Pradeep Ranganathan Life: టాలెంట్, హార్డ్ వర్క్ ఉంటే చాలు, ఒక మనిషి ఎంత ఎత్తుకి అయినా ఎదుగుతాడు అనడానికి ఎంతో మంది ఉదాహరణగా నిలిచారు. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీ లో మనం ఇలాంటి వాళ్ళను చూస్తుంటాము. ప్రస్తుతం ఉన్నటువంటి పోటీ వాతావరణంలో బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ కి వచ్చి సక్సెస్ అవ్వడం చాలా కష్టం అని అందరూ అంటుంటారు. కానీ కొంతమంది ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ ఇమేజ్ లేకుండా ఒక సామాన్యుడిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి సక్సెస్ సాదించగలం అని గడిచిన నాలుగేళ్లలో ఎంతో మంది కుర్రాళ్ళు ఉదాహరణగా నిలిచారు. వారిలో ఒకరు ప్రదీప్ రంగనాథన్(Pradeep Ranganathan). ప్రస్తుతం యూత్ ఆడియన్స్ లో స్టార్ హీరోలకు మించిన క్రేజ్ ఇతనికి ఉంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటి వరకు మూడు సినిమాల్లో హీరో గా నటిస్తే, మూడు కూడా ఒకదానిని మించి ఒకటి హిట్ అయ్యాయి.
రీసెంట్ గా విడుదలైన ‘డ్యూడ్’ చిత్రం మొదటి వారం లోనే వంద కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించింది. ఎన్నో ఏళ్ళ నుండి ఇండస్ట్రీ లో ఉంటున్న కొంతమంది స్టార్ హీరోలకు కూడా సాధ్యం అవ్వని ఈ రికార్డుని ప్రదీప్ రంగనాథన్ క్రియేట్ చేసి చూపించాడు. ఇదంతా పక్కన పెడితే, అసలు ప్రదీప్ రంగనాథన్ బ్యాక్ గ్రౌండ్ ఏమిటి?, సినీ ఇండస్ట్రీ కి ఎలా వచ్చాడు?, మొదటి సినిమాకే జయం రవి లాంటి తమిళ టాప్ హీరో ఈయనకు దర్శకత్వం వహించే అవకాశం ఎలా ఇచ్చాడు వంటివి ఇప్పుడు మనం చూడబోతున్నాము. ప్రదీప్ రంగనాథన్ 1993 వ సంవత్సరం జులై 25 న చెన్నై లో జన్మించాడు. ఇంజనీరింగ్ పూర్తి చేసిన ఆయనకు, కాలేజీ రోజుల నుండే ఫిలిం మేకింగ్ మీద మక్కువ ఎక్కువ. సెమిస్టర్ హాలిడేస్ సమయం లో తన స్నేహితులతో కలిసి ఎన్నో షార్ట్ ఫిలిమ్స్ తెరకెక్కించాడు. అలా ఈయన తెరకెక్కించిన షార్ట్ ఫిలిమ్స్ లో ఒకటి హీరో జయం రవి కి బాగా నచ్చింది.
ఒక రోజు ఇంటికి పిలిచి నీ టాలెంట్ చాలా బాగా నచ్చింది, నీ దగ్గర ఏదైనా మంచి ఐడియా ఉంటే చెప్పు , నా సినిమాకు దర్శకత్వం వహించే ఛాన్స్ ఇస్తా అని చెప్పాడట. అలా ఛాన్స్ ఇవ్వగా 2019 వ సంవత్సరం లో జయం రవి ని హీరో గా పెట్టి ‘కోమలి’ అనే చిత్రానికి దర్శకత్వం వహించాడు. అప్పట్లో ఈ సినిమా కమర్షియల్ గా పెద్ద హిట్ అయ్యింది. ఇక తర్వాత ప్రదీప్ కరోనా లాక్ డౌన్ సమయం లో ‘లవ్ టుడే’ స్టోరీ రాసుకొని, తానే దర్శకత్వం వహిస్తూ, హీరో గా నటించాడు. ఈ సినిమా తమిళ, తెలుగు భాషల్లో విడుదలై పెద్ద హిట్ అయ్యింది. ఆ తర్వాత డ్రాగన్, డ్యూడ్ సినిమాల ఫలితాలు మన అందరికీ తెలిసిందే. నేడు ఈ స్థాయి ని ఎంజాయ్ చేస్తున్న హీరో ఒక సాధారణ జిరాక్స్ షాప్ ఓనర్ కొడుకు అనేది గుర్తుపెట్టుకోవాలి.