Tollywood vs Kollywood : ఇన్నాళ్లు కలిసి మెలిసి సాగిన తమిళ తెలుగు బంధానికి ఇప్పుడు సంక్రాంతి సీజన్ ఎసరు పెట్టింది. తమిళ సినిమాల తెలుగు దండయాత్రను అడ్డుకునేందుకు తెలుగు నిర్మాతలు చేసిన ప్రయోగం విఫలయత్నంగా మారింది. తమిళ డైరెక్టర్స్ నుంచి వ్యతిరేకతకు కారణమైంది. సంక్రాంతి సీజన్ లో మెగాస్టార్ చిరు, బాలయ్య లాంటి పెద్ద హీరోల సినిమాలు విడదలవుతున్నాయి. ఈ టైంలోనే కంటెంట్ బేస్డ్ తమిళ సినిమాలు రంగంలోకి దిగడంతో థియేటర్ల సమస్య ఏర్పడుతోంది. అందుకే సంక్రాంతికి తమిళ సినిమాల విడుదల వద్దంటూ నిర్మాతలు అల్టిమేటం జారీ చేయడం చిచ్చురేపింది. దీనిపై తమిళ డైరెక్టర్స్ భగ్గుమన్నారు. అలా అయితే మీ తెలుగు సినిమాలు తమిళనాడులో విడుదల చేయనివ్వమని సవాల్ చేశారు. దీంతో సంక్రాంతికి సినిమాల విడుదల విషయంలో తమిళ్ డైరెక్టర్స్ vs తెలుగు ప్రొడ్యూసర్స్ మధ్య పెద్ద యుద్ధమే మొదలైంది. రెండు చిత్ర పరిశ్రమలు విడిపోయి కొట్టుకుంటున్న పరిస్థితి నెలకొంది.

2023 సంక్రాంతి సినిమాల విడుదల విషయంలో వివాదం నెలకొంది. తమిళ డబ్బింగ్ చిత్రాలు విడుదల ఒప్పుకోమని తెలుగు నిర్మాతల మండలి తీసుకున్న నిర్ణయాన్ని తమిళ దర్శకుడు సీమాన్ తప్పుబట్టారు. ఆయన తెలుగు నిర్మాతలకు హెచ్చరికలు జారీ చేశారు. మరో రెండు నెలల్లో పెద్ద పండుగ సంక్రాంతి ఉంది. వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి, వారసుడుతో పాటు తునివు విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. నాలుగు పెద్ద చిత్రాల విడుదల నేపథ్యంలో థియేటర్స్ సమస్య ఏర్పడనుంది. దీంతో సంక్రాంతికి తమిళ డబ్బింగ్ చిత్రాలు విడుదల చేయకూడదంటూ తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు లేఖ విడుదల చేశారు.
తెలుగు నిర్మాతల నిర్ణయాన్ని తమిళ దర్శకుడు సీమాన్ తీవ్రంగా ఖండించారు. నాన్ తమిళర్ కట్చి అధ్యక్షుడైన సీమాన్ హెచ్చరికలు జారీ చేశారు. తెలుగులో వారిసు చిత్ర విడుదల ఆపితే తమిళనాడులో తెలుగు చిత్రాలను అడ్డుకుంటామని అన్నారు. బాహుబలి, ఆర్ ఆర్ ఆర్, కెజిఎఫ్ , కాంతార వంటి చిత్రాలు తమిళంలో భారీ ఆదరణ దక్కించుకున్నాయి . తెలుగు సినిమాల విడుదలకు తమిళనాడులో ఎలాంటి అభ్యంతరం చెప్పడం లేదు. అలాంటిది తమిళ చిత్రాల విడుదల తెలుగు నిర్మాతలు అడ్డుకోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. పాన్ ఇండియా అని చెప్పుకుంటూ ప్రాంతీయవాదం ఎందుకు తీసుకొస్తున్నారని వాదిస్తున్నారు.
అజిత మూవీ విషయం పక్కన పెడితే వారసుడు చిత్ర దర్శకుడు, నిర్మాత తెలుగువారే. దిల్ రాజు నిర్మాతగా వంశీ పైడిపల్లి ఈ మూవీ తెరకెక్కించారు. ఈ క్రమంలో దిల్ రాజు ఇది తమిళ సినిమా కాదని వాదిస్తున్నారు. నిర్మాతల మండలి మాత్రం వారసుడు డబ్బింగ్ సినిమాగా చెబుతున్నారు. సంక్రాంతికి విడుదల చెయ్యడానికి వీలులేదని అంటున్నారు. వారసుడు చిత్రం కోసం దిల్ రాజు భారీగా థియేటర్స్ బ్లాక్ చేసి పెట్టడం కూడా ఈ వివాదానికి కారణం కావచ్చు.
వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డికి అరాకొరా థియేటర్స్ కేటాయించి వారసుడు చిత్రానికి దిల్ రాజు సింహ భాగం కేటాయించారట. నైజాంలో పరిస్థితి దారుణంగా ఉందట. ఏపీలో కూడా ప్రధాన నగరాల్లో వారసుడు సినిమాకు సగం థియేటర్స్ మిగతా సగం వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి చిత్రాలకు కేటాయించారట. ముఖ్యంగా వీరసింహారెడ్డి పరిస్థితి దారుణంగా ఉందని సమాచారం. గతంలో విజయ్ డబ్బింగ్ మూవీ మాస్టర్ ని దిల్ రాజు నైజాంలో విడుదల చేశారు. బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకున్న క్రాక్ చిత్రాన్ని చంపేసి నెగిటివ్ టాక్ తెచ్చుకున్న మాస్టర్ కి థియేటర్స్ కేటాయించారని డిస్ట్రిబ్యూటర్ వరంగల్ శ్రీను ఆరోపించారు.