సినీనటుడు సోనూసూద్ (Sonu Sood) నిజజీవితంలో హీరోగా పేరు తెచ్చుకున్నాడు. వేలాది మంది అభిమానులను తయారు చేసుకున్నాడు. ఇప్పటికే అతడి పేరు పలు రకాలుగా ప్రచారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. పసిపిల్లలకు, దుకాణాలకు పెట్టుకుంటున్నారు. అయితే ఓ భక్తుడు ఆయన విగ్రహాన్ని తయారు చేయించి తన భక్తి చాటుకున్నాడు. ఖమ్మం జిల్లా వాసి ఒకరు సోనూసూద్ విగ్రహం తయారు చేయించి తన అభిమానం చాటుకున్నాడు.

బోనకల్ మండలం గార్లపాడు గ్రామానికి చెందిన వెంకటేశ్ సోనూసూద్ విగ్రహాన్ని తయారు చేయించాడు. ఆర్థికంగా అంత స్తోమత లేకున్నా సొంత డబ్బులతో సోనూసూద్ విగ్రహాన్ని తయారు చేయించి తనలోని భక్తి చాటాడు. విజయవాడలోని గొల్లపూడిలో విగ్రహాన్ని తయారు చేయించాడు. అక్కడి నుంచి ఆటోలో గార్లపాడుకు తెప్పించాడు.
ఈనెల 13 లేదా 14 తేదీల్లో విగ్రహ ప్రారంభోత్సవం చేస్తానని చెబుతున్నాడు. వెంకటేశ్ ను గ్రామస్తులంతా అభినందిస్తున్నారు. సోనూసూద్ విగ్రహం తయారు చేయించడంపై ప్రశంసలు కురిపిస్తున్నారు. సామాజిక సేవ చేసే సోనూసూద్ విగ్రహం తయారు చేయించడంపై అందరు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికే పలు సందర్భాల్లో సోనూసూద్ కు గుళ్లు కట్టించారు. సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం దుబ్బతండా పరిధిలోని చెలిమితండాలో రాజేశ్ రాథోడ్ సోనూసూద్ విగ్రహం ఏర్పాటు చేసి తన అభిమానాన్ని చాటాడు. ఖమ్మం జిల్లా బోనకల్ మండలం ముష్టికుంట్లకు చెందిన పండగ నవీన్, త్రివేణి దంపతులు పుట్టిన బిడ్డకు సోనూసూద్ అని పేరు పెట్టుకున్నారు. దీంతో సోనూసూద్ నిజంగానే దేవుడిలా అయిపోయాడు.