Unstoppable With NBK Season 2: అల్లు రామలింగయ్యకు అవకాశాలు ఇవ్వొద్దని కొడుకు అరవింద్ దర్శకులకు వెళ్లి చెప్పేవాడట. ఈ విషయాన్ని దర్శకుడు కే రాఘవేంద్రరావు స్వయంగా వెల్లడించారు. తండ్రి కెరీర్ ని దెబ్బతీయాల్సిన అవసరం అల్లు అరవింద్ కి ఎందుకు వచ్చింది. దాని వెనకున్న నేపథ్యం ఏమిటో చూద్దాం. బాలకృష్ణ హోస్ట్ గా అన్ స్టాపబుల్ సీజన్ 2 సక్సెస్ ఫుల్ గా సాగిపోతుంది. తాజా ఎపిసోడ్ కి గెస్ట్స్ గా నిర్మాతలు అల్లు అరవింద్, సురేష్ బాబు వచ్చారు. వీరి మధ్య అనేక ఆసక్తికర విషయాలు చర్చకు వచ్చాయి.

షో మధ్యలో బాలయ్య, అల్లు అరవింద్, సురేష్ బాబులతో సీనియర్ దర్శకులు కే రాఘవేంద్రరావు జాయిన్ అయ్యారు. ఆయన వచ్చాక షో మరింత రసవత్తరంగా మారింది. ఎందుకంటే ఆ ముగ్గురి కంటే కొంచెం ముందు జనరేషన్ కి చెందినవారు ఆయన. వారి తండ్రులు ఎన్టీఆర్, అల్లు రామలింగయ్య, దగ్గుబాటి రామానాయుడులతో ఆయనకు గొప్ప సాన్నిహిత్యం ఉంది. ఈ క్రమంలో మా గురించి మా తండ్రులు ఏం చెప్పారని హోస్ బాలకృష్ణ అడిగారు. ఫస్ట్ అల్లు రామలింగయ్య కొడుకు అరవింద్ గురించి ఏమనేవారో రాఘవేంద్రరావు చెప్పారు.
చెప్తే భాదపడతావని రాఘవేంద్రరావు అల్లు అరవింద్ ని ఉద్దేశించి అన్నారు. పర్లేదు చెప్పండి, మా నాన్నగారేగా ఆయన అన్నారు. నానా బూతులు తిట్టేవాడు. అల్లు రామలింగయ్యగారికి వయసు పెరిగింది. అల్లు అరవింద్ నా దగ్గరకొచ్చి… ఇది మా ఫ్యామిలీ మేటర్. నాన్నకు వయసు పెద్దదైపోయింది. ఆయనకు మీరు వేషాలు ఇవ్వొద్దు, అని చెప్పేవారు. అల్లు అరవింద్ వెళ్ళిపోయాక అల్లు రామలింగయ్య నా దగ్గరకు వచ్చేవారు. వేషాలు లేవు అంటే, మావాడు వచ్చాడా.. తెలుసు నాకు తెలుసు. వాడు నాకు వేషం ఇవ్వొద్దని చెప్పి ఉంటాడు అని తిట్టేవారు, అని రాఘవేంద్రరావు చెప్పు కొచ్చారు.

వయసు పెరిగింది ఇక నటించొద్దని చెప్పినా ఆయన వినడు కాబట్టి, దర్శకులకు ఆఫర్స్ ఇవ్వొద్దని అల్లు అరవింద్ సూచించేవారట. ఇక రామానాయుడు కొడుకు సురేష్ బాబు గురించి ఏం చెప్పాడో కూడా రాఘవేంద్రరావు బయటపెట్టారు. మా వాడికి ధైర్యం లేదు, వాడు దర్శకులను నమ్మడు అని రామానాయుడు సురేష్ బాబు పట్ల అసహనం వ్యక్తం చేసేవాడట. ఇక ఒక వేషం విషయంలో బాలయ్య తీరుకు ఎన్టీఆర్ బాధపడ్డాడని ఆయన చెప్పుకొచ్చారు.