ముప్పై ఏళ్ల క్రితం మోడల్ గా కెరీర్ ను మొదలు పెడతాను అంటే అందరూ ఫక్కున నవ్వే వాళ్ళు. అవును మరి, మోడల్ అంటే పెద్దగా తెలియని రోజులు అవి. పైగా మోడల్ అంటే దిగువ స్థాయి వ్యక్తులు నటిస్తారు అనే అభిప్రాయం ఉండేది ఆ రోజుల్లో. అందుకే అటు వైపు పెద్దగా ఎవ్వరు వెళ్లేవారు కాదు. అలాంటిది మోడల్ అవ్వాలని ఓ కుర్రాడు కలలు కన్నాడు.
కట్ చేస్తే.. నిజంగానే మోడల్ అయిపోయాడు. పైగా మేల్ మోడల్ కి ఒక బ్రాండ్ అయిపోయాడు. తనకే కాదు, తన వృత్తిలోని వారికీ కూడా ఒక గౌరవాన్ని తీసుకొచ్చాడు. దాంతో అతనికి సినిమా అవకాశాలు కూడా వచ్చాయి. బాలీవుడ్ లో ‘హీరో’ సినిమాతో వెండితెర పై కథానాయకుడిగా పరిచయం అయ్యాడు. అయితే హీరోగా నిలబడలేదు.
మొదటి సినిమాతోనే ప్రేక్షకులను కట్టిపడేసినా హీరోగా ఆ తరువాత పెద్దగా అవకాశాలు రాలేదు. అయినా ఆ కుర్రాడు కుంగిపోలేదు. విలన్ గా మారాడు. పలు హిందీ చిత్రాల్లో నటించి, తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థాయిని స్థానాన్ని సంపాదించుకున్నాడు. అంతలో అతనికి వ్యాపారం చేయాలనే ఆలోచనలు మొదలయ్యాయి. చాల రకాల బిజినెస్ లు చేశాడు. కానీ అన్నిటిలో తీవ్ర నష్టాలను చవిచూడాల్సి వచ్చింది,
పూర్తిగా అప్పుల బారిన పడ్డాడు. అప్పటికే పెళ్లి అయి పిల్లలు కూడా ఉన్నారు, అందరూ రోడ్డు మీదకు రావాల్సిన పరిస్థితి వచ్చేసింది. అయినా తనకు చెడ్డ పేరు రాకుండా జాగ్రత్త పడ్డాడు. అందరికీ అప్పును చెల్లించే క్రమంలో అన్ని అమ్మేసుకున్నాడు. ఆ తరువాత పస్తులతో తన పిల్లలను ఉంచలేక, తన ఇంట్లోని ఒక్కో వస్తువును అమ్ముతూ ఆఖరికి తన బెడ్‌ను కూడా అమ్మేసుకున్నాడు.
స్టార్ గా వెలిగిపోయిన అతను కటిక నేల మీద పడుకున్నాడు. అతనే.. జాకీ ష్రాఫ్. అదేంటో పై నుంచి కిందపడటం, కింద నుంచి మళ్లీ పైకి ఎదగడం జాకీ ష్రాఫ్ జీవితంలో అనేకసార్లు తరుచు జరుగుతూ వచ్చాయి. అయితే, తన జీవితంలో ఎన్ని కష్టనష్టాలు చవిచూసిన జాకీ మాత్రం ఎప్పుడూ ఒకేలా ఉన్నాడు. అత్యంత దుర్దినాలని కూడా అంతే గౌరవంగా సీక్వరించాడు. ప్రస్తుతం యంగ్ స్టార్ హీరోగా దూసుకువెళ్తున్న టైగర్ ష్రాఫ్ కి తండ్రిగా ఆదర్శంగా నిలిచాడు.