RockStar Actresses: ఒకప్పుడు వెండితెరను ఏలిన తారలు వాళ్ళు. అగ్ర హీరోలతో సమానంగా రెమ్యూనరేషన్ అందుకున్న నిజమైన కథానాయికలు వాళ్ళు. తెలుగు సినీ చరిత్రలోనే తమ ప్రస్థానంతో తమకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న అపురూప తారామణులు వాళ్ళు. ఐతే, మానవత్వం మనిషి లక్షణం. కానీ ఆ మానవత్వం మితిమీరితే.. ? ఆ మనిషే రోడ్డున పడాల్సి వస్తోంది. అచ్చం ఈ అందాల అగ్రతారలు కూడా విలాసవంతమైన జీవితం నుంచి దానధర్మాల తో పాటు అనేక సేవ కార్యక్రమాలు చేసి చివరకు ఏమీ లేని స్థితికి వచ్చారు. మరి ఈ లిస్ట్ లో ఎవరెవరు ఉన్నారో తెలుసుకుందాం రండి.
ముందుగా ‘మహానటి సావిత్రి’ :
చిన్నతనంలోనే మహానటిగా ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించి మెప్పించింది. అగ్రతారగా తెలుగు తెర పై వెలుగొందిన అందాల అభినేత్రి సావిత్రి. వీటన్నిటికీ మించి అడిగినవారికి, అడగని వారికీ కూడా లేదనకుండా కాదనకుండా దానం చేసిన దానకర్ణ. మరోపక్క.. విలాసవంతమైన జీవితం. నిజానికి సావిత్రి తన చిన్నతనంలో ఎడ్ల బండి కూడా ఎక్కలేని పరిస్థితులను అనుభవించింది. కానీ, ఆ తర్వాత పదేళ్లలోనే కార్ రేసింగ్ లో పాల్గొనే స్థాయికి వెళ్లింది. ఇదంతా జీవితానికి ఒకవైపు మాత్రమే. రెండో వైపు సావిత్రి జీవితం అర్థంలేని ప్రశ్నల వేదిక. రెండు పెళ్లిైళ్లె పిల్లలున్నవాడిని ఏరికోరి పెళ్లి చేసుకుంది. పిల్లలు పుట్టాక భర్తకు దూరమైంది. మద్యానికి బానిస అయ్యింది. బంధువులు మోసం చేశారు. బతుకు భారం అయ్యింది. చిన్నవయసులోనే వెండితెర నుంచి నిష్క్రమించి.. అభిమానులకు నేటికీ కన్నీళ్లనే మిగిల్చింది.
భానుమతీ :
దేశంలో ఏ నటీ అనుభవించనంత గొప్ప గౌరవాన్ని పొందిన గొప్ప నటి ‘భానుమతీ రామకృష్ణ’. ఆ రోజుల్లో భానుమతీ గారి కారు హారన్ విని మద్రాస్ రోడ్లమీద జనం వాళ్ళంతట వాళ్ళు పక్కకి తొలిగి దారిచ్చేవారు. సాంప్రదాయిక పాత్రలు చేస్తూ, నిజజీవితంలో కూడా సాంప్రదాయికంగానే ఉన్న భానుమతీ సాధించిన ఆర్థిక విజయాలు నేటికీ ఆదర్శమే. ఎన్టీఆర్, ఏఎన్నార్ ల కంటే ఎక్కువ పారితోషికం తీసుకున్న ఏకైక నటి కూడా ఒక్క ‘భానుమతీ గారు’ మాత్రమే. అప్పట్లో భానుమతీ గారికి మద్రాసులో కోట్లాది విలువ చేసే నాలుగు బంగళాలు, కొడైకెనాల్‌లో ఒక గెస్ట్ హౌస్, విజయవాడలో రెండు బంగళాలు, హైదరాబాద్‌లో ఒక బంగళా, అలాగే ఒక సినీ స్టూడియో, వ్యవసాయిక ఎస్టేటు ఇలా ఎన్నో ఆస్తులు ఉండేవి. డబ్బు పట్ల భానుమతీ గారు ఎంతో జాగ్రత్తగా ఉన్నా.. అయినవాళ్లకు, నమ్ముకున్న వాళ్లకు ఆమె కొన్ని ఆస్తులను అప్పగించారు. అవి చివరకు వాళ్ళ సొంతం అయిపోయాయి. భానుమతీ గారు కూడా బంధువుల చేతిలో మోస పోయారు. విలాసవంతమైన జీవితం ఆమె ఎన్నడూ అనుభవించకపోయినా.. ఆమె పేరు చెప్పుకుని ఆమె చుట్టూ ఉన్నవాళ్లు, బంధువులు ఎంతో విలాసంగా బతికారు. అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు.. భానుమతీ గారి ఆస్తిని మరెవరో అనుభవించారు.
