Hanu Raghavapudi And Prabhas
Hanu Raghavapudi And Prabhas: అభిమానులకు ఇచ్చిన మాట ప్రకారం ప్రభాస్ వేగంగా సినిమాలు చేస్తున్నారు. ఏక కాలంలో రెండు మూడు చిత్రాల షూటింగ్స్ లో పాల్గొంటున్నారు. బాహుబలి 2 అనంతరం ప్రభాస్ నెమ్మదించగా ఫ్యాన్స్ ఒకింత నిరాశ వ్యక్తం చేశారు. దాంతో ప్రభాస్ తన తీరు మార్చుకున్నారు. గత రెండేళ్లలో ప్రభాస్ నటించిన ఆదిపురుష్, సలార్, కల్కి చిత్రాలు విడుదలయ్యాయి. ప్రస్తుతం ఆయన మారుతీ దర్శకత్వంలో రాజా సాబ్ చేస్తున్నారు. అనూహ్యంగా ఇది హారర్ కామెడీ డ్రామా అని సమాచారం.
ప్రభాస్ అభిమానుల్లో ఎంతో ఆసక్తి నెలకొన్న సినిమా మాత్రం హను రాఘవపూడి ప్రాజెక్ట్. సీతారామం మూవీతో బ్లాక్ బస్టర్ కొట్టిన హను రాఘవపూడికి టాలెంటెడ్ డైరెక్టర్ గా పేరుంది. సీతారామం మూవీ చూసిన ఆడియన్స్ ఫిదా అయ్యారు. ఆయన దర్శకత్వ ప్రతిభను కొనియాడారు. దాంతో ప్రభాస్ వంటి పాన్ ఇండియా స్టార్ ఆఫర్ ఇచ్చాడు. ఈ ప్రాజెక్ట్ టైటిల్ ఫౌజీ అని ప్రచారం జరుగుతుంది. టైటిల్ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.
ఇది రెండవ ప్రపంచ యుద్ధ కాలం నాటి వార్ అండ్ ఎమోషనల్ లవ్ డ్రామా అట. ప్రభాస్ క్యారెక్టరైజేషన్ చాలా కొత్తగా ఉంటుందని వినికిడి. ఇంతటి భారీ చిత్రంలో ఇమాన్వీ అనే సోషల్ మీడియా స్టార్ కి ఛాన్స్ ఇచ్చి, అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇమాన్వీ ప్రొఫెషనల్ డాన్సర్. ఆమెను ఈ సినిమా హీరోయిన్ గా ఎంచుకోవడానికి కారణం ఇదే నట. కాగా ఫౌజీ చిత్రంలో రజాకార్ నేపథ్యంతో కూడిన ఓ ఎపిసోడ్ ఉందట. భారీ యాక్షన్ అంశాలతో రజాకార్ ఎపిసోడ్ ఉంటుందట. అలాగే ఎమోషనల్ అంశాలకు కూడా పెద్ద పీట వేశారట.
ఇటీవల రజాకార్ టైటిల్ తో తెలుగు చిత్రం విడుదలైంది. ఇది రాజకీయ దుమారం రేపింది. మత విధ్వేషాలను రెచ్చగొట్టేలా రజాకార్ చిత్రం ఉందని ఓ వర్గం, రాజకీయ పార్టీలు వ్యతిరేకించాయి. ఇండిపెండెన్స్ అనంతరం స్వతంత్ర భారతంలో కలవని హైదరాబాద్ నవాబులు, రజాకార్ లతో హిందువుల మీద మారణకాండ సాగించారు అనేది రజాకార్ మూవీ సారాంశం. మరి ఈ వివాదాస్పద అంశం ప్రభాస్ మూవీలో పొందుపరిచారన్న న్యూస్ కాకరేపుతుంది. అలాగే ఈ చిత్రంలో ఓ పాత్ర కోసం హాలీవుడ్ నటుడిని ఎంచుకున్నారట. ఆ నటుడు ఆరు నెలలుగా ఈ పాత్ర కోసం సన్నద్ధం అవుతున్నాడని సమాచారం.