Malayalam Remake Movies: పొరుగింటి పుల్లకూర రుచి. మిగతా విషయాలకేమో గాని సినిమా పరిశ్రమకు మాత్రం ఇది వందకు వందశాతం వర్తిస్తుంది. సినిమా వ్యాపారం అంటేనే కోట్లతో కూడుకున్న వ్యవహారం కాబట్టి.. నిర్మాతలు, దర్శకులు, హీరోలు సేఫ్ గేమ్ ఆడేందుకు ప్రయత్నిస్తారు. అందుకే అరువు కథలను అవలీలగా పట్టేస్తారు. వెంటనే ఇక్కడ రీమేక్ చేస్తారు. ఇక తెలుగు విషయానికొస్తే మలయాళంతో ఉన్న బంధం ఈనాటిది కాదు. ఈ ట్రెండ్ 90వ దశకం నుంచే ఉంది. మోహన్ బాబు కెరీర్ కి పెద్ద బ్రేక్ ఇచ్చిన అల్లుడుగారు, నిర్మాత ఏఎం రత్నంకు దర్శకుడిగా మంచి డెబ్యూగా నిలిచిన పెద్దరికం, చిరంజీవికి ఫర్ఫెక్ట్ కం బ్యాక్ గా పేరు తెచ్చుకున్న హిట్లర్, వెంకటేష్ కు మరో ఫ్యామిలీ హిట్ వచ్చేలా చేసిన దృశ్యం.. ఇవన్నీ కేరళ నుంచి వచ్చిన సినిమాలే. అన్నీ కూడా విజయవంతమైన సినిమాలే. కానీ ఇవి వచ్చే సమయానికి ఇప్పటికీ ప్రేక్షకుల అభిరుచుల్లో, సాంకేతిక పరిజ్ఞానంలో చాలా మార్పులు వచ్చాయి. రీమేక్ ఆలస్యం చేస్తే సినిమా మీద ప్రేక్షకులకు ఆసక్తి తగ్గిపోతుంది. అందుకే ఎంపిక విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే నిర్మాతలకు ఎదురు దెబ్బలు తప్పవు.

మలయాళం లో హిట్ అయితే చాలు
మలయాళం లో సినిమా హిట్ అయితే చాలు వెంటనే రీమేక్ హక్కులు కొనేసుకోవడం ఈమధ్య పరిపాటిగా మారింది. కోవిడ్ సమయంలో సినిమా థియేటర్లు మూతపడడంతో ప్రేక్షకులకు వినోదం అందించే బాధ్యతను ఓటీటీలు తలకెత్తుకున్నాయి. ఇదే సమయంలో మలయాళం సినిమాలను డబ్ చేసి స్ట్రీమ్ చేశాయి. దీనివల్ల ప్రేక్షకులకు కొత్త అనుభూతి కలిగింది. రొటీన్ రొడ్డ కొట్టుడు కథలకంటే మలయాళం సినిమాలు విభిన్నంగా అనిపించడంతో ప్రేక్షకులు వీటికి జై కొట్టారు. ముఖ్యంగా అంజమ్ పతీరా, ఫోరెన్సిక్, ట్రాన్స్, జల్లికట్టు, వంటి సినిమాలు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నాయి. దీంతో మలయాళం సినిమాలకు తెలుగు మార్కెట్లో భారీగా డిమాండ్ ఏర్పడింది. మలయాళం సినిమాలు వాస్తవిక జీవితానికి దగ్గరగా ఉండడం, విభిన్నమైన కోణాలను దర్శకులు స్పృశిస్తూ ఉండడం వల్ల ప్రేక్షకులకు కొత్తగా అనిపిస్తున్నాయి.
