Junior NTR: ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం వివాదాస్పదమైంది. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మారుస్తూ అసెంబ్లీలో తీర్మానం చేశారు.ఈ మేరకు ప్రత్యేక జీవో విడుదల చేశారు. ఎన్టీఆర్ పేరు తీసేసి వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీగా మార్చారు. ఈ నిర్ణయాన్ని టీడీపీ వర్గాలు తీవ్రంగా తప్పుబడుతున్నాయి. ఎన్టీఆర్ అభిమానులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడో 1986లో స్వర్గీయ ఎన్టీఆర్ స్థాపించిన ప్రముఖ మెడికల్ యూనివర్సిటీకి వైఎస్సార్ పేరు ఎలా పెడతారని ప్రశ్నిస్తున్నారు. నిన్నటి నుండి ఏపీ రాజకీయాల్లో హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు ప్రకంపనలు రేపుతోంది.

ఈ వివాదంపై ఎన్టీఆర్ మనవడు జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు. ఆయన ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని ఖండించారు. చాలా వరకు ఆయన కామెంట్ సామరస్యంగా ఉన్నప్పటికీ లోలోపల ఉన్న అసహనం స్పష్టంగా కనిపించింది. ఎన్టీఆర్ తన ట్వీట్ లో ”ఎన్టీఆర్, వైఎస్సార్ విశేష ప్రజాదరణ కలిగిన గొప్ప నాయకులు. ఈ రకంగా ఒకరి పేరు తీసివేసి ఒకరి పేరు పెట్టడం ద్వారా వచ్చే గౌరవంతో వైఎస్సార్ స్థాయి పెరగదు. ఎన్టీఆర్ స్థాయి తగ్గించదు. విశ్వవిద్యాలయానికి పేరు మార్చడం ద్వారా ఎన్టీఆర్ సంపాదించుకున్న కీర్తిని , తెలుగు జాతి చరిత్రలో వారి స్థాయిని, తెలుగు ప్రజల గుండెల్లో ఉన్న ఆయన జ్ఞాపకాలను చెరిపివేయలేరు”, అని కామెంట్ చేశారు.
Also Read: Pawan Kalyan: ఎన్టీఆర్ కు మద్దతుగా పవన్ కళ్యాణ్…జగన్ కు దిమ్మతిరిగే స్టెప్
హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు తీసేయడం వలన ఎన్టీఆర్ ప్రతిష్టకు వచ్చిన నష్టం ఏమీ లేదని జూనియర్ ఎన్టీఆర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. తాత స్థాపించిన టీడీపీ పార్టీకి అసలైన వారసుడు జూనియర్ ఎన్టీఆరే అని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆయన ట్వీట్ ఆసక్తికరంగా మారింది. 2009 నుండి రాజకీయాలకు దూరంగా ఉంటున్న ఎన్టీఆర్ పొలిటికల్ ఇష్యూస్ పై అరుదుగా స్పందిస్తారు. ఆ మధ్య వైసీపీ నాయకులు మేనత్త భువనేశ్వరిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని చంద్రబాబు ఆరోపించారు. అప్పుడు కూడా ఎన్టీఆర్ ఖండిస్తూ ఓ వీడియో బైట్ విడుదల చేశారు.

వైసీపీ వర్గాల్లోనే ఈ నిర్ణయంపై వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. సీఎం జగన్ సిస్టర్ షర్మిల సైతం పేరు మార్పు సరికాదని తప్పుబట్టారు. ఈ నేపథ్యంలో సీఎం జగన్ వెనక్కి తగ్గుతాడా? ఎప్పటిలాగే ఐ డోంట్ కేర్ అంటూ ముందుకు వెళతాడా? అనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం ఎన్టీఆర్ ట్వీట్ వైరల్ గా మారింది. ఫ్యాన్స్ కామెంట్స్ ద్వారా ఆయన యాక్టీవ్ పాలిటిక్స్ లోకి రావాలని డిమాండ్ చేస్తున్నారు. చంద్రబాబు నాయుడికి ఎప్పటి నుండో ఎన్టీఆర్ సెగ తగుల్తుంది. ఆయన సభలో ‘సీఎం ఎన్టీఆర్’ అంటూ బ్యానర్లు వెలుస్తున్నాయి.
Also Read: EC- Jagan: అది ఎన్నికల నియమావళికి విరుద్ధం.. వైసీపీ శాశ్వత అధ్యక్షుడు జగన్ కు ఈసీ షాక్
— Jr NTR (@tarak9999) September 22, 2022