NTR-ANR: తెలుగు సినీ చరిత్రలోకి వెళ్తే.. ‘పాతాళభైరవి’ చిత్రం రిలీజ్ అయిన రోజులు అవి. సినిమా అద్భుతం అన్నారు. తెలుగు తెర పై శాశ్వతంగా నిలిచిపోతుంది అన్నారు. ఇక ఇలాంటి మరో సినిమా మళ్లీ రాదు అన్నారు. కానీ, ‘మిస్సమ్మ’ అనే చిత్రం వచ్చింది. ‘పాతాళభైరవి’ కంటే ఎక్కువ కలెక్షన్స్ ను రాబట్టి.. టాలీవుడ్ కి ఓ మైలురాయిగా నిలిచిపోయింది. ఐతే, ‘మిస్సమ్మ’ చిత్రం విషయంలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు ఈ చిత్ర రచయిత చక్రపాణి. అవి 1955 కాలం నాటి రోజులు. నాగిరెడ్డి, చక్రపాణి అంటే.. తెలుగు సినిమాని శాసిస్తున్న దిగ్గజాలుగా పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి.
కానీ చక్రపాణిలో నిర్మాత కంటే కూడా మంచి రచయిత ఉన్నాడు. అందుకే, చక్రపాణి ఒక కథ రాస్తే.. ఇక ఆ కథతోనే సినిమా తీసేవారు. ‘మిస్సమ్మ’ విషయంలోనూ ఇదే జరిగింది. కానీ ఈ కథ పై అప్పటి సినీ ప్రముఖులు అనేక విమర్శలు చేశారు. ‘చక్రపాణి గారి బుద్ది ఏమైంది ? ఇలాంటి దిగజారుడు కథ ఎలా రాశారు ?. ఎన్టీఆర్ ఏఎన్నార్ ఎలా ఒప్పుకున్నారు ?. నిజమే.. యాభై యేళ్ళ కిందట, ఒక పెళ్లి కాని అమ్మాయి, తనకు సరిగ్గా పరిచయం కూడా లేని అబ్బాయిని నమ్మి అతనికి భార్యగా నెలల తరబడి ఉండడానికి ఎలా ఒప్పుకుంటుంది ? పైగా అతనితో వేరే ఊరు వెళ్తుంది. ఈ కథాంశాన్ని ఇప్పుడు చెప్పిన నమ్మశక్యంగా ఉండదు.
పైగా అప్పట్లో ఇలాంటి ఆలోచనలను అసలు సహించేవారు కాదు. కానీ, నమ్మశక్యం కానీ ఈ పాయింట్ తోనే కథ రాసి, పైగా సినిమాని కూడా నిర్మించి గొప్ప విజయాన్ని సాధించారు చక్రపాణి. అయితే, ఈ చిత్రం ఎంత గొప్ప విజయాన్ని సాధించినా.. ఆయన మాత్రం ఎప్పుడు ఈ చిత్రం ప్రస్తావన వచ్చినా బాధ పడేవారు.
Also Read: Vijayanagaram District: ఆ జిల్లాలో అధికార పార్టీకి షాకిస్తున్న నేతలు.. ఎందుకలా?
కారణం, తన ప్రాణ స్నేహితుడు నాగిరెడ్డి కూడా, తనను ఈ చిత్రం విషయంలో సరిగ్గా అర్ధం చేసుకోలేదని, మొదట్లో అందరిలాగే నాగిరెడ్డి కూడా తనను విమర్శించాడని చక్రపాణి గారు బాధ పడుతూ ఉండేవారు. చక్రపాణి – నాగిరెడ్డి స్నేహం అంత గొప్పగా ఉండేది. వారి స్నేహం చూసి చాలామంది కుళ్లుకునే వారు. ఇద్దరిని విడదీయడానికి అప్పటి నిర్మాతలు, హీరోలు ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేశారు.
‘ఆ చక్రపాణితో సినిమా వ్యాపారం మానుకో, లేకపోతే మీకే ఎక్కువ నష్టం’ అంటూ నాగిరెడ్డితో తరుచూ చాలామంది అంటుండేవారు. అయితే, తమ మధ్య ఎంతమంది ఎన్ని గొడవలు పెట్టే ప్రయత్నం చేసినా చక్రపాణి – నాగిరెడ్డి చివరి వరకు కలిసే ఉన్నారు. పైగా వాళ్ళు ఎన్నో చూశారు, తమ చేతుల్లోనే తెలుగు సినిమా వర్ధిల్లుతున్న రోజులను చూశారు, జీరోలను హీరోలుగా మార్చిన అనుభవాలను చూశారు. నిజమైన మల్టీస్టారర్ సినిమాలకు ప్రాణం పోసిన సృష్టికర్తలుగా పేరు గడించారు. విషాదం ఏమిటంటే.. చివరి రోజుల్లో తక్కువ స్థాయి వ్యక్తిల నుంచి అవమానాలను కూడా ఎదుర్కొన్నారు. కానీ.. వారు సృష్టించిన చిత్రాలు క్లాసిక్స్ గా మిగిలిపోయాయి.