Kiraak RP Chepala Pulusu: యాక్టింగ్, డైరెక్షన్ అన్నీ ట్రై చేసిన కిరాక్ ఆర్పీ ఇటీవల కర్రీ పాయింట్ తెరిచాడు. కర్రీ పాయింట్ ఏదో నాలుగు కూరలు అమ్మే చిన్న షాప్ కాదు. చేపల పులుసు ప్రత్యేకంగా పెద్ద స్టాల్ ఓపెన్ చేశాడు. నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు అని పేరు పెట్టాడు. ఈ వ్యాపారానికి బ్యాచ్ లర్స్, స్టూడెంట్స్, ఆంధ్రా ఫ్యామిలీలు అధికంగా ఉండే కూకట్ పల్లి ఏరియాను ఎంచుకున్నాడు. నగర శివారులో వంటశాల ఏర్పాటు చేశాడు. అక్కడ చేపలు పులుసు వండి.. కూకట్ పల్లి కర్రీ పాయింట్ కి తరలిస్తున్నాడు. చేపల పులుసు వ్యాపారం కోసం కిరాక్ ఆర్పీ రూ. 40 లక్షల వరకూ పెట్టుబడి పెట్టాడట. అయితే చేపల పులుసు బిజినెస్ ఊహించని స్థాయిలో సక్సెస్ అయ్యింది.

తన పెట్టుబడి నెలరోజుల్లోనే తిరిగి వచ్చేసిందట. కిరాక్ ఆర్పీ చేపల పులుసుకు అలవాటు పడ్డ జనాలు పదే పదే కొనుక్కొని ఇంటికి తీసుకుపోయి ఆరగిస్తున్నారట. కిరాక్ ఆర్పీ బిజినెస్ మూడు పూలు ఆరు కాయలుగా ఉంది. అయితే సడన్ గా వ్యాపారం మూతేశాడట. ఆర్పీ చేపల పులుసుకు అలవాటు పడ్డ జనాలు షట్టర్ వేసి ఉన్న నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు షాపును చూసి కంగారు పడుతున్నారు. అయితే కంగారు పడాల్సిన అవసరం లేదు. తాత్కాలికంగా మాత్రమే షాప్ క్లోజ్ చేశామని ఆర్పీ చెప్పుకొచ్చాడు.
కిరాక్ ఆర్పీ బిజినెస్ విపరీతంగా పెరిగిందట. దీంతో కస్టమర్స్ కి చేపల పులుసు అందించడం కష్టం అవుతుందట. సరిపడా మాన్ పవర్ లేక డిమాండ్ ని అందుకోలేకపోతున్నారట. లాభం లేదని షాప్ క్లోజ్ చేసి కిరాక్ ఆర్పీ నెల్లూరు పోయాడట. అక్కడ నుండి వర్కర్స్ తో పాటు చేపల పులుసు వండటంలో చేయితిరిగిన వంటగాళ్లను తీసుకు వస్తాడట. మాన్ పవర్ పెంచి కస్టమర్స్ డిమాండ్ కి తగ్గ సప్లై రాబడతానని కిరాక్ ఆర్పీ స్పష్టత ఇచ్చాడు. దీంతో కస్టమర్స్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.

కిరాక్ ఆర్పీ జబర్దస్త్ కమెడియన్ గా అందరికీ సుపరిచితుడు. నెల్లూరు యాసతో తన మార్క్ కామెడీ పండించేవాడు. 2019లో నాగబాబు జబర్దస్త్ వదిలేసి వెళ్లిపోయారు. ఆయనతో పాటు ఆ కామెడీ షో నుండి బయటకు వచ్చిన వాళ్లలో కిరాక్ ఆర్పీ కూడా ఒకరు. తర్వాత నాగబాబు జీ తెలుగులో స్టార్ట్ చేసిన అదిరింది షోలో కిరాక్ ఆర్పీ స్కిట్స్ చేశాడు. అనంతరం ఓ సినిమాను దర్శకుడిగా ప్రారంభించాడు. అనుకోని కారణాలతో ఆ మూవీ మధ్యలో ఆగిపోయింది. పూర్తిగా పరిశ్రమ నుండి బయటకొచ్చి చేపల పులుసు బిజినెస్ పెట్టి సక్సెస్ అయ్యాడు.