
సినిమాల్లో ప్లాప్ అయితే ఒకప్పుడు ఇక కెరీర్ పోయినట్టే.. వాళ్ళ లైఫ్ క్లోజ్ అయినట్టే అని భావించేవాళ్లు. అయితే మారిన కాలంలో పెరిగిన సాంకేతిక విప్లవంలో సినిమాల్లో ప్లాప్ అయిన వారికీ, ఓటిటీల రూపంలో ఒక సువర్ణావకాశం వచ్చింది. అయితే, ఇన్నాళ్లు బుల్లితెరను ఎలాగయితే సినిమా వాళ్లు చిన్న చూపు చూశారో.. ఇప్పుడు ఓటిటిని అలాగే చూస్తూ అశ్రద్ధ చేస్తున్నారు.
నిజానికి మనవాళ్లకు ఓటీటీల పై ఇంకా సరైన అవగాహన రాలేదు. లేకపోతే ఏకంగా హాలీవుడ్ లోనే ఓటీటీల కోసం అక్కడి బడా స్టార్లు సినిమాలు చేసే సంస్కృతీ ఉంది. దాన్నే మన వాళ్ళు ఎందుకు ఫాలో అవ్వట్లేదు. ఏ.. హాలీవుడ్ సినిమాలను కాఫీ కొడతారు గానీ, ఓటీటీల కోసం హాలీవుడ్ తరహా అవుట్ లుక్ ను ఇక్కడ ఫాలో అయితే తప్పు ఏమిటి ? ప్రస్తుత కరోనా సెకెండ్ వేవ్ కారణంగా ఎలాగూ థియేటర్లు మూత పడ్డాయి.
సినిమా జనం ఎలాగూ ఖాళీగానే ఉన్నారు. కనీసం ఈ ఖాళీ సమయాన్ని అయినా అందరూ ఓటీటీల కోసం ఉపయోగించుకోవచ్చు. నెల మీద కూరుకుపోయి ఆకాశంలోకి చూస్తే ఉపయోగం ఏమి ఉండదు, మరోపక్క కొంతమంది డైరెక్టర్లు, అలాగే కొంతమంది హీరోలూ తమ సినిమాలకు ఎట్టిపరిస్థితుల్లో థియేట్రికల్ రిలీజ్ కావాల్సిందే అంటూ నిర్మాతల పై ఒత్తిడి పెంచుతున్నారని తెలుస్తోంది.
ఈ సమ్మర్ లో రిలీజ్ కావాల్సిన సినిమాలకు ఓటీటీల నుండి మంచి ఆఫర్స్ వస్తున్నాయి. ఒకపక్క నిర్మాతలకు సినిమాని ఇచ్చేద్దాం అని అనిపిస్తోన్నా.. వాళ్ళు హీరోల ఇగోల గురించి, దర్శకుల మూర్కత్వపు పట్టుదల గురించి గుర్తొచ్చి మళ్ళీ ఆగిపోతున్నారు. అయినా ఓటిటి రిలీజ్ కి కూడా మంచి డబ్బు వస్తోన్నపుడూ థియేటర్లు తెరుచుకునే వరకు ఎందుకు వేచి ఉండాలి. ఓటిటి అనేది సినిమా థియేటర్లకు ప్రత్యామ్నాయమని దర్శకులు హీరోలు గ్రహిస్తే సినిమా ఇండస్ట్రీకే మంచింది.