Karthika Deepam: అప్పట్లో ఈటీవీలో… సుమన్ బతికి ఉన్నప్పుడు వసుంధర అనే ప్రాంచైజీ లో సీరియల్స్ వచ్చేవి.. అంతరంగాలు, అనుబంధం, అందం.. ఇలా తెలుగు ప్రేక్షకులను కట్టి పడేసిన సీరియల్స్ ఎన్నో. ఇది కథ కాదు, విధి, అన్వేషిత, లేడీ డిటెక్టివ్, కళంకిత, మనోయజ్ఞం, శాంతినివాసం, ఎండమావులు… ఇలా ట్రెండ్ సెట్ చేసిన సీరియల్స్ ఎన్నో… అప్పట్లో ఈ క్షుద్ర కథలు లేవు . తలా తోకా లేని దర్శకులు లేరు. ఆ సీరియల్స్ అందుకే ఆ స్థాయిలో జనాదరణ పొందాయి.. ఇక ప్రస్తుత కాలానికి వస్తే స్టార్ మా లో ప్రసారమైన కార్తీకదీపం తిరుగులేని హిట్ గా నిలిచింది. స్టార్ వాడికి కాసులు కురిపించింది. ఈ సీరియల్ ప్రసారానికి అడ్డంకిగా ఉండకూడదనే బాహుబలి లాంటి సినిమాను సాయంత్రం 6 గంటలకు మా టీవీ ప్రసారం చేసింది ఆ సీరియల్ ఇంపాక్ట్, ఇంపార్టెన్స్ ఏంటో అర్థం చేసుకోవచ్చు.

పెద్ద పెద్ద సినిమాలను ప్రసారం చేసినప్పటికీ వాటికి మించి కార్తీకదీపం రేటింగ్స్ సాధించింది.. పరిటాల నిరుపమ్ అలియాస్ డాక్టర్ బాబు, వంటలక్క అలియాస్ ప్రేమీ విశ్వనాధ్ ను ఎక్కడికో తీసుకెళ్ళింది.. ప్రతి ఇంటికి చేరువచేసింది.. ఈ సీరియల్ మీద ఎన్ని పిచ్చి పిచ్చి ప్రయోగాలు చేసినప్పటికీ చివరకు ఘనంగా ముగింపుకొచ్చింది.. ఈ శనివారం లాస్ట్ ఎపిసోడ్.. ఆ ప్లేస్ లో బ్రహ్మముడి అనే సీరియల్ ప్రసారం కాబోతోంది.
బుల్లితెర చరిత్రలో..
మొదటిసారిగా ఓ టీవీ సీరియల్ సిబ్బందికి, సీరియల్ కు, ప్రత్యేకించి ఆ సీరియల్ నటికి ఘనంగా వీడ్కోలు పలికిన తీరు ఆసక్తికరంగా అనిపించింది.. స్టార్ మా పరివార్ అనే ఓ రెగ్యులర్ షో వస్తోంది కదా… ఈసారి కార్తీకదీపానికి ఆ షో ను అంకితం చేశారు. సాధారణంగా ప్రేమి విశ్వనాథ్ టీవీ ప్రోగ్రామ్లకు రావడం అత్యంత ఆరుదు.. మలయాళీ కావడంతో ఒకసారి సుమకు ఇంటర్వ్యూ ఇచ్చింది.. మరోసారి ఏదో ఒక షోలో అమ్మవారి వేషం వేసింది. కార్తీకదీపం వీడ్కోలు షో కోసమే హైదరాబాద్ వచ్చినట్టుంది.. ఆ సీరియల్ లో ఆమె పాత్ర పేరు వంటలక్క కదా… వంటలు చేసి షోలో అప్పటికప్పుడు వడ్డించారు.. సీరియల్ తో బాగా కనెక్ట్ అయిన వారి అభిప్రాయాలు చూపించారు.. ఇందులో మోనిక పాత్రధారి శోభిత శెట్టి లేకపోవడం ఒక లోటు.. ఇక అక్కడ ఉన్న వారి అభిమానంతో ప్రేమి కన్నీళ్లు పెట్టుకుంది.. స్థూలంగా ఈ ఎపిసోడ్ బాగుంది.. అంతేకాదు ఆమె తెలుగులో మాట్లాడిన మాటలు బాగున్నాయి..” మీరు మాపై ఎంతో అభిమానం చూపించారు.. దానికి వెలకట్టలేం.. బాధపడకండి, మళ్లీ వస్తా” అని ఆమె చెప్పడం అందరి మనసులను కదిలించింది.

కమర్షియల్ గా ఆలోచించడంలో స్టార్ మా తర్వాతనే ఎవరైనా. నిజంగానే ప్రేమి పాపులారిటీని సొమ్ము చేసుకుంది.. అందులో భాగంగానే మరో ఎమోషనల్ డ్రామాను ప్లాన్ చేస్తున్నట్టు కనిపిస్తోంది.. అయితే దానికి కూడా కార్తీక దీపం దర్శకుడు రాజేంద్రనే.. మొదట్లో ఈ సీరియల్ బాగానే ఉండేది.. కానీ అతడికి ఏమైందో తెలియదు కానీ చివరి 200 ఎపిసోడ్ లను పూర్తిగా భ్రష్టు పట్టించాడు.. అన్నట్టు ఈ షోకు కూడా రాజేంద్రను పిలిచారు.. ” కరోనా కాలంలో నన్ను బాగా తిట్టుకున్నారు. వీడు పోతే బాగుండేది అనుకున్నారు” అని రాజేంద్ర భావోద్వేగానికి గురయ్యాడు. ఇలా ఈ సీరియల్ తో ట్రావెల్ అయిన కొంతమంది తమ అనుభవాలు చెప్పుకున్నారు.. మొత్తా నికి ఈ ఎపిసోడ్ హాయిగా సాగిపోయింది.. మధ్యలో శ్రీముఖి అరుపులు, కేకలు పంటికి ఇనుప గుగ్గిళ్ళ మాదిరి తగిలాయి. ఈమధ్య డ్రెస్ సెన్సే లేదనుకుంటే… ఎక్కడ ఏం మాట్లాడాలో కూడా మర్చిపోయినట్టుంది.. కనీసం ఆమెకు బేసిక్ సోయి కూడా లేదు. అది ఆమెకు ఎవరైనా చెబితే బాగుండు.