
శృంగార చిత్రాల నటి షకీలా సమర్పణలో సాయి రామ్ దాసరి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘లేడీస్ నాట్ ఎలౌడ్’. షకీల, విక్రాంత్ రెడ్డి, రమేష్ కావలి సంయుక్తంగా నిర్మించిన ఈ మూవీకి సాయి రామ్ దాసరి దర్శకత్వం వహించారు. అడల్ట్ కామెడీ హారర్ సినిమా ఇది. గతేడాదే షూటింగ్ పూర్తయింది. ట్రైలర్, సాంగ్స్ రిలీజ్ చేశారు. కానీ, సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ ఇవ్వకపోవడంతో వివాదం రాజుకుంది. దీన్ని దర్శకుడు ఢిల్లీ వరకు తీసుకెళ్లారు. కానీ, కరోనా కారణంగా ఆ వివాదం ఇప్పటికీ పరిష్కారం కాలేదు. అదే సమయంలో ఇప్పట్లో సినిమా హాల్స్ తెరుచుకునే అవకాశం కూడా లేకపోవడంతో సినిమాను నేరుగా ఆన్‌లైన్‌లో విడుదల చేసేందుకు చిత్ర బృందం నిర్ణయించుకుంది. ఇప్పుడు మూవీ సెన్సార్ లేకుండా నేరుగా ఆన్‌లైన్‌లో విడుదల కానుంది. ఈ నెల 20న www.ladiesnotallowed.com అనే వెబ్‌సైట్‌లో మూవీ రిలీజ్ అవుతుందని, సినిమా చూసేందుకు రూ.50 రూపాయలు చెల్లించాల్సి ఉంటుందని చిత్ర బృందం ప్రకటించింది. 20న రాత్రి గంటల నుంచి స్ట్రీమింగ్ స్టార్ట్ అవుతుందని తెలిపింది.
మరోవైపు ఈ సినిమాపైనే తమ జీవితాలు ఆధారపడి ఉన్నాయని షకీల చెప్పింది. అప్పు తెచ్చి ఈ సినిమా చేశామని, సెన్సార్బోర్డు ఎన్నో ఇబ్బందులకు గురి చేసిందని తెలిపింది. దయచేసి ఈ సినిమా చూసి తమను బ్రతికించాలని కోరుతూ ఓ వీడియోను ఆమె రిలీజ్ చేసింది. ‘ ఈ సినిమా ప్రమోషన్స్ కోసం హైదరాబాద్ రావడానికి ప్రయత్నిస్తే.. లాక్ డౌన్ వల్ల నాకు అనుమతి లభించలేదు. ఈ సినిమా తీసి రెండేళ్లు అవుతుంది. చాలా ఇబ్బందులు పడి ఈ సినిమా కంప్లీట్ చేశాం. కాని ఇప్పటి వరకూ సెన్సార్ చేయలేదు. నా సేవింగ్స్ మొత్తం ఈ సినిమాకే పెట్టాను. రిలీజ్ అవుతుందన్న ధైర్యంతో వడ్డీకి డబ్బులు తెచ్చా. అప్పు తిరిగి చెల్లించాలని మా ఫైనాన్సర్స్ నా మీద చాలా ఒత్తిడి తెస్తున్నారు. ఈ సినిమాను సెన్సార్ చేయకపోవడంతో డిజిటల్ ప్లాట్ ఫామ్‌లో విడుదల చేస్తున్నాం. ఈ సినిమా టిక్కెట్ ధర రూ.50 మాత్రమే. ఇది అడల్ట్ కామెడీ ఫిల్మ్. లేడీస్ కు నిజంగా అనుమతి లేదు. ఈ సినిమాని చూసి మామ్మల్ని ఆశీర్వదిస్తే ఇప్పటికి బతికిపోతాం. తర్వాతి సినిమా చేస్తామా లేదా అన్నది తరువాత విషయం ఇప్పటికైతే బతికిపోతాం. దేవుడి దయ, మీ ఆశీర్వాదం కోసం ఎదురుచూస్తున్నా’ అని షకీల ఎమోషనల్ వీడియోను షేర్ చేసింది. కాగా, ఈ మూవీకి శ్రీ మిత్ర సంగీతం అందించగా.. తరుణ్ కరంథోద్ సినిమాటోగ్రఫీ చేశారు. కె.ఆర్.స్వామి ఎడిటర్గా వ్యవహరించారు.