
Doctor Preeti Death: అనూహ్య నిర్ణయాలతో రాజకీయ ప్రత్యర్థులకు.. విపక్షనేతలకు ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా నిర్ణయాలు తీసుకుంటారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. ఆయన మనసు చాలా పెద్దదన్న అభిప్రాయం ఉంది. ఆపదలో ఉన్నవారికి వెనకా ముందు ఆలోచించుండా సాయం చేస్తారని, ఆదుకుంటారని చాలాసార్లు నిరూపించారు కూడా. ఎక్కడో పంజాబ్ రైతులు ఆత్మహత్య చేసుకుంటే కూడా కేసీఆర్ స్వయంగా వెళ్లి ఆర్థికసాయం అందించారు. సరిహద్దులో చైనా సైన్యంతో కొట్లాడిన సోల్జర్ సంతోష్‌కుమార్ విషయంలోనూ ఎంతో ఉదారత చాటుకున్నాడు. సుప్రీం కోర్టు మాజీ సీజేఐ ఎన్‌వీ. రమణ అయితే కేసీఆర్ చేయి ఎముకే లేదని ఓ సందర్భంగా ప్రశంసించారు. అడిగిందే తడవుగా ఇచేస్తారని కేసీఆర్ ఉదారతను అభినందించారు. ఇంతటి పెద్ద మనసు ఉన్న సీఎం మనసు పీజీ వైద్య విద్యార్థిని ప్రీతి విషయంలో మాత్రం చిన్నబోయింది. దీంతో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఏమైంది? అన్న ప్రశ్నలు వస్తున్నాయి.
విపక్షాలకు క్రెడిట్ దక్కకుండా..
తెలంగాణ రాష్ట్రం ఏర్పడి.. అనూహ్య పరిణామాలు చోటు చేసుకునే వేళ.. పరిహారం కోసం గొంతెత్తి అడిగే అవకాశం ఇవ్వకుండా.. మారు మాట్లాడని రీతిలో కేసీఆర్ ప్రకటన చేయటం.. అందరిని విస్మయానికి గురి చేస్తుంది. గతంలో ఏదైనా విషాద ఘటన జరిగినప్పుడు పరిహారం మీద జరిగే రభస చాలా ఎక్కువగా ఉండేది. అలాంటి అవకాశం లేకుండా కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏదైనా పెను విషాదం చోటు చేసుకుంటే.. బాధిత కుటుంబానికి ప్రభుత్వం తరఫున చేసే ప్రకటన సాంత్వన కలిగేలా ఉండేది. అయితే తెలంగాణ రాష్ట్రంలో సంచలనంగా మారిన పీజీ వైద్య విద్యార్థిని ప్రీతి ఆత్మహత్యాయత్నంపై కేసీఆర్ సర్కారు స్పందించిన తీరు ఏ మాత్రం సరిగా లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆదివారంరాత్రి ఆమె మరణించినట్లు నిమ్స్ వైద్యులు ప్రకటించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ రూ.10 లక్షల పరిహారాన్ని ప్రకటించటంపై ఒకింత విస్మయం వ్యక్తమైంది. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన ఈ ఉదంతానికి భారీగా పరిహారాన్ని ప్రకటిస్తారని భావించారు.
పరిహారం ప్రకటనతో మరింత ఆవేదన..
కూతురును ఘటనతో వారం రోజులుగా పుట్టెడు దుఃఖంలో ఉన్న ప్రతీ కుటుంబాన్ని ప్రభుత్వం ప్రకటించిన పరిహారం మరింత బాధకు గురిచేసింది. అన్యాయంగా పీజీ వైద్య విద్యార్థిని ప్రాణాల్ని తీశారని.. ఇలాంటి దుర్మార్గ ఘటనపై ప్రభుత్వం స్పందించిన తీరు బాగోలేదన్న మాట బంజారాల నుంచి వినిపించింది. ఆసక్తి కరమైన విషయం ఏమంటే.. ప్రీతి మరణంపై తన సంతాపాన్ని వ్యక్తం చేసిన జిల్లా మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు.. తన తరఫు నుంచి రూ.20లక్షల పరిహారాన్ని ప్రకటించారు.
కేసీఆర్ ప్రకటన ఆ మంత్రికి కూడా నచ్చలేదు..
పెద్ద మనసున్న కేసీఆర్ ప్రీతి కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం ప్రటించడం మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుకు కూడా నచ్చలేదు. సీఎం ప్రకటించిన పరిహారంతో మంత్రి కూడా షాక్ అయినట్లు ఉన్నారు. దీంతో మంత్రి పెద్దమనసు చేసుకుని తన తరఫున రూ.20 లక్షల పరిహారం ప్రకటించారు. అంతే కాకుండా తాను నిర్వహించే పంచాయితీరాజ్ శాఖలో ప్రీతి కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని ప్రకటించారు.

బంజారా బిడ్డనేనా..?
ప్రతీ గిరిజన కుటుంబంలో పుట్టింది. కానీ సంపన్న వర్గాల పిల్లలతో చదువు విషయంలో పోటీ పడింది. పాఠశాల స్థాయి నుంచి పీజీ మెడికల్ సీటు వరకూ అన్నీ ఓపెన్ కేటగిరీలోనే సాధించింది. ఎక్కడా తన ఎస్టీ రిజర్వేషన్ ఉపయోగించుకోలేదు. ఆ అవసరం కూడా ప్రీతికి రాలేదు. చదువే ప్రాణంగా, పేదలకు వైద్యం అందించడమే లక్ష్యంగా వైద్య వృత్తిని ఎంచుకుంది. చదువు పూర్తయ్యాక ఎంతో మందికి ప్రాణం పోయాల్సిన ప్రీతి అర్ధంతరంగా తనువు చాలించడం రాష్ట్రవ్యాప్తంగా అందరినీ కదిలించింది. కానీ ఆమె మరణం తెలంగాణ ముఖ్యమంత్రిని మాత్రం కదిలించలేదు. అగ్రకులం బిడ్డ కాకపోవడం, బంజారా కులంలో పుట్టడంతోనే కేసీఆర్ చిన్న చూపు చూశారని విపక్షాలు విమర్శిస్తున్నాయి. బంజారా సంఘం నేతలు కూడా కేసీఆర్ ప్రకటనను తప్పు పడుతున్నారు.