Kannada Cinema Industry: అవును.. ఇప్పుడు కన్నడ సినిమాదే హవా! వందల కోట్లు, గ్రాఫిక్స్, చెవులు బద్దలయ్యే బిజిఎం.. ఇవన్నీ ఉన్నా అన్ని ఉడ్ ల సినిమాలు వచ్చినట్టే వచ్చి వెళ్ళిపోతున్నాయి. “మేం మారాం రా బాబూ మాకు నచ్చిన సినిమాలు తీయండి” అని ప్రేక్షకులు మొత్తుకుంటున్నా నిర్మాతలు మారడం లేదు. దర్శకులు నేల నుంచి కిందకు రావడం లేదు. హీరోలు ఇంకా తాము దైవాంశ సంభూతులమనే ఫోబియా నుంచి బయటకు రావడం లేదు. వాస్తవానికి నటన అంటే మన అభినయాన్ని ప్రదర్శించడం. ప్రేక్షకులను అనుభూతి చెందేలా చేయడం. సీటు చివరి అంచున కూర్చొని తర్వాత ఏం జరుగుతుందో అనేలా చేయడం. కానీ రక్తి కట్టించే పాత్రలు ఏవి? పాత్రధారులు ఏరి? సపోజ్ ఇండియన్ తెరను ఇప్పుడు కాంతారా షేక్ చేస్తోంది కదా? ఆ సినిమాలో రిషబ్ శెట్టి పాత్రకు ఎవరు సరిపోలుతారు? సినిమా క్లైమాక్స్ చివరి పది నిమిషాల్లో ఆ స్థాయిలో ఎవరు నటిస్తారు? ఏ ఉడ్ లలో అంజనం వేసి వెతికినా కనిపించడం లేదు కదా! నటన అంటే చొక్కా నలగకుండా పదిమందిని కొట్టడం కాదు. నటన అంటే హీరోయిన్ ను ఎక్కడపడితే అక్కడ తాకడం కాదు. అన్నింటికన్నా నటన అంటే చరిత్రకు వక్ర భాశ్యం చెప్పడం అంతకన్నా కాదు. మనం వందల కోట్లు దాటేసింది అని చెప్పుకునే తెలుగులో ఒక చరిత్రను, ఒక భౌగోళిక సాంస్కృతిక విస్తృతిని ఔపోసన పట్టి తీసిన సినిమా ఒకటైనా ఉందా?!

ఎప్పుడో పాఠాలు నేర్పింది
కన్నడ సినిమా అంటే ఇప్పుడు కే జి ఎఫ్, విక్రాంత్ రోణా, కాంతారా గురించి చెప్పుకుంటున్నాం గానీ.. ఒకప్పుడు భారతీయ సినీ పరిశ్రమకు కన్నడ సినిమా కొత్తదారి చూపింది. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం. మొట్టమొదటిసారిగా పూర్తి జల అంతర్భాగం నేపథ్యంలో తీసిన సినిమా “ఒందు మొత్తిన కథ”! దీనిని ఆదర్శంగా తీసుకునే పలు చిత్ర సీమల్లో నీటి నేపథ్యంలో సినిమాలు వచ్చాయి. తెలుగులో సాగర వీరుడు సాగర కన్య, హిందీలో అక్షయ్ కుమార్ బ్లూ.. ఇలా చెప్పుకుంటూ పోతే బోలెడు. కన్నడలో రూపొందిన అనురాగ అరళితు అనే సినిమా ఆరు భాషల్లో రీమేక్ అయింది. కన్నడ కంఠీరవ డాక్టర్ రాజ్ కుమార్ భారత దేశ సినీ చరిత్రలో అందరికంటే ముందుగా గౌరవ డాక్టరేట్ పురస్కారం పొందారు. జెడర భలే పేరుతో కన్నడ చిత్ర సీమ వాళ్లే దేశంలో మొదటి జేమ్స్ బాండ్ సినిమా తీశారు. కన్నడ కంఠీరవ డాక్టర్ రాజ్ కుమార్ అమెరికాలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన కెంటకీ కొలోనియల్ పురస్కారాన్ని పొందారు. పురస్కారం పొందిన తొలి భారతీయ నటుడు అతను. ఆఫ్రికడలీ షీలా అనే పేరుతో కన్నడలో రూపొందిన సినిమా మొత్తం ఆఫ్రికాలోనే షూటింగ్ జరుపుకుంది. బహుశా దక్షిణ భారత చిత్ర పరిశ్రమల్లో ఆఫ్రికాలో మొత్తం షూటింగ్ జరుపుకున్న మొదటి సినిమా ఇదే. కన్నడ హీరో విష్ణువర్ధన్ నటించిన ఆప్తమిత్ర సినిమా ఒక థియేటర్ లో రెండు కోట్లకు పైగా వసూలు చేసింది. అప్పుడు టికెట్ ధర కేవలం 30 రూపాయలు మాత్రమే.

