
సిల్వర్ స్క్రీన్ పై కావొచ్చు.. స్మాల్ స్క్రీన్ పై కావొచ్చు.. చాలా మంది వచ్చి పోతుంటారు. కానీ.. కొందరే ఆడియన్స్ కు గుర్తుండిపోతారు. అలాంటి వారిలో ఒకరు అవినాష్. ‘జబర్దస్త్’ కామెడీ షోలో ముక్కు అవినాష్ గా ఫేమస్ అయిన ఈ కమెడియన్.. ఆ షోలో ఉన్నన్ని రోజులూ ప్రేక్షకులను అలరించాడు. ఆ పాపులారిటీతోనే బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. టైటిల్ సాధించలేకపోయినప్పటికీ.. మరింత క్రేజ్ మాత్రం సంపాదించాడు. అయితే.. ఇప్పుడు తన జీవిత భాగస్వామిని కూడా సాధించాడు. మరి, ఇంతకీ ఆమె ఎవరు? అన్నది చూద్దాం.
మిమిక్రీ ఆర్టిస్టుగా కెరీర్ మొదలు పెట్టిన అవినాష్.. హీరోల వాయిస్, మేనరిజం అనుకరిస్తూ మంచి పేరు తెచ్చుకున్నాడు. ఆ విధంగా.. జబర్ధస్త్ స్టేజ్ మీదకు ఎంట్రీ ఇచ్చాడు. మొదట్లో.. సైడ్ క్యారెక్టర్లు వేసిన అవినాష్.. ఆ తర్వాత తనదైన టాలెంట్ ను ప్రదర్శించి, టీమ్ లీడర్ గా ప్రమోషన్ కొట్టేశాడు. ఈ జోరు కొనసాగిస్తుండగానే.. బిగ్ బాస్ నుంచి ఆఫర్ వచ్చింది. దీంతో.. తర్జనభర్జనకు గురైన అవినాష్.. తన ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా వెళ్లాలని నిర్ణయించుకున్నాడు.
ఆ విధంగా.. బిగ్ బాస్-4 లోకి ప్రవేశించిన అవినాష్.. తనను జోకర్‌గా పరిచయం చేసుకున్నాడు. హౌజ్ లో ఉన్నన్నటి రోజులు అందరికీ కామెడీని పంచాడు. నవ్వుతూ నవ్విస్తూ.. ఆటపట్టిస్తూ హౌస్ లో గడిపాడు. తద్వారా.. జోకర్ పేరును సార్థకం చేసుకున్నాడు. అతను టైటిల్ సాధించకపోయినా.. తనదైన మార్క్ చూపించాడు. బెస్ట్ ఎంటర్‌టైనర్ గా పేరు సంపాదించుకున్నాడు. కావాల్సినంత పాపులారిటీకూడా తెచ్చుకున్నాడు. ఇప్పుడు ఆ పేరుతోనే బుల్లితెరపై బిజీ అయ్యాడు. పలు సినిమాల్లో నటించాడు. స్టార్ మాలో ప్రసారమవుతున్న ‘కామెడీ స్టార్స్’ షోలో అద్దిరిపోయే పెర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు.
అయితే.. ముక్కు అవినాష్ పెళ్లి గురించి తరచూ టీవీ షోలలో వినిపిస్తుండడంతో.. ఇతడి పెళ్లి ఎప్పుడు అవుతుందా? అనే డిస్కషన్ నడుస్తోంది. కాగా.. ఎవ్వరికీ చెప్పకుండా నిశ్చితార్థం చేసుకొని అందరికీ షాకిచ్చాడు అవినాష్. ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించాడు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టు చేసిన అవినాష్ ‘‘సరైన వ్యక్తి జీవితంలోకి వచ్చినప్పుడు ఆలస్యం ఉండదు. మా కుటుంబకాలు కలుసుకున్నాయి. తర్వాత మేము కలుసుకున్నాం. ఇది మా నిశ్చితార్థం. చాలా మంది చాలాసార్లు నా పెళ్లి గురించి అడిగారు. అతి త్వరలోనే నా అనూజతో పెళ్లి. ఎప్పటిలాగే మీ బ్లెస్సింగ్స్ ఉండాలని కోరుకుంటున్నాను’’ అని ఇన్ స్టాలో పోస్టు చేశాడు అవినాష్.
దీంతో.. అందరూ గ్రీటింగ్స్ చెబుతున్నారు. అయితే.. అవినాష్ చేసుకోబోయే అమ్మాయి ఎవరు అని సెర్చ్ చేయడం మొదలు పెట్టారు. అయితే.. అందుతున్న సమాచారం ప్రకారం.. అవినాష్ పెళ్లి చేసుకోబయే అమ్మాయి పూర్తి పేరు అనూజ వాకిటి. వీరిది పెద్దలు కుదిర్చిన పెళ్లి అని టాక్. అవినాష్ సామాజిక వర్గానికి చెందిన అమ్మాయేనని సమాచారం. మరిన్ని వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి.