Kannada Trollers- Prashanth Neel: కన్నడ సినిమా పరిశ్రమ అంటే.. కేజీఎఫ్ కు ముందు, ఆ తర్వాత అని నిర్వచించుకోవచ్చు. వాస్తవానికి అప్పటిదాకా వారి సినిమాలు బయటి మార్కెట్ లను దున్నేసిన సందర్భాలు లేవు. ఒకవేళ ఉన్నా అవి అరా కొరే. అలాంటి కన్నడ పరిశ్రమలో కేజీఎఫ్ తర్వాత వరుసగా హిట్ సినిమాలు పడుతున్నాయి. అదే మిగతా ఇండస్ట్రీలో సినిమాలు అడ్డంగా తన్నేస్తున్నాయి.. ఇందులో హిందీ పరిశ్రమది మరింత దారుణమైన పరిస్థితి.. నడ మంత్రపు సిరి, నరాల మీద పుండు నిలవనీయవు అన్నట్టు..ఇప్పుడు ఓ నాలుగైదు హిట్లు పడేసరికి కన్నడ అభిమానులు కళ్ళు నెత్తికెక్కాయి. వాళ్ల భాషాభిమానం శృతి మించి ఇతరుల పట్ల ద్వేషంగా మారుతున్నది. ఈ విషయంలో మన తెలుగు వాళ్ళు నిజంగా అభినందనీయులు. కన్నడ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మరణిస్తే అందరిలాగే కన్నీరు పెట్టుకున్నారు. ఒక కేజీఎఫ్ సినిమాను సూపర్ హిట్ చేశారు. కాంతారాను కళ్ళకు అద్దుకున్నారు. కన్నడను మన సౌతే అనుకున్నారు తప్ప ఎన్నడూ కూడా విడిగా చూడలేదు. కానీ ఇదే కన్నడిగుల నుంచి దూరమైంది.

తాజాగా కన్నడ ట్రోలర్లు దర్శకుడు ప్రశాంత్ నీల్ పై పడ్డారు. ఏదో ఒక సాకుతో వెక్కిరించడం, విమర్శించడాన్ని పనిగా పెట్టుకున్నారు. వాస్తవానికి కన్నడలో ఈ పరిస్థితి గతంలో లేదు.. కేజీఎఫ్_ 2 తర్వాత ప్రశాంత్ నీల్ ప్రభాస్ తో ఇప్పుడు సాలార్ తీస్తున్నాడు.. దానిని హోం బాలే ఫిలిమ్స్ నిర్మిస్తోంది.. ఈ సినిమా షూటింగ్ మధ్యలో ఉంది. తర్వాత ప్రశాంత్ జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా కమిట్ అయ్యాడు. ప్రశాంత్ కేవలం తెలుగు ఇండస్ట్రీ వైపు మాత్రమే వెళ్తున్నాడని కన్నడ అభిమానుల ఆగ్రహం.. అంతేకాదు ప్రశాంత్ నీల్ ప్యూర్ తెలుగువాడు.. మాజీ మంత్రి రఘువీరారెడ్డి కుటుంబీకుడు.. తన పేరులోని నీల్ అనే పదానికి అర్థం వాళ్ళ స్వగ్రామం నీలకంఠాపురం అని.
ఇవన్నీ కూడా ప్రశాంత్ పై కోపానికి, ద్వేషానికి కారణమవుతున్నాయి.. మొన్నటికి మొన్న ఆ యష్ బర్త్ డే అయితే ప్రశాంత్ విషెస్ చెప్పాడు.. అది సరిపోదట? ఏదో ఒకటి చెబుతూ కన్నడిగులు ప్రశాంత్ ను ట్రోల్ చేస్తున్నారు.. కన్నడ అభిమానులు మరీ ఇలా తయారయ్యారేమిటి అనుకుని ప్రశాంత్ ప్రస్తుతం తన సోషల్ మీడియా ఖాతాలు మొత్తం రద్దు చేసుకున్నాడు.. మీడియాలో ఏమైనా రాసుకోండి అంటూ వదిలేశాడు. సాలార్ సినిమా తీసేది కూడా హోం బాలే ఫిలిమ్సే. తాజాగా వారు మలయాళం లో కూడా తీయబోతున్నారు.. త్వరలో తమిళంలో కూడా తీస్తామని, మొత్తం మూడు వేల కోట్ల మేరకు పెట్టుబడి పెడతామని ఆ సంస్థ ప్రకటించింది.. కన్నడిగుల్లాగే ఆలోచిస్తే ఇక టాలీవుడ్, కోలీవుడ్, మాలీ వుడ్ కూడా హోంబాలే నిర్మాత మీద పడి ఏడవాలా? విపరీతంగా ట్రోల్ చేయాలా? సినిమా అనేది పక్కా వ్యాపారం.. కానీ ఈ విషయమే ఆ కన్నడ అభిమానులకు అర్థం కావడం లేదు. ఆ లెక్కకు వస్తే దిల్ రాజు తమిళంలో వారీసు అనే సినిమా తీయలేదా? ఒక భాష హీరో సినిమాను మరో భాష వాళ్లు చూడటం లేదా? ఇంకో భాష దర్శకులను ఇంకో భాష అభిమానులు నెత్తిన పెట్టుకోవడం లేదా? ఇవేం నెత్తి మాసిన పనులు.

వాస్తవానికి ఈ పైత్యం రష్మిక దగ్గర నుంచి మొదలైంది. నిజానికి ఆమెకున్న ఈ గొడవ తన బ్రేకప్ లవర్ రక్షిత్ శెట్టి మీద కోపం.. ఆ కిరిక్ పార్టీ బ్యాచ్ మీద కోపం అందుకే రిశబ్ శెట్టిని గోకుతూ ఉంటుంది.. రిషబ్ ఆమెను కూడా గోకుతూనే ఉంటాడు. అదంతే దానికి ఆమెను కన్నడ వ్యతిరేకిగా ముద్ర వేసి ట్రోలర్లు రచ్చ రచ్చ చేస్తున్నారు. ఆమెకు కన్నడ కంటే తెలుగు, తమిళం, హిందీ ఎక్కువ అయిపోయాయని విమర్శిస్తున్నారు. వేరే భాష సినిమాలు చేస్తే తప్పు ఏమిటో వారు చెప్పరు? నటించడం అభివృద్ధి. నాలుగు పైసలు వెనుకేసుకోవాలంటే అన్ని భాషల్లోనూ నటించాల్సిందే. పోనీ ఆ కన్నడ హీరో సినిమాల్ని వేరే భాష ల ప్రేక్షకులు చూడనక్కర్లేదా? ఈ నాన్సెన్స్ పట్టించుకోవడం దేనికని ఇక తెలుగు లింక్స్ ఉన్న సెలబ్రిటీలు మొత్తం తమ సోషల్ మీడియా ఖాతాలు మొత్తం రద్దు చేసుకొని పెద్ద దండం పెట్టేయడమేనా? ఇదెక్కడి అభిమానం? ఇది ఎక్కడి నెత్తి మాసిన పైత్యం? మీ ద్వేషానికి ఓ దండం రా బాబూ!