
కథ నచ్చితే ఇమేజ్‌ను ఇంటి గేటు వద్దే వదిలేసి సినిమాలు చేస్తుంటాడు దగ్గుబాటి వెంకటేశ్. అందుకే సక్సెస్‌ఫుల్ హీరోగా మారి విక్టరీనే ఇంటిపేరుగా మార్చుకున్నాడు వెంకీ. మరే సీనియర్ హీరోకు లేనంతగా మహిళా అభిమానులను సంపాదించుకున్న వెంకటేశ్ వైవిధ్యమైన చిత్రాల్లో నటించేందుకు ముందుంటాడు. కుర్ర హీరోలతో మల్టీస్టారర్స్‌కూ వెనుకాడడు. ఈ మధ్యే మేనల్లుడు అక్కినేని నాగచైతన్యతో కలిసి ‘వెంకీ మామ’తో మరో విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పుడు తమిళ్ సూపర్ హిట్ మూవీ ‘అసురన్’ రీమేక్‌లో నటిస్తున్నాడు. ధనుష్ నటించిన ఈ మూవీ తమిళ్‌లో భారీ విజయం అందుకోవడంతో పాటు దేశ వ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది. ఈ మూవీని ‘నారప్ప’పేరుతో రీమేక్ చేస్తున్నాడు వెంకీ. సురేష్ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ , వి క్రియేషన్స్ బ్యానర్ల కింద దగ్గుబాటి సురేశ్ బాబు, కలైపులి థాను ఈ మూవీని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్నాడు. మణిశర్మ మ్యూజిక్ డైరెక్టర్.
వెంకటేశ్ ‘నారప్ప’ పెద్ద కొడుకు ఇతనే
వెంకటేశ్ సరసన ప్రియమణి హీరోయిన్. మూవీలో నారప్ప భార్య సుందరమ్మగా డీగ్లామర్ పాత్రను ప్రియమణి పోషిస్తోంది. ఓ భూస్వామి చేతిలో అణచివేతకు గురైన దళిత కుటుంబం చేసే పోరాటమే ఈ చిత్రం కథ. మాతృక ‘అసురన్’ ప్రకారం నారప్ప (వెంకీ), సుందరమ్మ (ప్రియమణి)లకు ఇద్దరు కొడుకులు ఉంటారు. భూస్వామి చేతిలో పెద్ద కొడుకు చనిపోతాడు. ఆ పాత్రలో ‘కేరాఫ్ కంచరపాలెం’ ఫేమ్ కార్తీక్ రత్నం నటిస్తున్నాడు. ఈ విషయాన్ని చిత్ర బృందం ప్రకటించింది. ఈ రోజు (ఆదివారం) కార్తీక్ పుట్టిన రోజు. అతనికి శుభాకాంక్షలు తెలుపుతూ మునికన్నా ఫస్ట్ లుక్ విడుదల చేసింది. తెలుగు నేటివిటీకి తగ్గట్టు ఈ చిత్రంలో కొన్ని మార్పులు చేసినట్టు తెలుస్తోంది. కీలకమైన లాయర్ పాత్రలో ప్రకాశ్ రాజ్ నటిస్తుండగా.. మురళీ శర్మ, సంపత్ రాజ్, రాజీవ్ కనకాల, అజయ్, శ్రీతేజ్, రావు రమేశ్ ఇతర కీలక పాత్ర పోషిస్తున్నారు.