Pawan Kalyan : మహారాష్ట్ర ఎన్నికలలో బీజేపీ కూటమి సంచలన విజయం సాధించడానికి కచ్చితంగా పవన్ కళ్యాణ్ ఫ్యాక్టర్ ఉంది అనేది కాదు అనలేని నిజం. ఆయన ప్రచారం చేసిన అన్ని ప్రాంతాల్లోనూ బీజేపీ కూటమి చారిత్రాత్మక విజయాల్ని నమోదు చేసుకుంది. కొన్ని ప్రాంతాల్లో అయితే బీజేపీ దశాబ్దాల నుండి ఓటమిని చవిచూస్తూ వచ్చింది. అలాంటి ప్రాంతాల్లో కూడా పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం ప్రభావం చాలా గట్టిగా పని చేసింది. అందుకే ఆయన పేరు దేశవ్యాప్తంగా మరోసారి మారుమోగిపోయింది. ఇప్పుడు త్వరలోనే ఢిల్లీ లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల ప్రచారం లో నేటి నుండి మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొనబోతున్నాడు. పవన్ కళ్యాణ్ నేటి నుండి పాల్గొనట్లేదు, ఎందుకంటే ఆయన ప్రస్తుతం స్విజర్ ల్యాండ్ లో ఉన్నాడు. అక్కడి నుండి తిరిగి రాగానే ఢిల్లీ కి చేరుకొని నాలుగు రోజుల పాటు ఎన్నికల ప్రచారం చేయనున్నాడు.
ఇదంతా పక్కన పెడితే మహారాష్ట్ర లో పని చేసిన పవన్ కళ్యాణ్ మ్యాజిక్, ఢిల్లీ లో పని చేయడం కష్టమేనా అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఎందుకంటే మహారాష్ట్రలో కోటికి పైగా తెలుగు ఓటర్లు ఉన్నారు. పవన్ కళ్యాణ్ ప్రచారం చేసిన చోట్ల బీజేపీ బలహీనంగా ఉన్నప్పటికీ అవి గెలవగలిగారంటే అందుకు కారణం అక్కడ ఉన్న తెలుగు ఓటర్లు ప్రభావితం అవ్వడం వల్లే. మహారాష్ట్ర లో పవన్ కళ్యాణ్ తిరిగిన ప్రతీ ప్రాంతంలోనూ ఇసుకేస్తే రాలనంత జనాలు వచ్చారు. రోడ్ షోస్ లో ఆయనకీ బ్రహ్మరథం పట్టారు. కానీ ఢిల్లీ లో ఇలాంటివి కష్టం. ఎందుకంటే ఇక్కడ కేవలం 10 లక్షల ఓటర్లు మాత్రమే ఉన్నారు. వారిలో 7 లక్షల ఓట్లు పడడం కూడా కష్టమే. పైగా ఢిల్లీ ఆమ్ ఆద్మీ పార్టీ కి కంచుకోట లాంటిది, వరుసగా మూడుసార్లు ఆ పార్టీ అక్కడ అధికారం లోకి వచ్చింది.
జనాలు ఎవరికీ ఓటు వెయ్యాలి, ఎవరికీ వెయ్యకూడదు అనేది బలంగా ముందుగానే ఫిక్స్ అయిపోయారు కాబట్టి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్లి ప్రచారం చేసినా పెద్దగా ప్రయోజనం ఉండకపోవచ్చు. కానీ తెలుగు వాళ్ళు ఉండే ప్రాంతాల్లో, పవన్ కళ్యాణ్ ని తిప్పడం వల్ల, మార్జిన్ ఓట్లతో బీజేపీ గట్టెక్కే అవకాశాలు ఉన్నాయి. అందుకే అధిష్టానం ఆయన్ని ఢిల్లీలో ఎన్నికల ప్రచారం నిర్వహించాల్సిందిగా కోరారు. మరి పవన్ కళ్యాణ్ మ్యాజిక్ ఏ మేరకు పని చేస్తుందో చూడాలి. ప్రస్తుతం స్విజర్ ల్యాండ్ లో కుటుంబంతో కలిసి ఉన్న పవన్ కళ్యాణ్ ఫిబ్రవరి 6 వ తారీఖు నుండి వరుసగా నాలుగు నుండి 5 రోజుల వరకు ఎన్నికల ప్రచారం నిర్వహించబోతున్నారు. ఫిబ్రవరి 5న ఆయన ఇండియా కి తిరిగి వస్తున్నాడు. మరోవైపు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు, రేపు, ఎల్లుండి ఢిల్లీ లో ఎన్నికల ప్రచారం చేయనున్నాడు.