మారిన ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగానే మలయాళం సినిమాలు హిట్ అయితే చాలు వెంటనే రీ మేక్ హక్కులు కొనేసుకోవడం, ఇక్కడి స్టార్లతో తీసేయడం పరిపాటిగా మారుతున్నది. ఇంతవరకు బాగానే ఉన్నా మన ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు అవి సెట్ అవుతాయో లేదా అనేది కూడా ఆలోచించుకోవడం లేదు. ఇటీవల వచ్చిన గాడ్ ఫాదర్ మొదటి నాలుగు రోజులు దుమ్ము దులిపింది. తర్వాత ఏమైందో గానీ వసూళ్ల విషయంలో నెమ్మదించింది. ఇక పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ సైతం కూడా 90 కోట్ల వద్దే ఆగిపోయింది. కానీ ఈ రెండు సినిమాల ఒరిజినల్ వెర్షన్లు ఓటీటీ లో ఉండటం చాలా చేటు చేసింది. పెద్ద స్టార్లే కాదు చిన్న హీరోలతోనూ ఇలాంటివి చేస్తూనే ఉన్నారు. మలయాళం లో సూపర్ హిట్ అయిన కప్పేలా అనే సినిమాను బుట్ట బొమ్మగా తీస్తున్నారు. అనీఖా సురేంద్రన్ టైటిల్ రోల్ నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ పూర్తికా వచ్చింది. మంచు విష్ణు ఆండ్రాయిడ్ కట్టప్ప అనే సినిమా రైట్స్ కొనేసి తండ్రి మోహన్ బాబుతో తీసేందుకు రెడీగా ఉన్నాడు. అయితే దీని డబ్బింగ్ ప్రింట్ ఆల్రెడీ ఆహా యాప్ లో ఉంది.. హెలెన్ సినిమాను సైతం తీయాలనే అనుకున్నారు. కానీ చివరికి అది హిందీలో జాన్వీ కపూర్ తో పూర్తి చేసి రిలీజ్ కి కూడా రెడీగా ఉంచారు. కాకపోతే ఈ సినిమాలన్నీ కూడా కమర్షియల్ మీటర్ కు దూరంగా ఉండేవి. థియేట్రికల్ గా జనం రిసీవ్ చేసుకోవడం అంత సులభం కాదు. పైగా మార్పులు చేస్తే ఒక తంటా. చేయకపోతే ఒక తంటాలా ఉంది. అక్కడి దాకా ఎందుకు మలయాళం లో ప్రేమమ్ సినిమా ఒక ట్రెండ్ సెట్టర్.. అదే సినిమాను ఇక్కడ రీమేక్ చేస్తే జస్ట్ హిట్ గా నిలిచింది.
ఊరిస్తున్న మరో మలయాళం రీమేక్
పవన్ కళ్యాణ్ గత ఏడాది వకీల్ సాబ్, ఈ ఏడాది భీమ్లా నాయక్ తో నిర్మాతలకు కోట్లలో భారం కాని సినిమాలో చేసి గట్టెక్కారు. గాడ్ ఫాదర్ రూపంలో చిరంజీవి అందుకున్న సక్సెస్ సైతం కేరళ నుంచి తీసుకొచ్చిన లూసీఫరే! అయితే తాజాగా మనవాళ్లు మరో రీమేక్ మీద మనసు పడేలా ఉన్నారు. మలయాళం మెగాస్టార్ మమ్ముట్టి నటించిన రోర్సాచ్ ఇటీవల విడుదలై ఘన విజయం సాధించింది. 100 కోట్ల గ్రాస్ దాటింది. ఇదేం కమర్షియల్ ఎంటర్టైనర్ కాదు. పూర్తిగా విభిన్నమైన నేపథ్యంలో రూపొందించిన సైకలాజికల్ థ్రిల్లర్. విదేశాల నుంచి వచ్చిన హీరో భార్యతో కలిసి కారులో ప్రయాణిస్తుండగా రోడ్డు ప్రమాదానికి గురవుతాడు.

స్పృహ వచ్చి చూశాక పక్కన ఆమె ఉండదు. దీంతో ప్రమాదం జరిగిన అటవీ ప్రాంతంలో ఉండే పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేస్తాడు. తర్వాతే మొదలవుతుంది అసలు కథ.. ముందు అతడి ఉద్దేశం ఏమిటో అర్థం కాదు. ఆ తర్వాత ఎన్నో షాకింగ్ సంఘటనలు జరుగుతాయి. ఈ లైన్ మరి కొత్తది కాకపోయినా దర్శకుడు బషీర్ ట్రీట్మెంట్ చాలా ఫ్రెష్ గా అనిపిస్తుంది. ఈ సినిమాను థ్రిల్లింగ్ గా తీర్చి దిద్దడంలో బషీర్ విజయవంతం అయ్యాడు. ఈ సినిమాలో సాంకేతిక విభాగాలు కూడా పోటీపడి పని చేశాయి. కాకపోతే ఈ సినిమాలో మమ్ముట్టి హీరోగా చేశారు కాబట్టి స్టార్ అట్రాక్షన్ వచ్చింది. సక్సెస్ అందుకుంది. కానీ మన దగ్గర ఇలాంటి కథలను ఒప్పుకుంటారంటే కష్టమే! ప్రయోగాలకు ఎప్పుడూ ఒకే చెప్పే నాగార్జున లేదా రవితేజ ట్రై చేస్తే బాగానే ఉంటుంది. ఈ రోర్సాచ్ ఫలితం తెలియగానే టాలీవుడ్ నిర్మాతలు కొందరు రైట్స్ కోసం మలయాళం నిర్మాతలతో సంప్రదింపులు మొదలుపెట్టారట.