అలనాటి నటి కాంచన :
తెలుగు ప్రేక్షకులను తన అందచందాలతో అలరించిన మరో హీరోయిన్ కాంచన. ఆమె దాతృత్వానికి అద్దం పట్టే ఘటనలు ఎన్నో ఉన్నాయి. ఎప్పుడూ చిరునవ్వుతో మొహం కళకళలాడుతుండగా, వంటినిండా నగలతో ధగధగలాడుతూ కనిపించే వారు కాంచన. ఆమె ఏకంగా దేవుడికే దానం చేసింది. చెన్నైలో పద్మావతి అమ్మవారి ఆలయం ఉన్న స్థలం ఆమె దానం చేసిందే. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానానికి కాంచన తన ఆస్తిని మొత్తాన్ని విరాళంగా ఇచ్చారు.
పసుపులేటి కన్నాంబ :
ఒక కంట సెంటిమెంట్ తో ప్రేక్షకుల చేత కంట కన్నీరు పెట్టించడం, మరో కంట కోపాన్ని ప్రదర్శించి చండ్రనిప్పులు కురిపించి ఔరా అనిపించడం యావత్ భారత్ దేశ చలనచిత్ర చరిత్రలో ఒక్క ‘కన్నాంబ’కు మాత్రమే సాధ్యం. ఆమె గురించి ఒక్క మాటలో చెప్పాలంటే.. మన తొలితరం వెండితెర కథానాయక. కన్నాంబకి నటన ఏమి పుట్టుకతో రాలేదు. ఆకలి అరుపుల నుంచి ఆ నటనా చాతుర్యం పుట్టింది. చిన్న వయసులోనే పొట్టకూటి కోసం నాటకాల్లో నటించింది. ఆ తర్వాత సినిమాల్లో రాణించింది. నిర్మాతగా మారి ఆ రోజుల్లో ఎందరికో అన్నం పెట్టింది. ఎన్నో గుప్తదానాలు చేసింది. ముఖ్యంగా కష్టాల్లో కళాకారులకు, సాంకేతిక సిబ్బందికి కన్నాంబ గారు డబ్బులు పంచి పెట్టేవారు. కన్నాంబ దాతృత్వం అంత గొప్పది. అభాగ్యులను ఆదరించడంలో ఆమె మహా సాధ్వీమణి. అందుకే.. చివరి రోజుల్లో కన్నాంబ గారి ఆర్థిక ఇబ్బందులతో చాలా ఇబ్బందులు పడ్డారు.
సీనియర్ నటి శ్రీవిద్య :
శ్రీవిద్య అంటే ఇప్పటి తరానికి తెలియకపోవచ్చు. కానీ, ఆమె రూపం పద్దతికి ప్రతిరూపం, ఆమె అందం ఆరాధించే అపురూపం. నిజానికి ఆమె పెద్ద హీరోయిన్ కాదు. కానీ, ఎందుకో తెలియదు, ఆమె కనబడగానే ప్రేక్షకుడి చూపు ఆమె వైపే వెళ్ళేది. కానీ, శ్రీవిద్యది విలాసవంతమైన జీవితమే. ఆమె కూడా మద్యానికి బానిస అయ్యింది. కమల్ హాసన్ తో సహా మరో నలుగురితో ప్రేమ బంధాలను నడిపింది. అంతలో ఆమెకు క్యాన్సర్ సోకింది. కానీ ఆమె భయపడలేదు. తన మొత్తం ఆస్తిని సేవా కార్యక్రమాలకు ఇచ్చేసి గొప్ప మనసు ఉన్న మనిషిలా నిలిచిపోయింది. కేరళలోని పలు అనాధ ఆశ్రమాలకు ఆమె ఇచ్చిన విరాళాలు కారణంగా కొని వందల మంది ఉన్నత చదువులు చదివి ఉన్నత స్థానాలకు ఎదిగారు. అందుకే.. శ్రీవిద్య గొప్ప విద్యా దేవత.
