Hero Raj Tarun: ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టడమే పెద్ద సాహసం, అలాంటిది అదృష్టం కలిసొచ్చి తొలి రెండు మూడు సినిమాలు ఒక కుర్ర హీరో కి సూపర్ హిట్స్ గా నిలవడం మామూలు విషయం కాదు. ఉదయ్ కిరణ్ కి అప్పట్లో ఇలా జరిగింది, ఆ తర్వాత హీరో రాజ్ తరుణ్(Raj Tarun) కి కూడా జరిగింది. అసిస్టెంట్ డైరెక్టర్ గా ఇండస్ట్రీ లో కొనసాగుతున్న సమయంలో ఆయనకు అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మాణం లో తెరకెక్కిన ‘ఉయ్యాలా జంపాలా’ చిత్రంలో హీరో గా నటించే ఛాన్స్ దక్కింది. ఈ సినిమా కమర్షియల్ గా పెద్ద హిట్ అవ్వడం తో రాజ్ తరుణ్ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ఈ సినిమా తర్వాత సినిమా చూపిస్తా మావ, కుమారి 21 F, ఆడోరకం ఈడోరకం వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించాడు.
కానీ ఆ తర్వాత వరుసగా ఫ్లాప్స్ రావడం తో మార్కెట్ మొత్తాన్ని కోల్పోవాల్సి వచ్చింది. ఒకప్పుడు రాజ్ తరుణ్ సినిమా వస్తుందంటే మార్కెట్ లో కనీస స్థాయి బజ్ ఉండేది. కానీ ఇప్పుడు ఆయన సినిమాలు ఎప్పుడు వస్తున్నాయో, ఎప్పుడు వెళ్తున్నాయో కూడా తెలియని పరిస్థితి. దానికి తోడు రీసెంట్ గా ఆయన లావణ్య అనే అమ్మాయితో నడిపిన ప్రేమ వ్యవహారానికి సంబంధించిన కేసు లో బాగా నెగిటివ్ అయ్యాడు. తన తప్పు ఏమి లేదు,లావణ్య అనే అమ్మాయి కావాలని రాజ్ తరుణ్ ని ఇబ్బంది పెట్టాలని చూసింది అనే విషయం అందరికీ అర్థం అయ్యింది, కానీ నిరంతరం నెగిటివ్ వార్తల్లో ఉండడం వల్ల రాజ్ తరుణ్ ఇమేజ్ బాగా పడిపోయింది. ఇకపోతే రీసెంట్ గా ఆయన ‘పంచ్ మినార్’ అనే చిత్రం లో హీరో గా నటించాడు. ఈ నెల 21న ఈ చిత్రం థియేటర్స్ లోకి రాబోతున్న సందర్భంగా వరుసగా ప్రమోషనల్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు.
అందులో భాగంగా ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూ లో రీసెంట్ గా తన జీవితం లో చోటు చేసుకున్న కొన్ని సంఘటనలను తల్చుకుంటూ రాజ్ తరుణ్ ఎమోషనల్ అయ్యాడు. ఆయన మాట్లాడుతూ ‘వివాదాల గురించి నన్ను స్పందించమని, మాట్లాడమని కొందరు అడుగుతూ ఉంటారు. కానీ నాకు వాటి గురించి మాట్లాడడం ఇష్టం లేదని చెప్పాను. నా దగ్గర అందుకు సమాధానం లేకనో, లేదా ధైర్యం లేకనో కాదు, వెనక్కి తిరిగి చూడడం ఇష్టం లేక మాట్లాడడానికి ఆసక్తి చూపలేదు. ఈమధ్య కాలం లో నా ప్రమేయం ఏమి లేకుండా నా వెనుక ఎన్నో సంఘటనలు జరిగాయి. ఇలాంటి సమయం లో నేను చేయగలిగింది ఏమి లేదు. అటు ఇటు చూడకుండా నేను వెళ్తున్న దారిలో వెళ్లిపోవడమే. అక్కడక్కడా నన్ను ఇండస్ట్రీ లో తొక్కే వాళ్ళు ఉన్నారు, తొక్కినా పర్లేదు, నను స్ప్రింగ్ లాంటోడిని , నాకు ఒకే’ అంటూ చెప్పుకొచ్చాడు రాజ్ తరుణ్.