Tollywood: అనుకున్నదే అయ్యింది.. టాలీవుడ్ ను నియంత్రించాలనుకున్న జగన్ సర్కార్ కు కోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ పరిణామం టాలీవుడ్ కు గొప్ప ఊరటనిచ్చింది. ‘ఆర్ఆర్ఆర్’, ‘పుష్ప’ లాంటి బడా సినిమాలు రిలీజ్ అవుతున్న వేళ రూ.100కే సినిమా టిక్కెట్, ఆన్ లైన్ టిక్కెట్ల విక్రయాల విషయంలో ఏపీ సర్కార్ నిర్ణయాలు చెల్లవని కోర్టు తీర్పునిచ్చింది. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హైకోర్టులో మరో ఎదురు దెబ్బ తగిలింది. ఏపీలో సినిమా టికెట్ల రేట్లు తగ్గిస్తూ, ఆన్ లైన్ టికెటింగ్ చేస్తూ ప్రభుత్వం సినిమాటోగ్రఫీ చట్టంలో సంస్కరణలు తీసుకొచ్చిన విషయం తెలిసిందే. కాగా ఇప్పుడు ఈ జీవోను హైకోర్టు సస్పెండ్ చేస్తూ… పాత విధానంలోనే టికెట్ల రేట్లు నిర్ణయించేందుకు వెసులుబాటు కల్పించింది. సినిమా టికెట్ల ధరలు తగ్గించే అధికారం ప్రభుత్వానికి లేదంటూ థియేటర్ల యాజమాన్యాల తరపు న్యాయవాదుల వాదనలు వినిపించారు. సినిమా విడుదల సమయంలో టికెట్ల రేట్లు పెంచుకునే హక్కు థియేటర్ల యాజమాన్యాలకు ఉంటుందని వాదనలో తెలిపారు. టికెట్ల ధరలను తగ్గించే అధికారం ప్రభుత్వానికి లేదని పిటిషనర్ తరపు వాదనలతో హైకోర్టు ఏకీభవించింది.

టికెట్ల రేట్లు తగ్గిస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీవో నెం.35ను రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం సస్పెండ్ చేసింది. కోర్టు ఆదేశాలకు విరుద్ధంగా ప్రభుత్వం జీవో జారీ చేసిందని.. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైనది కాదని.. కొత్త సినిమాలు విడుదలయ్యే సమయంలో టికెట్స్ రేట్స్ పెంచుకునే అవకాశం థియేటర్ యజమానులకు ఉంటుందని పిటిషన్లు పేర్కోన్నారు. ఈ మేరకు నేడు విచారణ జరగగా.. థియేటర్ల యాజామాన్యాల తరపున సీనియర్ లాయర్లు ఆదినారాయణ రావు, దుర్గప్రసాద్ వాదనలు వినిపించారు. టికెట్ల ధరలను తగ్గించే అధికారం ప్రభుత్వానికి లేదని తెలిపారు.
పిటిషనర్ల తరపు న్యాయవాదుల వాదనతో ఏకీభవించిన హైకోర్టు ప్రభుత్వం జారీ చేసిన జీవో ను సస్పెండ్ చేస్తున్నట్టు ఆదేశాలు జారీ చేసింది. మరి ఏపీ ప్రభుత్వం ఈ తీర్పుపై ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.