‘నవనీత్ కౌర్’ మహారాష్ట్రలోని అమరావతి నియోజకవర్గం నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తోంది. అయితే ఆమె తాజాగా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని దర్శించుకున్న సందర్భంలో మీడియాతో మాట్లాడుతూ.. ‘నాకు తెలుగు వారి వల్లే పేరు వచ్చింది. ఎందుకంటే నా కెరీర్ మొదలైంది తెలుగు ఇండస్ట్రీలోనే. అప్పుడు నాకు తెలుగు పరిశ్రమ అవకాశాలు ఇవ్వడం వల్లే నేను ఈ రోజు ఇలా ఉన్నాను, అందుకే తెలుగు వారికీ సేవ చేస్తాను, తెలుగు వారి తరుపున నిలబడతాను’ అంటూ ఆమె చెప్పుకొచ్చింది.
‘నవనీత్ కౌర్’ చెప్పింది నిజమే. పదిహేను ఏళ్ల క్రితం ‘నవనీత్ కౌర్’ పలు తెలుగు సినిమాలలో నటించింది. అయితే ఆ తరువాత ఆమెకు అవకాశాలు తగ్గాయి. దాంతో కొన్ని ఐటమ్ సాంగ్స్ కోసం కూడా తెలుగు చిన్నాచితకా డైరెక్టర్ల చుట్టూ తిరిగి కొన్ని ఛాన్స్ లను సంపాదించుకుంది. ఈ క్రమంలో హాట్ అండ్ బోల్డ్ రోల్స్ లో రెచ్చిపోయింది.
కానీ, ఎక్కువ కాలం ఈ బ్యూటీ ఐటమ్ భామగా కూడా సక్సెస్ కాలేకపోయింది. దాంతో మొత్తానికి కొన్నేళ్లు గ్యాప్ తరువాత మహారాష్ట్రలోని అమరావతి నుంచి ఎంపీగా పోటీ చేసి గెలుపొందింది. ప్రస్తుతం ఆమె ఎంపీగా గెలిచినా బీజేపీకి మద్దతుదారుగా ఉంటున్నారు. దాంతో శివసేన పార్టీ నవనీత్ కౌర్ ను టార్గెట్ చేసింది.
ఆమె తప్పుడు కుల ధ్రువపత్రం సమర్పించి.. ఎంపీగా కొనసాగుతున్నారు అంటూ శివసేన నాయకుడు కోర్టులో కేసు వేసి, ఆమెను ఇరుకున పెట్టారు. ఆ కారణంగా ఆమె ఎంపీ పదవికే ఎసరు వచ్చింది. దీనికితోడు బాంబే హైకోర్టు కూడా ఆమె తప్పుడు కుల ధ్రువపత్రం సమర్పించింది అని తేల్చి చెప్పింది. ప్రజెంట్ నవనీత్ సుప్రీమ్ కోర్టుకు వెళ్లి ఎంపీగా కొనసాగుతున్నారు.