Hero Vijay: ఎన్నికలకు ముందు పౌరసత్వ సవరణ చట్టాన్ని కేంద్రం తెరపైకి తేవడంతో ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అందులోకి తమిళగ వెట్రి కజగం(TVK) కూడా చేరింది. ఈ పార్టీని ఇటీవల తలపతి విజయ్ ఏర్పాటు చేశారు.. ప్రస్తుతం విజయ్ GOAT అనే సినిమాలో నటిస్తున్నారు. అది పూర్తికాగానే సినిమాలకు విరామం ప్రకటించి పూర్తిస్థాయిలో రాజకీయాల్లోకి వస్తారు. ఈ క్రమంలో కేంద్రం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం పై విజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు.. ఇప్పటికిప్పుడు ఈ చట్టాన్ని అమలులోకి తేవాల్సిన అవసరం ఏంటని ఆయన ప్రశ్నించారు. ” దేశంలోని ప్రజలు సామాజిక సామరస్యంతో జీవిస్తున్నారు. అలాంటి గొప్ప వాతావరణాన్ని నాశనం చేసేలా సి ఏ ఏ చట్టం ఉంది. దాన్ని అమలు చేయడం సరికాదు. ఇలాంటి చట్టాన్ని తమిళనాడు రాష్ట్రం ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోవద్దు. దీన్ని ముఖ్యమంత్రి స్టాలిన్ అమలు చేయవద్దు. తమిళనాడు రాష్ట్రంలో ఇలాంటి చట్టాలను ఇక ముందు కూడా అమలు చేయబోమని ప్రతిజ్ఞను నాయకులు చేయాలి. ఆ దిశగా ప్రజల్లో విశ్వాసం కల్పించాలని” విజయ్ కోరారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు.
పౌరసత్వ సవరణ చట్టాన్ని నాలుగు సంవత్సరాల క్రితం కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అమల్లోకి తీసుకువచ్చింది. అప్పట్లో ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నప్పటికీ పార్లమెంట్లో ఈ బిల్లుకు ఆమోదం లభించింది. రాష్ట్రపతి కూడా ఈ బిల్లుకు ఓకే చెప్పారు. అయితే దీనికి సంబంధించిన పూర్తి విధి విధానాలను అప్పట్లో కేంద్రం రూపొందించలేదు. సరిగ్గా నాలుగు సంవత్సరాల తర్వాత మళ్లీ ఈ చట్టాన్ని అమలు చేస్తామని కేంద్రం ప్రకటించింది. సోమవారం ప్రకటన విడుదల చేసింది. దీనికి సంబంధించి ఆన్ లైన్ పోర్టల్ కూడా ప్రారంభించింది. ఈ వెబ్ సైట్ లో అర్హులైన వారు భారతీయ పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. దీనిపై ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజల్లో భావోద్వేగాలు రెచ్చగొట్టేందుకే కేంద్రం ఇలాంటి పనులు చేస్తుందని ఆరోపిస్తున్నాయి. ఎవరు ఎన్ని రకాలుగా విమర్శలు చేసినప్పటికీ సీఏఏ పై వెనకడుగు వేసేది లేదని కేంద్రం స్పష్టం చేస్తోంది.
సీఏఏ అమలు వల్ల పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వలస వచ్చిన ముస్లిమేతర శరణార్థులకు భారతీయ పౌరసత్వం లభిస్తుందని ప్రభుత్వం చెబుతోంది. ఎటువంటి ధ్రువపత్రాలు లేకపోయినప్పటికీ భారతదేశం వారికి సిటిజెన్షిప్ ఇస్తుందని అంటున్నది. 2014 డిసెంబర్ 31 కంటే ముందు పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి మన దేశానికి వచ్చిన బౌద్ధులు, పార్శీలు, క్రైస్తవులు, సిక్కులు, జైనులకు ఇండియన్ సిటిజన్ షిప్ లభిస్తుంది. ఈ ప్రక్రియ మొత్తం ఆన్ లైన్ విధానంలో జరుగుతుంది.