దర్శకుడు రాజమౌళి ‘బాహుబలి’ తర్వాత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘రౌద్రం రణం రుధిరం(ఆర్ఆర్ఆర్)’. ఈ మూవీలో మెగా పవర్ స్టార్ రాంచరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తున్నారు. రాంచరణ్ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమురంభీం పాత్రలో నటిస్తుండటంతో ఈ మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల మెగా పవర్ స్టార్ రాంచరణ్ పుట్టిన రోజు సందర్భంగా ‘ఆర్ఆర్ఆర్’ టీం అభిమానులకు ఓ సర్ ప్రైజ్ ఇచ్చింది. ‘బీమ్ ఫర్ రామరాజు’ పేరిట ‘ఆర్ఆర్ఆర్’ చెర్రీ పాత్రకు సంబంధించిన వీడియో రిలీజ్ చేసింది. బ్యాక్ గ్రౌండ్లో ఎన్టీఆర్ వాయిస్ ఓవర్.. వీడియోలో చెర్రీ యాక్షన్ కు అభిమానుల్లో గుస్ బమ్స్ వచ్చాయి. ఈ వీడియో విడుదలైన కొద్ది క్షణాల్లోనే ట్రెండింగ్లోకి దూసుకెళ్లింది.
‘ఆర్ఆర్ఆర్’ మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుండగా లాక్డౌన్ కారణంగా వాయిదా వేయాల్సి వచ్చింది. ఇప్పట్లో సినిమా షూటింగ్ మొదలయ్యేలా కన్పించడం లేదు. మరోవైపు ఎన్టీఆర్ బర్త్ డే మే20 సమీపిస్తుండటంతో అభిమానులు ‘ఆర్ఆర్ఆర్’ నుంచి సర్ ప్రైజ్ కోసం వెయిట్ చేస్తున్నారు. గతకొద్దిరోజులుగా ‘ఆర్ఆర్ఆర్’ నుంచి ఎలాంటి అప్డేట్ లేకపోవడంతో ఎన్టీఆర్ అభిమానులు అయోమయంలో పడిపోయారు. ఈ నేపథ్యంలోనే ‘ఆర్ఆర్ఆర్’ నిర్మాత డీవీవీ దానయ్య ఈ విషయంపై స్పందించారు. ఎన్టీఆర్ బర్త్ డేకు ‘ఆర్ఆర్ఆర్’ నుంచి తప్పకుండా సర్ ప్రైజ్ ఉంటుందనే గుడ్ న్యూస్ చెప్పారు. అయితే అది ఏమిటీ? ఎలా ఉంటుంది? అనేది మాత్రం చెప్పలేదు.
అదేవిధంగా ‘ఆర్ఆర్ఆర్’ మూవీ ఇప్పటికే 70శాతం పూర్తయిందని.. మరో 30శాతం పూర్తి కావాల్సి ఉందని స్పష్టం చేశారు. ఇప్పట్లో మూవీ షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశాలు కన్పించడం లేదన్నారు. చిత్రానికి సంబంధించి వీఎఫ్ఎక్స్ పనులు జరగాల్సి ఉందని ఈ పరిస్థితుల్లో ‘ఆర్ఆర్ఆర్’ అనుకున్న టైంకు రిలీజ్ చేయడం కష్టమేనని తెలిపారు. దీంతో ఈ మూవీ 2021 సంక్రాంతి బరి నుంచి తప్పుకున్నట్లే కన్పిస్తుంది. ‘ఆర్ఆర్ఆర్’లో ఎన్టీఆర్ కు జోడీగా హాలీవుడ్ నటి ఒలివియా మోరిస్, చరణ్ జోడీగా బాలీవుడ్ భామ ఆలియా భట్ నటిస్తున్నారు. అదేవిధంగా బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్, శ్రియ, హాలీవుడ్ స్టార్స్ రే స్టీవెన్ సన్, అలిసన్ డూడీలు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.