ఆ రికార్డును బ్రేక్ చేయడానికి 11 సంవత్సరాలు పట్టింది. పెరిగిన టికెట్ ధరలతో బాహుబలి సినిమా ఆప్తమిత్ర సినిమా రికార్డును బ్రేక్ చేసింది. మాల్గుడి కథల పేరుతో టీవీల్లో ప్రసారమైన దారవాహికలకు గానూ శంకర్ నాగ్ అనే కన్నడ దర్శకుడికి పలు అంతర్జాతీయ పురస్కారాలు లభించాయి. ఒక ధారావాహిక, అందులోనూ స్థానిక భాషలో రూపొందడం.. అటువంటి దానికి అంతర్జాతీయ పురస్కారాలు రావడం అంటే మామూలు విషయం కాదు. భారతదేశ సినీ చరిత్రలో ఇదే మొదటిది. ఇక పునీత్ రాజ్ కుమార్ హీరోగా రూపొందిన మీలనా అనే సినిమా బెంగళూరులోని ఓ మల్టీప్లెక్స్ లో 500 రోజులకు పైగా ఆడింది. ఈ ప్రకారం చూసినా ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ చరిత్రలో ఇది ఒక అరుదైన రికార్డు. 75 లక్షలతో తీసిన ఒక సినిమా 75 కోట్లు వసూలు చేసిందంటే నమ్ముతారా?! మీరు తప్పకుండా నమ్మాల్సిందే.. గోల్డెన్ గణేష్ హీరోగా ముంగారమలై అనే ఒక సినిమా కేవలం కర్ణాటకలోనే 75 కోట్లకు పైచిలుకు వసూలు చేసింది. ఇక శివరాజ్ కుమార్ హీరోగా నటించిన ఓమ్ అనే కన్నడ సినిమా ఐదు వందల సార్లు రీ_ రిలీజ్ అయింది. రీ రిలీజ్ అయినప్పటికీ కూడా 100 రోజుల వేడుక జరుపుకుంది.
కన్నడ సినిమా మారింది
ఇంతటి చరిత్ర ఉన్న కన్నడ సినిమా.. తమ భాషలో రూపొందిన సినిమాలను ఇతర ప్రాంతాల్లో విడుదల చేసేది కాదు. అలాగే డబ్బింగ్ సినిమాలు కూడా తమ ప్రాంతంలో విడుదల కానిచ్చేది కాదు. అనేక కట్టుబాట్ల మధ్య సినిమా నిర్మాణం జరుపుకునేది. అయితే కొంతకాలంగా కన్నడ సినిమా తాను విధించుకున్న నిబంధనల నుంచి దూరం జరగడం ప్రారంభించింది. అలా ఎప్పుడైతే దూరం జరిగిందో భిన్నమైన ఫలితాలను అందిపుచ్చుకుంటున్నది. కే జి ఎఫ్, విక్రాంత్ రోణా, ఇప్పుడు కాంతారా.. భవిష్యత్తులో ఇంకా ఎన్నో..