Liger Exhibitors: లైగర్ మూవీ విడుదలై దాదాపు ఏడాది కావస్తుంది. ఇన్నాళ్లు మౌనంగా ఉన్న లైగర్ ఎగ్జిబిటర్స్ ఏకంగా ధర్నాకు దిగారు. ఫిల్మ్ ఛాంబర్ ఎదుట టెంట్ వేశారు. రిలే నిరాహార దీక్షలకు పూనుకున్నారు. లైగర్ చిత్రం వలన వాటిల్లిన నష్టాల్లో కొంత మేర తిరిగి చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ ఎగ్జిబిటర్స్ అండ్ లీజర్స్ అసోసియేషన్ ఈ నిరసన కార్యక్రమం చేపట్టింది. రూ. 9 కోట్లు తమకు చెల్లించి ఆదుకోవాలని వారు పట్టుబడుతున్నారు. ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు తెలుగు నిర్మాతల మండలి రంగంలోకి దిగినట్లు సమాచారం.
లైగర్ నిర్మాణ భాగస్వామిగా ఉన్న నటి ఛార్మితో నిర్మాతల మండలి సభ్యులు మాట్లాడారట. పరిష్కారం దిశగా నిర్ణయం తీసుకుంటామని ఆమె చెప్పారట. ఎగ్జిబిటర్స్ అడిగిన మొత్తం కాకపోయినా ఎంతో కొంత తిరిగి చెల్లించేందుకు ఛార్మి సిద్దమయ్యారని సమాచారం. అయితే డబ్బులు అందే వరకు నిరసన కార్యక్రమం కొనసాగనుంది. లైగర్ విడుదలయ్యాక కొన్ని రోజులకు బయ్యర్లు పూరి జగన్నాథ్ తో ఇదే విషయమై మాట్లాడారు. పూరి నష్టాల్లో కొంత మొత్తం తిరిగి చెల్లించేందుకు ఒప్పుకున్నారు.
అయితే ఇచ్చిన హామీ ఆయన నిలబెట్టుకున్నట్లు లేదు. అలాగే అప్పట్లో పూరి జగన్నాథ్ మాట్లాడిన ఆడియో ఫైల్ ఒకటి వైరల్ గా మారింది. బెదిరింపులకు దిగినా నిరసనలు చేసినా ఇస్తానన్న డబ్బులు కూడా ఇవ్వనని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గతంలో ఎగ్జిబిటర్స్ నాకు చాలా డబ్బులు ఎగ్గొట్టారని పరుష వ్యాఖ్యలు చేశారు. ఈ వివాదం ముగిసిందని అందరూ భావిస్తుండగా సడన్ గా ఫిల్మ్ ఛాంబర్ ఎదుట లైగర్ చిత్ర బాధితులు ప్రత్యక్షమయ్యారు.
పూరి కనెక్ట్స్ బ్యానర్ లో పూరి జగన్నాథ్-ఛార్మి లైగర్ చిత్రాన్ని నిర్మించారు. ధర్మ ప్రొడక్షన్స్ నిర్మాణ భాగస్వామిగా ఉంది. 2022 ఆగస్టు 25న విడుదలైన లైగర్ డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఈ చిత్రాన్ని పూరి స్పోర్ట్స్ డ్రామాగా రూపొందించారు. లైగర్ మూవీపై భారీ హైప్ ఏర్పడిన నేపథ్యంలో అత్యధిక ధరలకు చిత్ర హక్కులు అమ్మారు. దీంతో బయ్యర్లు, ఎగ్జిబిటర్లు పెద్ద నష్టపోయారు. తెలుగు రాష్ట్రాల్లో లైగర్ రూ. 55 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. అందులో యాభై శాతం కూడా రికవర్ కాలేదు.