SPY Teaser : హ్యాపీ డేస్ సినిమా ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన నటుడు నిఖిల్ సిద్ధార్థ ఆలియాస్ నిఖిల్. ఈ యువ నటుడు తన కెరియర్లో చాలా ప్రయోగాలు చేశాడని చెప్పాలి. హ్యాపీ డేస్ తర్వాత యువత, కార్తికేయ, సూర్య వర్సెస్ సూర్య, శంకరాభరణం, కిరాక్ పార్టీ, కార్తికేయ 2, 18 పేజెస్ వంటి వైవిధ్యభరితమైన సినిమాలు చేసి తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఏర్పరచుకున్నాడు. ముఖ్యంగా కార్తికేయ సినిమాలో అతని నటన మరో స్థాయిలో ఉంటుంది. ఇక సూర్య వర్సెస్ సూర్యలో అయితే జీవించాడు అనే పదం కూడా తక్కువవుతుంది. అలాంటి నిఖిల్ ఇప్పుడు దేశభక్తి జోనర్ లో స్పై అనే పేరుతో రూపొందుతున్న సినిమాలో జై అనే పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన టీజర్ యూట్యూబ్లో విడుదలైంది. ఆ టీజర్ చూస్తే నిఖిల్ పడిన కష్టం కళ్ళ ముందు కనిపిస్తోంది. అంతేకాదు ఆ టీజర్ మరింత ప్రామిసింగ్ గా ఉంది.
ప్రయోగాలకు కొత్తపీట
సినిమా అనేది కమర్షియల్ హంగులతో ఉంటుంది. నిర్మాత కోట్లకు కోట్లు డబ్బులు పెట్టుబడి పెడతారు కాబట్టి వాటికంటే ఎక్కువ రావాలని కోరుకుంటాడు. ఇందులో భాగంగానే దర్శకుడితో కమర్షియల్ హంగులు ఉండేలా మార్పులు చేర్పులు చేయిస్తూ ఉంటాడు. కొన్ని సినిమాలు కమర్షియల్ హంగులకు దూరంగా ఉంటూనే నిర్మాతలకు కోట్లు తెచ్చి పెడుతూ ఉంటాయి. అలాంటి సినిమాలను మాత్రమే ఎంపిక చేసుకునే నటుల్లో నిఖిల్ ఒకడు. ఈయన ఇప్పటివరకు నటించిన సినిమాల్లో ఒక్కటంటే ఒక్కటి ద్వంద్వార్థంతో, బూతులతో, వెకిలి సీన్లు ఉన్న సినిమా లేదంటే అతిశయోక్తి కాక మానదు. అందువల్లే ప్రస్తుతం ఉన్న యువ నటుల్లో మోస్ట్ ప్రామిసింగ్ యాక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు. ప్రయోగాలకు పెద్దపీట వేస్తూ తనకు తానే సాటి అని నిరూపించుకుంటున్నాడు.
ఇప్పుడు రూట్ మార్చాడు
ఇక తాజాగా నిఖిల్ కార్తికేయ_2 విజయం తర్వాత తన రూటు పూర్తిగా మార్చేశాడు. ఈసారి ఏకంగా దేశభక్తి నేపథ్యంలో రూపొందుతున్న స్పై అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించి విడుదలైన టీజర్ ఆసక్తి కలిగిస్తోంది. ఎడిటర్ గ్యారి బీహెచ్ ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. తమిళ చిత్రసీమకు చెందిన ఐశ్వర్య మీనన్ ఈ సినిమా ద్వారా కథానాయకగా తెలుగు పరిశ్రమకు పరిచయం అవుతోంది. స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ మరణం వెనుక దాగిన రహస్యాల ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది.. ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ఆసక్తి కలిగిస్తోంది. జూన్ 28న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాకు సంబంధించి చిత్ర బృందం ఢిల్లీలోని కర్తవ్య పథ్ వద్ద టీజర్ విడుదల చేసింది. పాన్ ఇండియా లెవెల్ లో ఈ సినిమాను విడుదల చేయబోతోంది. కార్తికేయ _2 పాన్ ఇండియా రేంజ్ లో విజయవంతం కావడంతో తన మార్కెట్ ను మరింత పెంచుకునేందుకు నిఖిల్ ఈ సినిమాను తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదల చేయబోతున్నాడు.. హ్యాపీ డేస్ సినిమా ద్వారా ఒక మామూలు నటుడుగా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన నిఖిల్..ఇవాళ పాన్ ఇండియా రేంజ్ లో మార్కెట్ పెంచుకున్నాడు అంటే మామూలు విషయం కాదు.