Swathi Sathish: అందమైన ముఖం.. హీరోయిన్ కటౌట్. శ్రీదేవి కూడా హీరోయిన్ గా టాప్ లోకి రావడానికి ముఖారవిందం కోసం ఎన్నో సర్జరీలు చేసుకుందట.. మన బన్నీ అల్లు అర్జున్ సైతం పెదవులను ఆపరేషన్ చేసుకొనే తగ్గించుకున్నాడట.. సినీ లోకంలో హీరోలు, హీరోయిన్లు అందం కోసం ఇలా ఎన్నో ఆపరేషన్లు చేయించుకున్న వారే. అయితే ఆ అందాల ప్రపంచంలో తాను కూడా ఎదగాలని కలలుగన్నది ఓ హీరోయిన్. కానీ ఆమె ప్రయత్నం విఫలమైంది. అందమైన హీరోయిన్ అందవిహీనంగా తయారైంది. కురూపీలా కనిపిస్తోంది. దీనికంతటికి కారణం ఒక డాక్టర్. ఆ డాక్టర్ చేసిన చికిత్స వికటించి ఇలా ముఖం తయారైంది.

ఇటీవలే బెంగళూరులో ఒక నటి అందం కోసం చేయించుకున్న సర్జరీ వికటించి చనిపోయిన ఘటన మరిచిపోకముందే అదే కన్నడ నాట మరో నటి అందమైన ముఖం పాడైపోయింది. సర్జరీ వికటించి ముఖం అంతా వాచిపోయి గుర్తుపట్టలేని విధంగా ఆ హీరోయిన్ మారిపోయింది.ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
కన్నడలో హీరోయిన్ గా పలు చిత్రాల్లో నటించిన ‘స్వాతి సతీష్’ గురించి అందరికీ చిరపరిచితమే. ఇటీవలే ఆమె తన అందాన్ని మెరుగుపరచుకోవడానికి ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో ‘రూట్ కెనాల్ థెరపీ’ చికిత్స చేయించుకుంది. అయితే ఈ సర్జరీ కాస్త వికటించడంతో ఆమె ముఖం అంతా వాచిపోయింది. ముఖం వాపు రెండు మూడు రోజుల్లో నయమవుతుందని వైద్యులు తెలిపారు. అయితే మూడు వారాలు అయినా ముఖం వాపు తగ్గలేదు. ముఖం వాపు తగ్గకపోగా తీవ్రమైన నొప్పితో బాధపడింది. ముఖం ఉబ్బిన కారణంగా దాదాపు ఆమెను ఎవరూ గుర్తించలేని పరిస్థితి. ఆ ముఖంతో ఇంటి నుంచి బయటకు వెళ్లడం కష్టంగా ఉందని.. తనకు వచ్చిన అవకాశాలు అన్ని వెనక్కి వెళ్లిపోయాయని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.
ఇక నటి స్వాతి సతీష్ కు చికిత్సలో భాగంగా అనస్థీషియా బదులుగా సాలిసిలిక్ యాసిడ్ ఇచ్చినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. స్వాతి చికిత్స నిమిత్తం మరో ఆస్పత్రికి వెళ్లడంతో ఈ విషయం బయటపడింది. ఆమె కోలుకున్నాక సదురు ఆస్పత్రి, వైద్యుడిపై కేసు వేయనున్నట్లు తెలుస్తోంది.