Pushpa 2 The Rule : సీనియర్ హీరోలలో యాంగ్రీ యంగ్ మ్యాన్ ఇమేజ్ ని సొంతం చేసుకొని తనకంటూ ఒక ప్రత్యేకమైన అభిమానులను క్రియేట్ చేసుకున్న వారిలో ఒకరు రాజశేజర్. ఇప్పటి తరానికి ఈయన ఒక ట్రోల్ మెటీరియల్ కావొచ్చు. కానీ ఆరోజుల్లో ఈయన పెద్ద స్టార్ హీరో. చిరంజీవి, బాలకృష్ణ వంటి సూపర్ స్టార్స్ తో సమానంగా ఈయన సినిమాలు ఆడేవి. డాక్టర్ వృత్తి నుండి ఇండస్ట్రీ లో హీరో అవ్వాలి అనే ఆశతో వచ్చిన ఈయనకి, ఆరంభం లో చిన్న చిన్న పాత్రలే దక్కాయి. కొన్ని సినిమాల్లో విలన్ గా కూడా నటించాడు. అలా వచ్చిన ప్రతీ అవకాశాన్ని ఉపయోగించుకుంటూ హీరో గా మారి అంకుశం, మగాడు, ఆహుతి, అల్లరి ప్రియుడు ఇలా ఒక్కటా రెండా ఎన్నో సూపర్ హిట్, ఇండస్ట్రీ హిట్స్ తో అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా ఎదిగాడు. ఆరోజుల్లో రాజశేఖర్ సినిమా వస్తుందంటే ఫ్యామిలీ ఆడియన్స్ కచ్చితంగా థియేటర్స్ కి వెళ్లి చూడాలి అని అనుకునేవారట.
అందుకే అప్పట్లో రాజశేఖర్ సినిమాలకు టాక్ తో సంబంధం లేకుండా మినిమం గ్యారంటీ వసూళ్లు వచ్చేవి. మాస్ లో కూడా ఆయనకీ మంచి ఫ్యాన్ బేస్ ఉండేది. అలాంటి ఫ్యాన్స్ లో ఒకరు మన మాస్టర్ మైండ్ సుకుమార్. నేడు రాజమౌళి తర్వాత ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లో అతి పెద్ద స్టార్ డైరెక్టర్ ఎలా చలామణి అవుతున్నాడో మన అందరికీ తెలిసిందే. ఆయన ఈ స్థాయిలో ఉండడానికి కారణం రాజశేఖర్ అట. రీసెంట్ గానే ఒక ఇంటర్వ్యూ లో పాల్గొన్న ఆయన, రాజశేఖర్ గురించి మాట్లాడుతూ ‘నేను చిన్నతనం లో రాజశేఖర్ కి వీరాభిమానిని. ఆయన సినిమాలు చూస్తూ పెరిగాను. ఆయన చిత్రం లోని సన్నివేశాలను ఇమిటేట్ చేసేవాడిని. దానివల్ల నాకు చాలా పేరొచ్చింది. ఒకవిధంగా నేను ఇండస్ట్రీ లోకి వచ్చి సక్సెస్ అవ్వగలను అనే నమ్మకం, ధైర్యం కలిగింది రాజశేఖర్ వల్లనే’ అంటూ ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.
సుకుమార్ ఇప్పుడు పుష్ప 2 చిత్రంతో ఇండస్ట్రీ రికార్డ్స్ ని కొల్లగొట్టి సుమారుగా 2000 కోట్ల రూపాయిల వసూళ్లను రాబట్టే రేంజ్ కి వచ్చాడంటే అందుకు పరోక్షంగా రాజశేఖర్ కూడా ఒక కారణం అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఒక స్టేజి కి వచ్చిన తర్వాత ఏ హీరో అయినా ఫేడ్ అవుట్ అవ్వాల్సిందే. రజినీకాంత్, అమితాబ్ బచ్చన్ లాంటి సూపర్ స్టార్ సినిమాలకే ఈమధ్య వసూళ్లు రావడం లేదు. అలా అని వాళ్ళు సాధించిన రికార్డ్స్, సృష్టించిన చరిత్రని అంత తేలికగా ఎవ్వరూ మర్చిపోలేరు కదా. రాజశేఖర్ కి కూడా ఒకప్పుడు అలాంటి చరిత్ర ఉండేది. ఇప్పుడు జగపతి బాబు లాగా విలన్ రోల్స్ చేయడానికి సిద్దంగానే ఉన్నాడు కానీ, రెగ్యులర్ విలన్ రోల్స్ కి మాత్రం ససేమీరా నో చెప్తున్నాడు.