Liger Producer Charmi: నిర్మాతలుగా వరుస ఫెయిల్యూర్స్, ఉన్నవన్నీ పోగొట్టుకున్న తరుణంలో ఇస్మార్ట్ శంకర్ మూవీతో ఛార్మి, దర్శకుడు పూరి కోలుకున్నారు. వరల్డ్ వైడ్ రూ. 75 కోట్ల గ్రాస్ అందుకున్న ఆ మూవీ ఆర్థికంగా వాళ్ళను నిలబెట్టింది. ఇస్మార్ట్ శంకర్ ఇచ్చిన ఎనర్జీతో భారీ ప్రాజెక్ట్ లైగర్ స్టార్ట్ చేశారు. ఆకాశమంత ఆశలు పెట్టుకుంటే లైగర్ మూవీ ఛార్మి, పూరి కథ మొదటికి తీసుకెళ్లింది. డిజాస్టర్ టాక్ తో లైగర్ భారీ నష్టాల దిశగా వెళుతుంది. వరల్డ్ వైడ్ లైగర్ నష్టాల అంచానా రూ. 50 కోట్లకు పైమాటే.

లైగర్ రిజల్ట్ తర్వాత నిర్మాత ఛార్మి మొదటిసారి మాట్లాడారు. సినిమా ఫెయిల్యూర్ కావడంతో ఆమె భావోద్వేగానికి గురయ్యారు. ఎన్నో కష్టాలు పడి సినిమా విడుదల చేస్తే ఫలితం నిరాశపరిచింది అన్నారు. ఛార్మి మాట్లాడుతూ… లైగర్ చిత్రం విడుదల చేయడానికి మూడేళ్ళ సమయం పట్టింది. 2020 జనవరిలో ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేశాము. ఆ వెంటనే లాక్ డౌన్ వచ్చింది. కరోనా పరిస్థితుల కారణంగా సినిమా విడుదలకు మూడేళ్ళ సమయం పట్టింది.

ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని సినిమాను విడుదల చేశాము. కానీ లైగర్ డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది అన్నారు. ఆమె ఇంకా మాట్లాడుతూ తెలుగులో ఈ మధ్య విడుదలైన బింబిసార, సీతారామం, కార్తికేయ 2 రూ. 150 నుండి రూ. 170 కోట్లు వసూలు చేశాయి. తెలుగులో పరిస్థితి ఒకింత బాగానే ఉంది. బాలీవుడ్ ప్రేక్షకులు థియేటర్స్ కి రావడం లేదు. ఒక్క క్లిక్ తో అద్భుతమైన కంటెంట్ చూసే వెసులుబాటు ఉన్న నేపథ్యంలో థియేటర్స్ కి రావడానికి ఇష్టపడడం లేదు. ఇలాంటి ప్రతికూల పరిస్థితులు కూడా లైగర్ ని దెబ్బ తీశాయని ఆమె అన్నారు.
లైగర్ చిత్రానికి రూ. 200 కోట్ల ఓటీటీ డీల్ వచ్చినట్లు ఛార్మి గతంలో అన్నారు. కాగా లైగర్ ఓటీటీ హక్కులు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ దక్కించుకుంది. అందుకు గాను రూ. 80 కోట్లు చెల్లించినట్లు సమాచారం. మొత్తంగా లైగర్ నిర్మాత ఛార్మి దర్శకుడు పూరితో పాటు హీరో విజయ్ దేవరకొండను తీవ్ర నిరాశకు గురి చేసింది. సెంటిమెంట్ ప్రకారం కూడా ఒక్క హిట్ ఇస్తే రెండు మూడు ప్లాప్స్ ఇవ్వడం పూరికి అలవాటైపోయింది.