Vyuham: తెలుగు నాట మరో పొలిటికల్ మూవీ ప్రేక్షకులకు ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. ఏపీ సీఎం జగన్ రాజకీయ జీవిత కథ ఆధారంగా వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ‘వ్యూహం’ అనే సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. జగన్ పాత్రను తమిళ నటుడు అజ్మీల్ పోషిస్తున్నాడు. వైయస్ భారతి క్యారెక్టర్ లో మానస రాధాకృష్ణన్ కనిపించబోతున్నారు. ఏపీలో నెలకొన్న రాజకీయ పరిణామాలను కథాంశంగా చేసుకొని తెరకెక్కుతోంది ఈ సినిమా. దాసరి కిరణ్ కుమార్ దీనిని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ ముగిసింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలో ఈ చిత్రం విడుదలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్ ఆలోచింపచేస్తోంది. 2009లో అప్పటి ఉమ్మడి రాష్ట్ర సీఎం డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ ప్రమాదానికి గురైన నల్లమల అడవులను చూపించడంతో టీజర్ ఆరంభమవుతుంది. ఇప్పటికే ఈ టీజర్ అలరించింది. జగన్ తో పాటు భార్య భారతి, తల్లి విజయమ్మ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లను టీజర్ లో చూపించారు. మెగాస్టార్ చిరంజీవి పాత్రను సైతం పరిచయం చేశారు.
ఈ చిత్రాన్ని చాలా సహజసిద్ధంగా చూపించే ప్రయత్నం చేశారు ఆర్జీవి. కృష్ణ, గుంటూరు పరిసర జిల్లాలో ఎక్కువగా చిత్రీకరించారు. విపక్ష నేతగా జగన్ పాదయాత్ర, వైయస్ విజయమ్మ, షర్మిళాలు పాదయాత్రలో పాల్గొన్న సన్నివేశాలను తెరకెక్కించారు. పార్టీ జెండా ఆవిష్కరణ, విపక్ష నేతగా జగన్ నిర్వహించిన నిరాహార దీక్ష సన్నివేశాలు వంటివి ప్రత్యేక ఆకర్షణగా తీర్చిదిద్దారు.
సరిగ్గా ఎన్నికల ముంగిట ఈ చిత్రం విడుదలకు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ సంచలనం సృష్టించింది. తాజాగా వ్యూహం సినిమా నుంచి లిరికల్ సాంగ్ ను బయటకు విడుదల చేశారు రామ్ గోపాల్ వర్మ. ఈ సాంగ్ యూట్యూబ్ లింకును తన అధికారిక ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేశారు. ” జగనుడి మౌన దీక్ష, జనం కోసం కార్యదీక్ష, పావులు కదుపుతున్న వారికి హెచ్చరిక ” అనే లిరిక్ తో సాగుతుంది ఈ పాట. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సినిమా పట్ల అంచనాలను పెంచుతోంది.