Balakrishna: గత రెండేళ్లుగా సంక్రాంతి సప్పగా సాగుతుంది. కోవిడ్ కారణంగా పెద్ద సినిమాల విడుదల లేకుండా పోతుంది. సినిమా ప్రేమికులకు సంక్రాంతి అత్యంత ఇష్టమైన సీజన్. నాలుగైదు పెద్ద సినిమాలు విడుదల అవుతాయి. థియేటర్స్ ప్రేక్షకులతో కళకళలాడుతాయి. 2021, 2022 సంక్రాంతి సీజన్స్ నిరాశగా ముగిశాయి. ఈ ఏడాది సంక్రాంతికి రాధే శ్యామ్, ఆర్ ఆర్ ఆర్ వంటి పెద్ద చిత్రాలు విడుదల కావాల్సి ఉన్నప్పటికీ… కరోనా ఆంక్షల కారణంగా విడుదల వాయిదా వేశారు. బంగార్రాజు మాత్రమే పెద్ద సినిమా హోదాలో విడుదల చేశారు.

అయితే ఈ సంక్రాంతిలో డబుల్ డోస్ ఇవ్వనున్నారు. చిరంజీవి, బాలయ్య సంక్రాంతి బరిలో దిగుతున్నారు. కోలీవుడ్ స్టార్ విజయ్ వారసుడు గా వస్తున్నాడు. మూడు పెద్ద ప్రాజెక్ట్స్ 2023 సంక్రాంతి కానుకగా విడుదల కానున్నాయి. చిరంజీవి హీరోగా దర్శకుడు బాబీ తెరకెక్కిస్తున్న వాల్తేరు వీరయ్యపై భారీ అంచనాలున్నాయి. చిరంజీవి ఊరమాస్ లుక్ ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ కలిగిస్తుంది. దీపావళి కానుకగా విడుదలైన వాల్తేరు వీరయ్య టీజర్ ఆకట్టుకుంది.
ఇక గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో తెరకెక్కుతున్న వీర సింహారెడ్డిపై కూడా అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. బాలకృష్ణకు టైటిల్ సెంటిమెంట్ కూడా కలిసి వస్తుంది. సమరసింహారెడ్డి ఇండస్ట్రీ అందుకోగా, చెన్నకేశవరెడ్డి హిట్ గా నిలిచింది. అలాగే విజయ్ వారసుడుగా వస్తున్నాడు. విజయ్ కి తెలుగులో మార్కెట్ ఏర్పడిన నేపథ్యంలో చిరు, బాలయ్యలకు ఆయన నుండి గట్టి పోటీ ఉంటుంది.

మూడు పెద్ద చిత్రాల విడుదల నేపథ్యంలో థియేటర్స్ సమస్య ఏర్పడడం ఖాయం. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో ఏ సినిమాకు ఎన్ని థియేటర్స్ అనేది నిర్ణయించేశారట. ఈ విషయంలో బాలయ్య సినిమాకు అన్యాయం జరుగుతుంది అంటున్నారు. నైజాంపై ఆధిపత్యం చెలాయిస్తున్న దిల్ రాజు వారసుడు చిత్ర నిర్మాతగా ఉన్నారు. ఈ క్రమంలో మేజర్ థియేటర్స్ వారసుడికి బ్లాక్ చేసి పెట్టాడట. తర్వాత స్థానం వాల్తేరు వీరయ్యది కాగా, వీరసింహారెడ్డికి అతి తక్కువ థియేటర్స్ దక్కనున్నాయట. ఆంధ్రాలో కూడా మేజర్ సిటీస్ లో బాలయ్యకు తక్కువ థియేటర్స్ కేటాయించారట. ఇది వసూళ్లపై తీవ్ర ప్రభావం చూపనుంది అంటున్నారు.