Chiranjeevi praises Sushmita: మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi), అనిల్ రావిపూడి(Anil Ravipudi) కాంబినేషన్ లో తెరకెక్కిన ‘మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad garu) బాక్స్ ఆఫీస్ వద్ద నాలుగు సినిమాలతో పోటీ పడి విజేతగా నిల్చింది. ఇప్పటికీ బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబడుతూ ముందుకు దూసుకెళ్తున్న ఈ సినిమాకు సంబంధించిన సక్సెస్ మీట్ ని నిన్న హైదరాబాద్ లోని పార్క్ హయాత్ లో ఈ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్ లో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. విజయోత్సాహం తో ఎంతో తృప్తి గా ఆయన ప్రతీ ఒక్కరి గురించి మాట్లాడాడు. ముఖ్యంగా ఈ సినిమాకు సహా నిర్మాతగా వ్యవహరించిన తన పెద్ద కుమార్తె సుష్మిత గురించి ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ఇలా ఆయన తన కూతురు గురించి గొప్ప గా మాట్లాడడం పబ్లిక్ ఫంక్షన్ లో ఇదే తొలిసారి.
ఆయన మాట్లాడుతూ ‘ఈ సినిమాకు నా కుమార్తె సుష్మిత సహా నిర్మాతగా వ్యవహరించింది. వాస్తవానికి ఆ అమ్మాయి వేరే నిర్మాతతో ఒక సినిమా కలిసి చేయాల్సి ఉంది. వాళ్ళు నువ్వు డబ్బులు ఏమి పెట్టక్కర్లేదు, కేవలం మీ పేరు పడితే చాలు, మీకు సినిమా పూర్తి అయ్యాక కొంత డబ్బులు ఇస్తామని చెప్పారు. కానీ మా అమ్మాయి ఒప్పుకోలేదు. నాకు నిర్మాతగా అనుభవం కావాలి. నా సొంత డబ్బులు పెట్టి సినిమా తీయాలి , లాభాలు వస్తే వచ్చింది, లేదంటే లేదు. లాభాలు వచ్చినప్పుడు ఆ డబ్బు స్వీకరించడానికి నాకు మనస్ఫూర్తిగా హక్కు ఉండాలంటే, నేను సినిమాని నిర్మించాలని అనుకుంది. అలాగే ఈ చిత్రాన్ని తన సొంత డబ్బులతో నిర్మించింది. సాహు గారితో కూర్చొని మాట్లాడి, నువ్వు ఎంత డబ్బు పెడితే నేను కూడా అంతే పెడతాను అని చెప్పింది. కొంత డబ్బు తన సొంతంగా తీసుకొచ్చి పెట్టింది, మరికొంత డబ్బు అప్పు చేసి తీసుకొచ్చి పెట్టింది’.
‘నేను ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. ఇంకా వాళ్ళిద్దరిని అప్పుడప్పుడు నేనే నా రెమ్యూనరేషన్ అడిగి తీసుకుంటూ ఉండేవాడిని. ఆ అమ్మాయికి మొదటి నుండి ఇలా కష్టపడే తత్త్వం ఉంది. సినీ ఇండస్ట్రీ లోకి రావాలని ఉందంటూ రామ్ చరణ్ తో చెప్పింది. వాడు హీరో గా నటించిన ‘రంగస్థలం’ మూవీ కి కాస్ట్యూమ్ డిజైనర్ గా పని చేస్తూ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టింది. ఆ సినిమాలో రామ్ చరణ్ ధరించే దుస్తుల కోసం రాజమండ్రి మొత్తం స్వయంగా ఆ అమ్మాయే ఎండల్లో తిరిగి తీసుకొచ్చింది. ఆ తపనే ఈరోజు ఆమె ఇలా సక్సెస్ ని ఎంజాయ్ చేసేలా చేసింది’ అంటూ చెప్పుకొచ్చాడు చిరంజీవి. దీనికి సంబంధించిన పూర్తి వీడియో ని క్రింద అందిస్తున్నాము చూడండి.