Bigg Boss Telugu: ప్రతీ ఏడాది లాగానే ఈ ఏడాది కూడా బిగ్ బాస్ సీజన్ అట్టహాసం గా ప్రారంభం కానుంది. రీసెంట్ గానే ‘అగ్నిపరీక్ష 2’ కి సంబంధించిన దరఖాస్తులు కూడా స్వీకరించిన బిగ్ బాస్ టీం , ఈ నెల 27 నుండి ఈ షో ని ప్రారంభించనుంది. ఆగస్టు 15 నుండి సెప్టెంబర్ 6 వరకు ఈ షో కి సంబంధించిన ఎపిసోడ్స్ జియో హాట్ స్టార్ మరియు స్టార్ మా ఛానల్ లో టెలికాస్ట్ కానుంది. ఈ షో ద్వారా సామాన్యులను బిగ్ బాస్ హౌస్ లోకి పంపనున్నారు. గత సీజన్ లో లాగానే ఈ సీజన్ లో సామాన్యులుగా అడుగుపెట్టిన కంటెస్టెంట్స్ ఏ రేంజ్ సునామీ ని సృష్టించారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. సామాన్యుడిగా అడుగుపెట్టిన కళ్యాణ్ పడాల టైటిల్ విన్నర్ గా నిలిచాడు , అదే విధంగా మరో సామాన్యుడు డిమోన్ పవన్ టాప్ 3 కంటెస్టెంట్ గా నిలిచి సెన్సేషన్ సృష్టించాడు.
ఈ ఏడాది కూడా అలాంటి సామాన్యుల కోసం వేట గట్టిగానే జరగబోతుంది. ఇదంతా పక్కన పెడితే ఈ షో గురించి రెండు సార్లు కంటెస్టెంట్ గా బిగ్ బాస్ షో లో పాల్గొన్న హరితేజ మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ఆమె మాట్లాడుతూ ‘బిగ్ బాస్ మొదటి సీజన్ మన హైదరాబాద్ లో జరగలేదు. ముంబై కి దగ్గర్లో ఉన్నటువంటి లోనావాలాలో జరిగింది. ఒక అడవి లో బిగ్ బాస్ సెట్ వేశారు. రాత్రి సమయంలో పులుల గర్జనలకు సంబంధించిన శబ్దాలు కూడా మాకు వినిపించేవి. ఒక్కోసారి మా హౌస్ లోకి పాములు కూడా వచ్చేవి. కానీ నేను ఎలాంటి కలత చెందలేదు , ఆ షో ని బాగానే ఎంజాయ్ చేశాను. ఆ అనుభవాలు భయంకరమైనవే , కానీ చాలా థ్రిల్లింగ్ గా అనిపించేవి. ఆ సీజన్ లో హోస్ట్ జూనియర్ ఎన్టీఆర్ తో మేము చేసిన సరదా సంభాషణలు ఇప్పటికీ గుర్తున్నాయి’.
‘కానీ బిగ్ బాస్ 8 లో కంటెస్టెంట్ గా పాల్గొన్న తర్వాత నాకు ఆ షో పై నా అభిప్రాయం మారింది. ఈ షో కారణంగా నా ఇమేజ్ బాగా దెబ్బతినింది. బయట నాపై చాలా నెగెటివిటీ పెరిగింది. వాటి వల్ల నేను డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాను. తిరిగి కోలుకోవడానికి నాకు చాలా సమయమే పట్టింది. ఇప్పుడు ఆ రియాలిటీ షో పై పూర్తిగా ఆసక్తి పోయింది. ఒక్కమాటలో చెప్పాలంటే ఆ షో పై చిరాకు కలుగుతుంది. మళ్లీ ఆ షో కి వెళ్లాలనే ఆలోచన నాకు అసలు లేదు’ అంటూ చెప్పుకొచ్చింది హరితేజ. బిగ్ బాస్ సీజన్ 1 లో టాప్ 3 కంటెస్టెంట్ గా నిల్చిన హరితేజ, బిగ్ బాస్ సీజన్ 8 లో వైల్డ్ కార్డు గా ఎంట్రీ ఇచ్చి కేవలం నాలుగు వారాలకే ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే.
