Sankranti Aaynaam : విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కిన మూడవ చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’ బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి ప్రకంపనలు సృష్టిస్తూ ముందుకు దూసుకుపోతుందో మనమంతా చూస్తూనే ఉన్నాం. వెంకటేష్ కి సరైన బ్లాక్ బస్టర్ హిట్ పడితే ఈ రేంజ్ వసూళ్లు వస్తాయా అని ఈ చిత్రానికి వస్తున్న వసూళ్లను చూసిన ప్రతీ ఒక్కరు ఆశ్చర్యపోతున్నారు. విడుదలకు ముందే ఈ సినిమా నుండి విడుదలైన పాటలకు సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. ఏ మూలకి వెళ్లినా ఈ సినిమాలోని పాటలే వినపడ్డాయి. దానికి తోడు సంక్రాంతికి విడుదలైన మిగిలిన రెండు సినిమాలు ఆశించిన స్థాయిలో అలరించకపోవడంతో ఫ్యామిలీ ఆడియన్స్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రం కోసం ఆతృతగా ఎదురు చూసారు. మొదటి వారం మొత్తం ఎడారి బిస్లరీ వాటర్ దొరికితే ఎలా ఎగబడుతారో, అలా ఎగబడి ఈ చిత్రాన్ని చూసారు. ఫలితంగా మొదటి వారం పూర్తి అయ్యేలోపే ఈ సినిమాకి 100 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.
కేవలం స్టార్ హీరోలకు మాత్రమే పరిమితమైన ఈ 100 కోట్ల షేర్ క్లబ్ లోకి సీనియర్ హీరోలలో మెగాస్టార్ చిరంజీవికి తర్వాత వెంకటేష్ కి ఆ స్థానం దక్కింది. 200 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమాకి ఓవరాల్ గా ప్రపంచవ్యాప్తంగా 8 రోజులకు గాను 215 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చినట్టు చెప్తున్నారు ట్రేడ్ పండితులు. సాధారణంగా సంక్రాంతి సెలవులు తర్వాత ఎంత పెద్ద సూపర్ హిట్ సినిమాకి అయినా వసూళ్లు బాగా తగ్గిపోతాయి. కానీ ఈ సినిమా విషయం లో అలా జరగడం లేదు. 8వ రోజు రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి ఈ సినిమాకి దాదాపుగా 5 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చినట్టు చెప్తున్నారు. అయితే నార్త్ అమెరికా లో నిన్న 5 డాలర్ల టికెట్ ప్రైజ్ పెట్టడం వల్ల అక్కడ వసూళ్లు బాగా తగ్గాయి.
మొత్తం మీద 8వ రోజు ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు కలిపి 12 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చినట్టు ట్రేడ్ పండితులు చెప్తున్నారు. ఇప్పటి బయ్యర్స్ కి 75 కోట్ల రూపాయిల లాభాలు వచ్చాయట. బాక్స్ ఆఫీస్ టర్మ్స్ లో దీనిని ట్రిపుల్ బ్లాక్ బస్టర్ అని పిలవొచ్చు. రాబోయే రోజుల్లో ఈ చిత్రానికి 100 కోట్ల రూపాయిల లాభాలు వస్తాయని అంటున్నారు. ‘గేమ్ చేంజర్’ తో కలిపి ఈ సినిమాని కూడా బయ్యర్స్ కి అమ్మడం తో, ‘గేమ్ చేంజర్’ కి వచ్చిన నష్టాలు, ఈ చిత్రం తో పూడినాయని ట్రేడ్ పండితులు చెప్తున్న మాట. నిన్నటి నుండి ఈ రెండు సినిమాల నిర్మాత దిల్ రాజు ఇంటిపై ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. దీనిని బట్టి దిల్ రాజు వేసే పోస్టర్స్ ఎంత సంచలనం రేపిందో అర్థం చేసుకోవచ్చు.