తొలితరం మరో కథానాయిక శాంతకుమారి :
తెలుగు తెర పై నిండు గోదారి లాంటి సహజ నటి శాంతకుమారి. అన్నిటికీ మించి ఆమె మధురమైన గాయని కూడా. శాంతకుమారి అసలు పేరు వెల్లాల సుబ్బమ్మ. పి.వి.దాస్ నిర్మించిన “మాయాబజార్” చిత్రంలో శశిరేఖగా చిత్రసీమలో ప్రవేశించారు. దర్శకుడు పి.పుల్లయ్యను వివాహమాడారు. భర్త చనిపోయాక శాంతకుమారి గారు కూడా విలాసవంతమైన జీవితానికి అలవాటు పడ్డారు. ఈ క్రమంలో మేనేజర్లు ఆమెను ఆర్థికంగా మోసం చేశారు. అలాగే గొప్ప కోసం ఆ రోజుల్లో ఆమె పెళ్లిళ్లు జరిపించేవారు. అలాగే దానాలు చేసేవారు. దాంతో శాంతకుమారి గారు కూడా చివరి రోజుల్లో ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడ్డారు.
రాధికా శరత్‌కుమార్ :
రాధికా శరత్‌కుమార్ నటిగా హిట్, బిజినెస్ విమెన్ గా హిట్, టీవీ నటిగా నిర్మాతగా సూపర్ హిట్.. ఇన్ని హిట్స్ మధ్యలో ఆమె కూడా కొన్ని పొరపాట్లు చేసింది. ఆమెకు కూడా మద్యం అలవాటు ఉంది. దాంతో నిర్మాణ బాధ్యతలను కూడా వేరేవారికి అప్పగించింది. దాంతో అపజయాలు వచ్చాయి. ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఆమెను చుట్టుముట్టాయి. ఆ మధ్య చెన్ బౌన్స్ కేసులో రాధికా శరత్‌కుమార్ దంపతులకు ఏడాది శిక్ష పడటం కూడా అందర్నీ షాక్ కి గురి చేసింది. ఎలాగోలా ఆ కేసు నుంచి బయట పడ్డారు. ప్రస్తుతం విలాసాలకు దూరం జరిగి.. మళ్ళీ ఇండస్ట్రీలో నిలబడటానికి వరుస సినిమాలను నిర్మిస్తున్నారు. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి కూడా ఆమెకు ఒక సినిమా చేస్తాను అని మాట ఇచ్చారు.
సహజనటి జయసుధ :
తెలుగు సినీ పరిశ్రమలో హీరోయిన్ గా, అలాగే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా ఒక వెలుగు వెలిగింది. మరి ఆ వెలుగుల వెల్లువ ఎటు పోయిందో ? తీసుకున్న భారీ రెమ్యునరేషన్స్ ఏమైపోయాయో ?. ఎంతో సుదీర్ఘమైన కెరీర్.. అలాంటి సహజనటికి సహజంగా ఆర్ధిక ఇబ్బందులు ఉండకూడదు. కానీ ఈ సహజనటి పరిస్థితి మరోలా ఉంది. వందల సినిమాలు చేసినా.. ఆమె ఆర్ధిక పరిస్థితి మాత్రం ఎప్పటికప్పుడు ఇబ్బందిగానే సాగుతూ వచ్చింది. ఆమె నిర్మాణం చేపట్టడం ఆమెకు శాపం అయ్యింది. ఆమెకు సినిమాల నిర్మాణం అసలు కలిసి రాలేదు. ఓ దశలో మొత్తం ఆస్తి పోయింది. మొత్తానికి ఆమెకు ప్రస్తుతం ఆర్ధిక ఇబ్బందులు ఎక్కువైపోయాయి. క్రైస్తవ ప్రచారానికి కూడా ఆమె ఎంతో ఖర్చు పెట్టింది.
సిల్క్ స్మిత :
విలాసవంతమైన జీవితానికి పర్యాయపదం అన్నట్టు సాగింది సిల్క్ స్మిత జీవితం. ఐతే, స్మిత చాలా ఆస్తులు సంపాదించింది. కానీ అవన్నీ పోగొట్టుకుంది. కానీ ఈ మధ్యలో ఆమె ఎందరికో సాయం చేసింది. చాలా మందికి తెలియదు. ఎన్నో అనాధ స్కూల్స్ కు స్మిత విరాళాలు ఇచ్చేది. ఆమెకు చిన్న పిల్లలు అంటే ఇష్టం. అందుకే.. పిల్లలకు సంబంధించి ఆమె ఎప్పుడు ఏదోకటి చేయాలని తపన పడుతుండేది. కానీ, ఆర్థిక క్రమశిక్షణ లేకపోవడంతో చివరకు ఆత్మహత్య చేసుకుని ఈ లోకాన్ని విడిచింది. ఇలా ఎందరో తారామణులు ఓ వెలుగు వెలిగి చివరి రోజుల్లో చీకట్లో కలిసిపోయారు.
Also Read: Mahesh Babu Sarkaru Vaari Paata: ‘సర్కారు’ పై మహేష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్