Big Movies Box Office Collections: సినిమా అంటేనే ఓ రంగుల ప్రపంచం. ప్రతి శుక్రవారం జూదమే. హిట్ టాక్ వస్తే నిర్మాత చొక్కా మెరిసిపోతుంది. మరో టాక్ వినబడితే నెత్తిన ఎర్ర తువాలు పడుతుంది. సినిమా అంటే బలమైన మాధ్యమం కాబట్టి ప్రేక్షకులకు ఒక ఉత్సుకత ఉంటుంది. ఇక మరి కొద్ది రోజుల్లో ఈ సంవత్సరం ముగియబోతోంది.. ఇలాంటి సందర్భంలో ఈ ఏడాది ఇప్పటి దాకా హిట్ అయిన సినిమాలకు రూపాయి పెట్టుబడి పెడితే ఎంత వచ్చింది? ఎంత పోయింది? దీని వెనుక ఉన్న అసలు లెక్క ఎంత? వాస్తవానికి సినిమా అంటేనే ఒక కళాత్మక వ్యాపారం. అంటే ఆ ప్రకారం చూసుకున్నా వ్యాపార పరిభాషలో లెక్కలు తీయాల్సిందే.. ముందుగానే చెప్పినట్టు సినిమా ప్రచారం కోసం చెప్పే దొంగ వసూళ్ళ లెక్కలు ఎలా ఉన్నప్పటికీ కొన్నాళ్లకు అసలు విషయాలు బయటపడాల్సిందే.

ఈ ఏడాది బాలీవుడ్ సినిమాలకు కలిసి రాలేదు.. సౌత్ సినిమాలు బాలీవుడ్ చిత్ర పరిశ్రమను దున్నేశాయి. సౌత్ సినిమాల హిందీ డబ్బింగ్ లు వందల కోట్లను కుమ్మేసుకోవడం బాలీవుడ్ పెద్దలకు అసహనాన్ని, అసంతృప్తిని, ఆగ్రహాన్ని, ఆందోళనను కలిగించింది. అహాన్ని దెబ్బతీసింది.. అయితే ఇదే సమయంలో ఇప్పుడిప్పుడే మెల్లిమెల్లిగా మళ్లీ హిందీ సినిమాలు తమ జనాన్ని థియేటర్లలోకి రప్పించుకుంటున్నాయి. ఇక ఈ సంవత్సరం టాప్ 10 సినిమాల వసూళ్లు పరిశీలిస్తే.. అసలు లాభ శాతం ఎంత? మునిగారా? ఉంటే తేలిపోయారా.. ఇందులో కేవలం థియేట్రికల్ కోణం మాత్రమే తీసుకుంటున్నాం. శాటిలైట్ హక్కులు, డిజిటల్ హక్కుల డబ్బుల లెక్క వేరు. ఈ ఏడాది టాప్ వన్ అంటే కేజిఎఫ్ 2.. 1,228 కోట్లు వసూలు చేసినట్టు ఫైనల్ లెక్క తేలింది. షేర్ 625 కోట్లు. పెట్టిన పెట్టుబడి 150 కోట్లు.. అంటే రూపాయికి నాలుగు రూపాయలు వచ్చినట్లు లెక్క. ఇప్పటివరకు ఇదే సూపర్ హిట్.
సెకండ్ ప్లేస్ లో ఆర్ఆర్ఆర్ ఉంది. ప్రపంచవ్యాప్తంగా 1,131 కోట్లు వచ్చాయి అంటున్నారు. అందులో షేర్ 611 కోట్లు. పెట్టిన పెట్టుబడి 425 కోట్లు అంటున్నారు. ఇది కూడా పక్కా మేనిప్యులేటెడ్ ఫిగర్ అనే విమర్శ కూడా ఉంది. ఇదంతా పక్కన పెడితే రూపాయి పెట్టుబడికి రూపాయిన్నర మాత్రమే వచ్చింది. అంటే రూపాయికి 50 పైసలు మాత్రమే లాభం. అసలు ఆర్ఆర్ఆర్ లెక్కల్లోనే గందరగోళం ఉంది. పైగా ఇందుకు సంబంధించిన వివరాలు కూడా అంతు పట్టకుండా ఉన్నాయి.
ఇక పొన్నియన్ సెల్వన్ 500 కోట్లు వసూలు చేసింది.. షేర్ 242 కోట్లు. పెట్టిన ఖర్చు 210 కోట్లు. అంటే పెద్దగా లాభం రాలేదు. పెట్టుబడి వచ్చింది. కన్నడ, తెలుగు, హిందీ ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోలేదు.
