Bollywood: బాలీవుడ్ లో పనామా పేపర్ లీక్స్ కేసు హడలు పుట్టిస్తోంది. విదేశాల్లో అక్రమంగా పెట్టుబడులు పెడుతున్నారని ఈడీ విచారణలో తెలియడంతో బాలీవుడ్ ప్రముఖులను ఈడీ విచారిస్తుంది. ఇప్పటికే ఐశ్వర్యరాయ్ ఈడీ విచారణ ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. 2016లో పనామా నుంచి నడిచే ఓ లా కంపెనీకి చెందిన రూ. 11.5 కోట్లకు సంబంధించిన ట్యాక్స్ డాక్యుమెంట్ లీకు అయ్యాయి. వాటి గురుంచి మూడు గంటలు పలు రకాల ప్రశ్నలను ఐష్ ని అడిగారు అధికారులు. ఆమెనుంచి పలు ఆసక్తికరమైన సమాధానాలను అధికారులు రాబట్టినట్లు సమాచారం.

‘పనామా పత్రాలు’ పేరిట అప్పట్లో వెలుగులోకి రావడం సంచలనం రేపింది. పనామా దేశానికి చెందిన మొసాక్ ఫోన్సెకా అనే కార్పొరేట్ సంస్థ వేలాది సూట్‌కేసుల కంపెనీ బాగోతాలు బయటపెట్టింది. 2016 లో బయటపడ్డ పనామా పేపర్స్ లీకేజీతో పలువురు ప్రముఖులపై ఇప్పటికే కేసులు నమోదు అయ్యాయి. వివిధ దేశాల రాజకీయ నాయకులు, సినీ, క్రీడా రంగాల ప్రముఖులు, ఇతర సెలబ్రిటీల మనీ లాండరింగ్ వ్యవహారాలు పనామా పేపర్స్ లీక్ ద్వారా వెలుగులోకి వచ్చాయి. ఇక తాజాగా ఈ కేసులో మరో స్టార్ హీరోను కూడా ఈడీ విచారించనున్నదట. ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవ్ గన్ కూడా ఈ వ్యవహారాల్లో ఈడీ ఎదుట హాజరు కావచ్చని అంటున్నారు.

కాగా పనామా పేపర్ లీక్స్ అయిన సమయంలో అజయ్ తన వాదన వినిపించారు. తానూ ఏదైతే పెట్టుబడి పెట్టానో అవన్నీ నిజాయితీగా చేసినవేనని, వాటికి సరైన లెక్కలు ఉన్నాయని తెలిపారు. ఈ విషయమై అజయ్ దేవగన్ ని కూడా ఈడీ విచారించనుందని తెలుస్తోంది. మరో రెండు రోజుల్లో అజయ్ ని ఈడీ ప్రశ్నించనున్నారట. మరి అజయ్ ఎలాంటి సమాధానాలు ఇస్తాడో చూడాలి