… సూపర్ స్టార్ కృష్ణ ఈ సబ్జెక్టు ఎంచుకొని అల్లూరి సీతారామరాజు తెరకెక్కించారు.
ఈ చిత్రంలో విప్లవగీతమైన ‘తెలుగువీర లేవరా’ సాంగ్ ని శ్రీశ్రీ రాశారు. ఆ పాటకు గాను శ్రీశ్రీ నేషనల్ అవార్డు అందుకున్నారు. కృష్ణ నటించిన అనేక చిత్రాలకు ఆయన సాహిత్యం అందించారు. శ్రీశ్రీకి హీరో కృష్ణతో ప్రత్యేక అనుబంధం కలిగి ఉన్నారు. ఒక ఇంటర్వ్యూలో శ్రీశ్రీ కృష్ణ గురించి ప్రత్యేకంగా మాట్లాడారు. నేను రాసిన ప్రతి అక్షరానికి వెలకట్టి చెల్లించిన ఏకైక హీరో కృష్ణ అని శ్రీశ్రీ అన్నారు. అంతటి అనుబంధం వీరి మధ్య ఉండేది.
శ్రీశ్రీ రచనలు కాలానికి అతీతంగా నిలిచాయి. అన్ని తరాల వారికి చెందుతాయి. శ్రీశ్రీ ఈ శతాబ్దం నాది అన్నారు. ఇతర భాషల వారు కూడా శ్రీశ్రీ సాహిత్యాన్ని ఇష్టపడ్డారు. నటుడు కమల్ హాసన్ శ్రీశ్రీ సాహిత్యం నాకెంతో ఇష్టమని ఓ సందర్భంలో చెప్పారు. కమల్ హాసన్ నటించిన ఆకలి రాజ్యం మూవీలో శ్రీశ్రీ రెండు పాటలు రాశారు. అప్పటి నిరుద్యోగ సమస్య మీద తన సాహిత్యంతో కళ్ళకు కట్టినట్లు వివరించారు. శ్రీశ్రీ తెలుగువారు కావడం గర్వించదగ్గ విషయం.