విక్రమ్ సినిమా షేర్ 215 కోట్లు. ఈ సినిమా నిర్మాణ వ్యయం 115 కోట్లు.. ఫిల్మ్ సర్కిల్లో ఇన్ఫ్లేటెడ్ ఫిగర్ అని అంటారు. ఆ లెక్కన లాభ శాతంలో రూపాయికి మరో రూపాయి వచ్చినట్టు లెక్క.. ఈ సినిమా ఈ స్థాయిలో హిట్ అవుతుందని కమల్ హాసన్ కూడా ఊహించలేదు. లాభాలు రావడం, ఆ లాభాలతో తన అప్పులు తీర్చడంతో కమల్ ఆ ఆనందాన్ని దర్శకుడు లోకేష్ కనగరాజ్ కు ఒక కారు రూపంలో బహుమతిగా ఇచ్చాడు.. ఇక బ్రహ్మాస్త్ర గురించి చెప్పాలి.. బాలీవుడ్ తన ప్రైడ్ సినిమాగా దీనిని ప్రకటించుకుంది. కానీ దీని మీద తప్పుడు లెక్కలు ఉన్నాయని ఇప్పటికీ ఒక ఆరోపణ ఉంది. ఈ సినిమాకి 315 కోట్లు ఖర్చుపెట్టారు. వచ్చిన నెట్ షేర్ 181 కోట్లు. రూపాయికి 40 పైసలు లాస్. మరి ఇతరత్రా రెవెన్యూ ఎంత వచ్చిందో తెలియదు. వస్తే గిస్తే అదే ఆదుకోవాల్సి ఉంటుంది.

ఇక కే జి ఎఫ్ 2 తీసిన నిర్మాతలు… కాంతారా అనే సినిమా కూడా నిర్మించారు.. దీనికి అయిన ఖర్చు పదిహేను కోట్లు. ఇప్పటికీ ఇంకా ఆడుతూనే ఉంది. వచ్చిన నెట్ షేర్ 179 కోట్లు.. అంటే రూపాయి పెట్టుబడికి 11 రూపాయల లాభం వచ్చినట్టు. తెలుగు, హిందీ డబ్బింగ్ హక్కులు కొన్న వారికి డబ్బే డబ్బు. తెలుగులో రెండు కోట్లకు కొంటే 50 కోట్లు వచ్చాయి. పెట్టుబడి, లాభం ఈ కోణాల్లో కాంతారా రికార్డు ఇప్పట్లో ఎవరూ బ్రేక్ చేసే అవకాశం కనిపించడం లేదు. ఇక ఇదే రీతిలో విజయాన్ని, డబ్బుల్ని సొంతం చేసుకున్న సినిమా ది కాశ్మీర్ ఫైల్స్. పెట్టింది 20 కోట్లు అయితే… వచ్చిన నెట్ షేర్ 150 కోట్లు. అంటే రూపాయికి 6 రూపాయల లాభం. ఏ రకంగా చూసుకున్నా అనూహ్యమైన విజయం. భూల్ భులయ్యా_2 కు 75 కోట్లు పెట్టుబడి పెడితే.. వచ్చిన నెట్ షేర్ 115 కోట్లు. హిందీ సినిమాల గడ్డు రోజుల్లో ఈ మాత్రం లాభం వచ్చిందంటే గ్రేటే. ఇక బీస్ట్ సినిమాకు పెట్టిన ఖర్చు 130 కోట్లు. వచ్చిన నెట్ షేర్ 116 కోట్లు. అంటే అసలుకే బొక్క పడ్డది. విజయ్ కెరియర్ లో ఒక ప్లాప్. ఈ సినిమాను జాకీలు పెట్టి లేపేందుకు ఎంత ప్రయత్నించినా ఫాయిదా దక్కలేదు. ఇప్పుడు వచ్చే వారసుడు అయినా విజయ్ కి హిట్ ఇస్తాడో చూడాలి. ఇక గంగూ భాయి అనే సినిమాకి 125 కోట్లు ఖర్చు పెట్టారు.. లెక్కల పై ఇప్పటికీ ఒక డౌటే. వచ్చిన నెట్ షేర్ 90 కోట్లు. అంటే రూపాయికి పావలా లాస్. ఇతరత్రా ఆదాయం వస్తుంది కాబట్టి సినిమాలు గట్టెక్కుతున్నాయి..లేకపోతే నిర్మాతల నెత్తిలో ఎర్ర తువాళ పడటం ఖాయం. సినిమా అంటేనే పెట్టుబడి, లాభం కాబట్టి…ఈ ఏడు నిర్మాతలకు భారీగా లాభాలు మిగిల్చిన సినిమాలు కాంతారా.. కాశ్మీర్ ఫైల్స్.. మరో నెలలో ఏడాది ముగుస్తుంది. కానీ విడుదలయ్యే సినిమాలు ప్రేక్షకులను థియేటర్ల గుమ్మం తొక్కేలా చేయాలి.. కానీ ఇప్పుడు వచ్చే వాటిలో ఆ సత్తా ఉన్నట్టు కనిపించడం లేదు. ఇప్పటికైతే ఇంతే. ఈ ఏడాదికి కూడా ఇంతే.